1990 ల ప్రాంతంలో విడుదలైన అనేక యాక్షన్ హాలీవుడ్ మూవీస్‌లో అత్యధిక ప్రేక్షకులను అలరించిన యాక్షన్ పాక్డ్ మూవీ ‘ది మాస్క్ ఆఫ్ జోర్రో’. రాబిన్ హుడ్ ది ఒక తరహా అయితే జోర్రో ది మరో తరహా. అతని స్టైల్ వేరుగా ఉంటుంది. బందిపోటు మాదిరిగా ప్రజాస్వామిక పరిరక్షణలో నియంతత్వం నుంచి అమాయక, అణగారిన ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించటానికి పోరాటం చేస్తాడు.
గుర్రాన్ని అధిరోహిస్తూ, రెండు కళ్ళు కనిపించేలా మొహానికి మాస్క్, తలకి క్యాప్ కూడా ధరించి చేతిలో కరవాలంతో, పూర్తిగా నల్లని దుస్తులతో ఫక్తు నూరు శాతం హీరోయిజానికి ఆద్యుడిలా ఉంటుంది జోర్రో’ వేషధారణ. ఆ కరవాలాన్ని ‘జెడ్’ ఆకారంలో ఝులిపిస్తూ ఉంటాడు. అతను నిష్ణాతుడైన రైడర్, గుర్రం కూడా నల్లగా ఉంటుంది. పరాకాష్ఠకు చెందిన హీరోయిజం ప్రదర్శిస్తూ ప్రేక్షకులకు అంతులేని అభిమానం కలిగేలా అతని చర్యలు ఉంటాయి. జోర్రో తలపై నగదు బహుమతి ఉంటుంది. అతను మెరుపు వేగంతో దూకుడు ప్రదర్శిస్తాడు.
జోర్రో అంటే స్పానిష్ భాషలో నక్క అని అర్థం. నక్కలాంటి చాకచక్యం కారణంగా ప్రజలు అతడిని ‘ఎల్ జోర్రో’ అని పిలుస్తారు.
జాన్టసన్ మెక్ కల్లీ రాసిన కల్పిత పాత్ర ‘జోర్రో’. మార్టిన్ క్యాంప్ బెల్ దర్శకత్వం వహించిన ఈ ‘ది మాస్క్ ఆఫ్ జోర్రో’ చిత్రం 17 జూలై 1998 న విడుదలయింది. అయితే ఈ చిత్రాన్ని ముందుగా 19 డిసెంబర్, 1997 సం.లో విడుదల చేయాలని భావించారు. ఆ సమయం ‘ టైటానిక్’ మూవీ విడుదల ఉండటం వలన విడుదల తేదీ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈ చిత్రం షూటింగ్ మెక్సికోలోని చురుబుస్కో స్టూడియోలో చిత్రీకరణ ప్రారంభం అయింది.
ముసుగు ధరించిన ఖడ్గ వీరుడు జోర్రో స్పానిష్ అణచివేత నుంచి ఆల్టా కాలిఫోర్నియా లోని సామాన్యులను రక్షిస్తాడు. అవినీతి పరుడైన గవర్నర్ డాన్ రాఫెల్ మోంటెరో ముగ్గురు రైతులను బహిరంగంగా ఉరితీయ బోతుంటే జోర్రో ఆ ఉరిశిక్షను ఆపుతాడు. జోర్రో నే డాన్ డియెగో డి వేలా అని మోంటెరో ఊహిస్తాడు. ఒక ఘర్షణలో అతని భార్య హత్యకు గురి అవుతుంది. అతడిని జైలులో బంధిస్తారు.
అసలైన జోర్రో డాన్ డియాగోడిలా వేగా (హాప్ కిన్స్) జైలు నుంచి తప్పించుకుని, తన నుంచి ఎంతోకాలం క్రితం దూరం అయిన కుమార్తెను కనుగొని, తన భార్య మరణానికి కారణం అయిన గవర్నర్‌పై ప్రతీకారం తీర్చుకుంటాడు. అతనికి వారసత్వంగా మరో వ్యక్తి (బాండేరాస్) సహాయం చేస్తాడు. ఇతను డిలావేగా కుమార్తెతో ప్రేమలో పడతాడు. దీర్ఘకాలం పోరాడిన డిలావేగా కు ప్రతిగా బాండేరాస్ పోరాటం చేస్తాడు.
ఈ చిత్రంలో జోర్రో చేసే మరో సాహస కత్యం ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. మోంటెరో తనకు విశ్వాస పాత్రులు అయిన కొందరిని ఒక రహస్య బంగారు గనికి తీసుకు వెళ్తాడు. అక్కడ రైతులు, ఖైదీలు బానిసలుగా ఉంటారు. ఆ బంగారంతో శాంటా అన్నా నుంచి కాలిఫోర్నియాను కొనుగోలు చేయాలని మోంటెరా పధకం. బంగారు గనికి దారితీసే మ్యాప్‌ను దొంగిలించడానికి జోర్రో బయలు దేరతాడు. పేలుడు పదార్ధాలు పేలిపోవటం, కార్మికులు రక్షింప బడటం వంటి దశ్యాల ఫొటోగ్రఫీ చాలా బాగుంటుంది. అలెజాండ్రో మురియేటో/ జోర్రో తనకు పుట్టిన కొడుకుకు జోర్రో సాహస కత్యాలను వివరిస్తాడు.
ఈ చిత్రంలో ఆంటోనియో బాండేరాస్ హీరో. ఈయన నటించిన తొలి చిత్రం లాబ్రింత్ ఆఫ్ ఫ్యాషన్. ఈ చిత్రం 1982 సం.లో విడుదల అయింది. ఆ రోజుల్లో ఈ చిత్రం ది మాస్క్ ఆఫ్ జోర్రో బ్లాక్ బస్టర్ అయింది. 95 మిలియన్ల డాలర్ల వ్యయంతో నిర్మించబడిన ఈ చిత్రం 251 మిలియన్ల డాలర్లు వసూలు చేసింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా 2005లో విడుదలైన ‘ది లెజెండ్ ఆఫ్ జోర్రో’ చిత్రం అంతగా ఆదరణ పొందలేదు. కత్తియుద్ధం తర్వాత మంటలు వ్యాపించడం వంటి గ్రాఫిక్స్ ‘ది మాస్క్ ఆఫ్ జోర్రో’లో హైలెట్ సన్నివేశాలు.
ఈ చిత్రంలో గవర్నర్ మొటిరోగా విలన్ పాత్రలో స్టువర్ట్ విల్సన్ సమవుజ్జీగా కనిపించాడు. హీరోయిన్‌గా క్యాథరిన్ జీటా జోన్స్ అందంగా, హుషారుగా కనిపించింది.
ఒక విధంగా ఈ చిత్రంలో హీరో సూపర్ హీరోగా అన్ని వర్గాల ప్రేక్షకులకు అభిమాన పాత్రుడు అయ్యాడు.
– పంతంగి
శ్రీనివాస రావు,
9182203351
యాక్షన్, అడ్వెంచర్ కలగలసిన ‘ది మాస్క్ ఆఫ్ జోర్రో’
- Advertisement -
- Advertisement -