– తెలంగాణకు చెందినవారు మిగిలింది 11 మంది మాత్రమే
– మాజీ చీఫ్ గణపతి కోసం గాలిస్తున్నాం
– జరుగుతున్న అభివృద్ధితో మావోయిస్టులకు తిరిగి స్థానం లేదు
– లొంగుబాట్లపై ఎలాంటి డెడ్‌లైన్‌లూ లేవు అగ్రనేతలు దేవ్‌జీ,
– మల్లా రాజిరెడ్డి, దామోదర్, గంగన్నల సరెండర్ సందర్భంగా డీజీపీ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : సీపీఐ(మావోయిస్టు)కు చెందిన నలుగురు అగ్రనేతల లొంగుబాటుతో ఆ పార్టీ సాయుధ పోరాటం ఇక ముగిసినట్టేనని రాష్ట్ర డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డి ప్రకటించారు. మంగళవారం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి ఎలియాస్ సంగ్రామ్, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్ ఎలియాస్ జగన్, రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనె నర్సింహరెడ్డి ఎలియాస్ గంగన్నలు తమ ఎదుట లొంగిపోయినట్టు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్(ఐసీసీ)లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర డీజీపీ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ… ఒకేసారి నలుగురు అగ్రనా యకులు లొంగిపోవడం, అందులో పార్టీ ప్రధాన కార్యదర్శిగా చెప్పబడుతున్న దేవ్‌జీ ఉండటం రాష్ట్ర పోలీసులు జరిపిన కృషికి నైతిక విజయమని గర్వంగా తెలిపారు. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతంలో మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని చేసిన విజ్ఞప్తి మేరకే వీరు లొంగుబాటులో నడిచారని ఆయన చెప్పారు. దాదాపు 40 ఏండ్లకు పైగా మావోయిస్టు ఉద్యమంలో అజ్ఞాతంలో గడిపిన వీరి కోసం కేంద్ర, రాష్ట్ర సాయుధ బలగాలు కొన్నేండ్లుగా గాలింపు చర్యలు సాగించాయనీ, చివరికి ఈ లొంగు బాటుతో మావోయిస్టు ఉద్యమానికి దాదా పుగా తెరపడినట్టేనని డీజీపీ తెలిపారు. వీరిలో దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డిలపై రూ.25 లక్షల చొప్పున రివార్డు ఉండగా, మిగతా ఇద్దరిపై రూ.20 లక్షల చొప్పున పారితోషకం ఉందని చెప్పారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రివార్డును కలిపితే వీరిలో ఒక్కొక్కరికి రూ.90 లక్షల చెక్కులను ఈ కార్యక్రమంలో అందజేస్తున్నామని డీజీపీ స్పష్టం చేశారు. అనారోగ్యం, సాయుధ బలగాల వ్యూహాత్మక ఒత్తిడి, నాయకుల మధ్య అంతర్గత విభేదాలు, జరుగుతున్న ఎన్ కౌంటర్‌లు… వెరసి ఈ నాయకుల లొంగు బాటుకు దారి తీశాయని వివరించారు.
‘గణపతి గురించి ఆరా తీస్తున్నాం’
కేంద్ర కమిటీ సభ్యుడు, సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఇంచార్జి కూడా అయిన దేవ్‌జీని ఇంకా ఆ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎన్నుకోలేదనీ, ప్రచారం మాత్రమే జరిగిందని శివధర్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం కేంద్ర కమిటీలో ఉన్న ముగ్గురిలో ముప్పాల లక్ష్మణ్‌రావు ఎలియాస్ గణపతి దండకారణ్యంలో లేరనీ, ఆయన ఎక్కడున్నాడనే విషయంపై ఆరా తీస్తున్నామని చెప్పారు. మిగతా ఇద్దరిలో బెస్ర జార్ఖండ్‌లో, నరహరి ఛత్తీస్‌గఢ్‌లో ఉన్నట్టు సమాచారముందని వివరించారు. వీరి లొంగుబాటు కోసం కూడా ప్రయత్నాలు తీవ్రతరం చేశామని ఆయన తెలిపారు.
‘అజ్ఞాతంలో 11 మంది మావోయిస్టులు’
ఇక మిగిలినవారిలో గణపతి భార్య జోడె లక్ష్మీబాయితో సహా 11 మంది మావోయిస్టులు వివిధ శ్రేణిలలో పని చేస్తూ అజ్ఞాతంలో ఉన్నారనీ, వారిలో కేవలం సాంబయ్య అనే రాష్ట్ర కమిటీ సభ్యుడు మాత్రమే చురుకుగా ఉన్నాడనీ, వీరిని కూడా లొంగిపోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని డీజీపీ చెప్పారు. ‘ఇది మావోయిస్టుల్లో కేవలం ఆకు రాలే కాలమా? లేక చెట్టు మొత్తం వాడిపోయినట్టా’ అనే ప్రశ్నకు చెట్టు వాడిపోవడమే కాదు.. దాని నిర్మాణ క్రమం పూర్తిగా ధ్వంసమైందని డీజీపీ సమాధానమిచ్చారు. ‘వీరు ఆయుధాలతో లొంగిపోయారా’ అనే ప్రశ్నకు ఆ విషయం తర్వాత చెప్తామని జవాబిచ్చారు. మావోయిస్టు అగ్రనేతలు తెలంగాణలోనే లొంగిపోవడానికి కారణమేంటనే ప్రశ్నకు.. ఇక్కడి ప్రభుత్వం లొంగుబాటు కోసం ప్రకటించిన పథకాలను చిత్తశుద్ధితో అమలు చేయడం, వారికి నూతన జీవనం గడపడానికి అవసరమైన వాతావరణాన్ని కల్పించడం, వారిపై ఉన్న కేసుల పట్ల కక్షపూరితంగాగాక సానుభూతితో వ్యవహరించడం వంటివి వారి లొంగుబాట్లకు కారణాలుగా ఆయన అభివర్ణించారు.
‘మాకు డెడ్‌లైన్ లేదు’
గణపతి మీ కాంటాక్ట్‌లోనే ఉన్నాడా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. అలా జరిగితే ఇంకా మంచిదే కదా అని డీజీపీ చెప్పారు. కేంద్ర హౌం శాఖ పెట్టిన డెడ్‌లైన్‌కు అనుకూలంగా మీరు వ్యవహరిస్తున్నారా అనే ప్రశ్నకు.. మాకు ఎలాంటి డెడ్‌లైన్‌లూ లేవు, మావోయిస్టులను లొంగుబాట్లకు ప్రోత్సహించడం చాలా ఏండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తున్నదే అని ఆయన సమాధానమిచ్చారు. నలుగురు కేంద్ర కమిటీ సభ్యులు, 15 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు, 25 మంది డివిజనల్ కమిటీ కార్యదర్శులు కలుపుకొని 2024, 2025తో పాటు ఈ ఏడాది ఇప్పటి వరకు 591 మంది మావోయిస్టులు లొంగిపోయారని ఆయన వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దండకారణ్యం మొదలుకొని ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధితో పాటు దేశ ప్రజల సంక్షేమానికి చేపట్టిన పథకాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల నేపథ్యంలో మావోయిస్టులు తిరిగి పుంజుకునే సమస్యే ఉత్పన్నం కాదని ఆయన మరో ప్రశ్నకు జవాబిచ్చారు. మావోయిస్టు ఉద్యమం తెలంగాణలోనే పుట్టింది, ఇక్కడే ముగుస్తున్నదని డీజీపీ వ్యాఖ్యానించారు.
మావోయిజానికి మరణం లేదు
అనారోగ్య కారణాలతోనే లొంగిపోయాం
పార్లమెంటు సిస్టంలోకి వెళ్లం..
రాజకీయ పోరాటం చేస్తాం : దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి
ప్రపంచంలో మావోయిజానికి మరణం లేదనీ, అది ప్రజల కోసం జీవధారగా పని చేస్తూనే పోతుందని లొంగి పోయిన మావోయిస్టు అగ్రనేతలు తిప్పిరి తిరుపతి ఎలి యాస్ దేవ్‌జీ, మల్లారాజిరెడ్డి ఎలియాస్ సంగ్రామ్‌లు ప్రకటించారు. మంగళవారం బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్‌లో జరిగిన తమ లొంగుబాటు మీడియా సమావేశంలో విలేకరుల ప్రశ్నలకు దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డిలు సమాధానాలిచ్చారు. తీవ్రమైన అనారోగ్యం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన పిలుపుతో తాను లొంగుబాటులో నడిచానని మొదట దేవ్‌జీ చెప్పారు. ‘మావోయిజం పట్ల విశ్వాసం తగ్గిపోయిందా’ అన్న ప్రశ్నకు అది తమ జీవిత కాలంలో జరగదనీ, పీడిత, తాడిత వర్గాల కోసం నిరంతరం మావోయిజం జీవనధారగా పని చేస్తూ పోతుందని ఆయన స్పందించారు. అదే సమయంలో విలేకరులు వేసిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ.. ”మీకు అనేక సందేహాలు ఉంటాయి. కానీ ఈ సమయంలో సమాధానమివ్వను. తర్వాత సమయం ఉంది. మీ అందరి సందేహాలను తీరుస్తూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తాను” అని దేవ్‌జీ స్పష్టం చేశారు. అయితే తాను శాంతి యుతంగా జీవితం గడపడానికి వెలుపలికి రాలేదనీ, నిరంతరం ప్రజా సమస్యలపై రాజకీయంగా పోరాటం జరుపుతానని తెలిపారు.
మల్లా రాజిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజల కోసమే మావోయిస్టు పంథాలో నడిచామనీ, మారిన పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి పిలుపు మేరకు జనజీవన స్రవంతిలో చేరడానికి వచ్చానని తెలిపారు. భవిష్యత్తులో మావోయిస్టు పథం, ఆశయాల నుంచి పక్కకు తప్పుకోబోమని అన్నారు. చట్టపరిధిలోనే ప్రజా సమస్యలపై చైతన్యవంతమైన పోరాటమే జరుపుతామని చెప్పారు. అయితే పార్లమెంటు సిస్టంలోకి రాబోమని ఆయన మరో ప్రశ్నకు స్పష్టం చేశారు. ‘అజ్ఞాతంలో ఉన్న మిగతా శ్రేణులను వెలుపులికి రమ్మని పిలుస్తారా?’ అనే ప్రశ్నకు అది వారు నిర్ణయం తీసుకుంటారని అన్నారు. మిగతా విషయాలను త్వరలోనే వెల్లడిస్తాననీ, ఈ సమయంలో ఏది చెప్పినా అనేక అపోహలకు దారి తీస్తుందని దేవ్‌జీ, రాజిరెడ్డిలు చివరగా తెలిపారు.
దేవ్‌జీ, రాజిరెడ్డి ప్రస్థానం
తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్‌జీ
మావోయిస్టు పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడైన తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్‌జీ (62) జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందినవారు. 1982లో సీపీఐ(ఎంఎల్) పీపుల్స్ వార్‌లో చేరారు. గణపతి సూచనల మేరకు మల్లా రాజిరెడ్డితో కలిసి సాయుధ దళంలో పని చేయడానికి దండకారణ్యానికి వెళ్లారు. 1991లో మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాకు చెందిన అరికె జైనీ ఎలియాస్ సృజనను వివాహం చేసుకున్నారు. వివాహ సమయంలో ఆమె పెరిమిలి దళంలో పార్టీ సభ్యురాలిగా పని చేస్తుండేవారు. 2020లో మహా రాష్ట్రలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆమె మృతి చెందారు. ఈయన 1984 నుంచి 1987 వరకు సిరోంచా ప్రాంత సాయుధ దళం కమాండర్‌గా, ఆ తర్వాత 1989 వరకు పెరిమిలి దళం కమాండర్‌గా పని చేశారు. 1989లో ఈయన డివిజనల్ కమిటీ సభ్యుడు (డీవీసీఎం)గా పదోన్నతి పొంది, గడ్చిరోలి డివిజనల్ కమిటీలో పని చేశారు. ఆ తర్వాత వివిధ హౌదాల్లో పని చేసిన ఆయన 2017లో సెంట్రల్ మిలిటరీ కమిషన్ (సీఎంసీ) ఇంచార్జి బాధ్యతలను స్వీకరించి, పొలిట్‌బ్యూరో సభ్యులు (పీబీఎం)గా ఎన్నిక య్యారు. ఆ బాధ్యతలను ఇప్పటికీ నిర్వహిస్తున్నారు.
మల్లా రాజిరెడ్డి ఎలియాస్ సంగ్రామ్
మల్లా రాజిరెడ్డి (76) పెద్దపల్లి జిల్లా మంథని మండలం శాస్త్రుపల్లె గ్రామానికి చెందినవారు. ఈయనకు 1975లో రత్తమ్మ ఎలియాస్ నిర్మలతో వివాహమైంది. 1998లో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆమె మృతి చెందారు. 1971లో ఇంటర్ విద్యను పూర్తి చేసిన ఆయన.. 1974లో ఆర్‌ఎస్‌యూలో చేరారు. 1978-80 వరకు గోదావరిఖని ప్రాంతంలోని బొగ్గు గనుల ప్రాంతంలో ఆర్గనైజర్‌గా పని చేశారు. 1989లో మంగి సాయుధ దళంలో చేరారు. 1981లో ఈయనకు డీవీసీఎంగా పదోన్నతి వచ్చి.. గడ్చిరోలి ప్రాంతానికి బదిలీ అయ్యారు. 1985లో ఆ ప్రాంత డివిజనల్ కమిటీ కార్యదర్శిగా పదోన్నతి పొందారు. ఆ తర్వాత వివిధ హౌదాల్లో పని చేశారు. 2022 నుంచి దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (డీకేఎస్‌జెడ్‌సీ)కి ఇంచార్జిగా కొనసాగుతున్నారు.



