– బుధవారం గుడిమెలిగె పండుగ
– సిద్ధమైన ఆదివాసీ పూజారుల కుటుంబాలు
– 15 రోజుల ముందుగానే పూజలు ప్రారంభం
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
మేడారం జాతరకు బుధవారం జరుగనున్న గుడిమెలిగె పండుగతో అంకురార్పణ జరుగనుంది. జాతరకు సరిగ్గా 15 రోజుల ముందు ఈ పండుగ ప్రారంభమవుతుంది. బుధవారం సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజులు, పడిగిద్దరాజుల దేవాలయాలను పూజారులు శుద్ది చేసి పవిత్ర పరుస్తారు. ఆదివాసీ సంప్రదాయబద్ధంగా బుధవారం పూజారులు, వారి కుటుంబ సభ్యులు వారి ఇండ్లలో శుద్ధి కార్యక్రమం నిర్వహించాక కొత్త బట్టలు ధరించి ఆదివాసీ వాయిద్యాలతో ఆలయాలకు బయలుదేరుతారు. కన్నెపల్లిలో సారలమ్మ ఆలయం, మేడారంలో సమ్మక్క ఆలయం, కొండాయిలో గోవిందరాజుల ఆలయం, కొత్తగూడ మండలం పూనుగొండ్లలో పగిడిద్దరాజు ఆలయంలో అలికి, రంగు, రంగుల ముగ్గులు వేసి తీర్చిదిద్దుతారు. మేడారంలో అమ్మవార్ల గద్దెలు, ప్రాంగణాన్ని శుద్ధి చేసి అలికి ముగ్గులు వేస్తారు. ఈ 15 రోజులు అమ్మవార్ల గద్దెలను శుభ్రంగా వుంచి జాతరకు సన్నద్ధమవుతారు. దీంతో వన దేవతలను గద్దెలకు ఆహ్వానించే ప్రక్రియ మొదలవుతుంది. గుడిమెలిగె పండుగ అంటే మేడారం జాతర ప్రారంభానికి సంకేతంగా భావిస్తారు. పూర్వం అమ్మవార్ల దేవాలయాలకు బదులు గుడిసెలే వుండేవి. ఆ గుడిసెలకే మండమెలిగి కొత్త కప్పును వేసేవారు. ఆచార వ్యవహారంగా పూర్వం నుంచి ఇప్పటి వరకు ఇదే తంతు కొనసాగుతోంది. గుడిమెలిగె పండుగతోనే అమ్మవార్లను అడవి నుంచి గద్దెలకు ఆహ్వానించే ప్రక్రియ ప్రారంభమవుతుంది.
మేడారం జాతరకు నేడు అంకురార్పణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



