Tuesday, January 27, 2026
E-PAPER
Homeబీజినెస్ఈ వారమూ మార్కెట్లలో ఒత్తిడి..!

ఈ వారమూ మార్కెట్లలో ఒత్తిడి..!

- Advertisement -

– బడ్జెట్‌పైనే భారం..
ముంబయి :
ప్రస్తుత వారంలోనూ భారత మార్కెట్లు ఒత్తిడిని ఎదుర్కోవచ్చని నిపుణులు అంచనా వేస్తోన్నారు. జనవరి 27తో ప్రారంభం కానున్న వారంలో ప్రధానంగా బడ్జెట్‌ అంశాలు దలాల్‌ స్ట్రీట్‌పై ప్రభావం చూపొచ్చని భావిస్తున్నారు. గడిచిన రెండు, మూడు వారాలుగా మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అమెరికాతో టారిఫ్‌ల అనిశ్చితులు, విదేశీ మదుపర్ల వరుస అమ్మకాలతో ఇప్పటికే మార్కెట్లలో విశ్వాసం దెబ్బతినింది. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్‌పై అంచనాల ఆధారంగానే మార్కెట్ల ట్రేడింగ్‌ ఉండొచ్చు. ఆదివారం అయినప్పటికీ ఆ రోజు బిఎస్‌ఇ, ఎన్‌ఎస్‌ఇ సాధారణ పని గంటల్లో పని చేయనున్నాయి. 2025-26 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కార్పొరేట్‌ కంపెనీల ఆర్థిక ఫలితాలు ఇప్పటికే మార్కెట్లను నిరుత్సాహంలో నింపాయి. వీటికి తోడు పారిశ్రామికోత్పత్తి వృద్ధి గణాంకాలు, విదేశీ మదుపర్ల ధోరణి, రూపాయి కదలికలు మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయి.

నిఫ్టీ అంచనాలకు పిఎల్‌ కాపిటల్‌ కోత
సమీప భవిష్యత్తులో మార్కెట్‌ దృక్పథం అప్రమత్తతోనే కొనసాగవచ్చని బ్రోకరేజీ సంస్థ పిఎల్‌ కాపిటల్‌ ఇండియా విశ్లేషించింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా సుంకాల అనిశ్చితి నేపథ్యంలో భారత మార్కెట్లు ప్రస్తుతం పరిమిత శ్రేణిలో కదలాడుతున్నాయని పేర్కొంది. వచ్చే 12 నెలల్లో నిఫ్టీ అంచనాలను 29,094 నుంచి 28,814కు కోత పెట్టింది. రాబోయే కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం భారీ పన్ను రాయితీల కంటే నిర్మాణాత్మక ఆర్థిక సంస్కరణలకే పెద్దపీట వేసే అవకాశం ఉందని ప్రముఖ పిఎల్‌ క్యాపిటల్‌ తన తాజా నివేదికలో విశ్లేషించింది. దశాబ్ద కాలపు కనిష్ఠానికి చేరిన ద్రవ్యోల్బణం, రెపో రేటులో 125 బేసిస్‌ పాయింట్ల తగ్గింపు, గతంలో చేపట్టిన పన్ను కోతలు కొంత వినియోగదారుల డిమాండ్‌ను పెంచుతున్నాయని పిఎల్‌ క్యాపిటల్‌ ఇన్స్‌ట్యూషనల్‌ ప్రతినిధి అమ్నీష్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -