Thursday, November 20, 2025
E-PAPER
Homeజాతీయంమళ్లీ దద్దరిల్లిన మారేడుమిల్లి

మళ్లీ దద్దరిల్లిన మారేడుమిల్లి

- Advertisement -

ఏపీ అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌
ఏడుగురు మావోయిస్టులు మృతి
వీరిలో ముగ్గురు మహిళలు : ఏపీ ఇంటెలిజెన్స్‌ ఏడీజీ మహేశ్‌ చంద్ర లడ్హా వెల్లడి

అమరావతి : ఏపీలోని అల్లూరి సీతారామ రాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతం మళ్లీ కాల్పుల మోతతో దద్దరిల్లింది. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌ను ఏపీ ఇంటెలిజెన్స్‌ అదనపు డీజీ మహేశ్‌ చంద్ర లడ్హా ధ్రువీకరించారు. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేత మడ్వి హిడ్మాతో పాటు మరో ఐదుగురి ఎన్‌కౌంటర్‌ జరిగిన తర్వాతి రోజే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. మహేశ్‌ చంద్ర లడ్హా విలేకరుల సమావేశంలో ఎన్‌కౌంటర్‌ వివరాలను వెల్లడించారు. నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు భద్రతా బలగాలు ఈ ఆపరేషన్‌ను చేపట్టాయి. మంగళవారం జరిపిన ఆపరేషన్‌కు కొనసాగింపుగా తాజా ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇప్పటి వరకు ఏడుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ముగ్గురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. మృతుల్లో శ్రీకాకుళానికి చెందిన మేటూరి జోగా రావు ఎలియాస్‌ ‘టెక్‌’ శంకర్‌తో పాటు జ్యోతి ఎలియాస్‌ సరిత, సురేశ్‌ ఎలియాస్‌ రమేశ్‌, లోకేశ్‌ ఎలియాస్‌ గణేశ్‌, సైను ఎలియాస్‌ వాసు, అనిత, షమ్మీ లు ఉన్నారు.

శంకర్‌.. ఏఓబీ ఏరియా కమిటీ మెంబర్‌గా ఉన్నారు. టెక్నికల్‌ ఆపరేషన్‌, ఆయుధాల తయారీ, కమ్యూనికేషన్‌లో ఈయనకు మంచి పట్టున్నది. కాగా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల కూంబింగ్‌ కొనసాగుతోంది. మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా ఎన్టీఆర్‌, కృష్ణా, కాకినాడ, కోనసీమ, ఏలూరు జిల్లాల నుంచి ఇప్పటికే 50 మంది మావోయిస్టులను అరెస్ట్‌ చేసినట్టు ఆయన చెప్పారు. ఇంత పెద్ద మొత్తంలో మావోయిస్టులు అరెస్ట్‌ కావటం ఇదే తొలిసారి అని వివరించారు. వీరిలో స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యులు ముగ్గురు, ప్లాటూన్‌ సభ్యులు 23 మంది, డివిజినల్‌ కమిటీ సభ్యులు ఐదుగురితో పాటు ఏరియా కమిటీ సభ్యులు 19 మంది ఉన్నారని వివరించారు. భద్రతా దళాలు 45 ఆయుధాలు, 272 రౌండ్ల బుల్లెట్లు, రెండు మ్యాగజైన్లు, 750 గ్రాముల వైరు, ఇతర మెటీరియల్‌ను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. పోలీసులు.. మావోయిస్టుల కదలికలను ఛత్తీస్‌గఢ్‌ నుంచి గమనిస్తున్నారనీ, వారి కార్యకలపాల గురించి తెలుసుకున్న తర్వాతే తాజా ఆపరేషన్‌ను చేపట్టినట్టు వివరించారు. ఇక మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో తప్పించుకున్న మావోయిస్టుల కూడా పట్టుకునేందుకు బృందాలు రంగంలోకి దిగాయని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -