– పూనుగుండ్ల నుంచి బయలుదేరిన పగిడిద్ద రాజు
– నేటి సాయంత్రానికి గద్దెలపైకి పగిడిద్దరాజు, సారలమ్మ, గోవిందరాజులు
– గురువారం సాయంత్రం గద్దెపైకి చేరుకోనున్న సమ్మక్క
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి/ తాడ్వాయి/ మంగపేట
తెలంగాణ కుంభమేళా.. కోట్లాదిమంది గిరిజనుల ఆరాధ్య దైవాలు సమ్మక్క-సారలమ్మ మహా జాతర బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 28 నుంచి నాలుగు రోజులపాటు జరిగే ఈ మహా ఉత్సవానికి ములుగు జిల్లాలోని మేడారం సర్వం సిద్ధమైంది. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామం నుంచి మంగళవారం సమ్మక్క మేనల్లుడు పగిడిద్దరాజు బయలుదేరడంతో జాతర మొదటి ఘట్టం ప్రారంభమైంది. బుధవారం సాయంత్రానికి గద్దెపైకి చేరుకుంటారు. అదే రోజు సాయంత్రం 6.00గంటల సమయంలో కన్నెపల్లి నుంచి ప్రధాన పూజారి కాక సారయ్య ఆధ్వర్యంలో సారలమ్మను డోలు, కొమ్ము వాయిద్యాలతో గద్దెలపైకి చేర్చనున్నారు. ఈ క్రమంలో ములుగు జిల్లా కొండాయి నుంచి గోవిందరాజు కూడా బయలుదేరి వచ్చి గద్దెపై కొలువుదీరనున్నాడు. ఇలా బుధవారం సాయంత్రం 6 గంటల వరకు పగిడిద్ద రాజు, సారలమ్మ, గోవిందరాజు గద్దెలపైకి చేరుకుంటారు. ఆ తర్వాత చిలుకలగుట్టపై నుంచి సమ్మక్కను ప్రధాన పూజారి కొక్కెర కిష్టయ్య కిందకు తీసుకురాగానే ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ గాలిలోకి కాల్పులు జరిపి స్వాగతం పలుకుతారు.
డోలు, కొమ్ము వాయిద్యాలు, ఆదివాసీ యువతీయువకులు నృత్యాల నడుమ 29వ తేదీ(గురువారం) సాయంత్రం 6 గంటలకు సమ్మక్క మేడారం గద్దెపై కొలువుదీరనుంది. 30వ తేదీన గద్దెలపై వీరవనితలకు సందర్శకులు మొక్కులు సమర్పించుకుంటారు. 31వ తేదీన సాయంత్రం 6 గంటలకు సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజులు వన:ప్రవేశం చేయడంతో మేడారం జాతర ముగుస్తుంది. ఈ క్రమంలో అడుగడుగునా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, ములుగు జిల్లా కలెక్టర్ టి.ఎస్ దివాకర, అధికారులు పాల్గొంటారు. ఈ అపురూప దృశ్యాలను తిలకించడానికి లక్షలాది మంది జనం మేడారం గద్దెల పరిసర ప్రాంతానికి చేరుకుంటున్నారు. జాతర కోసం అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. గత కొన్ని రోజులుగా సందర్శకులు పెద్ద సంఖ్యలో మేడారం చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
మేడారం జాతరకు తొలి అడుగు..
గంగారం మండలం పూనుగొండ్ల గ్రామంలో మంగళవారం సమ్మక్క మేనల్లుడు పగిడిద్దరాజును పెనక వంశీయుల సంప్రదాయం ప్రకారం.. పెండ్లి కుమారుడిగా ముస్తాబు చేశారు. పగిడిద్దరాజుకు మేడారం సమ్మక్క దేవాలయం నుంచి పట్టువస్త్రాలు తెచ్చిన మంత్రి సీతక్క పెనక వంశీయులకు అందజేశారు. పసుపు, కుంకుమలు అద్ది, వెదురు ప్రతిమ రూపంలో పడిగెపై పగిడిద్దరాజును ఉంచి సుమారు 70 నుంచి 80కిలోమీటర్ల అటవీ మార్గం గుండా కాలినడకన మేడారానికి బయలుదేరారు. దారి పొడవునా కన్నెపల్లి, గుండ్లవాగు ప్రాజెక్టు వంటి ప్రాంతాల్లో బస చేస్తారు. ముఖ్యంగా పూనుగొండ్ల మహిళలు ‘వరుడిగా వెళ్లి.. మరువెళ్లికి రావయ్యా’ అంటూ సాగనంపుతారు. పగిడిద్దరాజు మేడారం గద్దెపై కొలువుదీరిన తర్వాతే, మహాజాతర అధికారికంగా ప్రారంభమైనట్టు. ఆ తదుపరి చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లిని తీసుకొచ్చే ప్రధాన ఘట్టం మొదలవుతుంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి లక్షలాది మంది సందర్శకులు తరలి వస్తున్నారు.
అధికార లాంఛనంగా..
ఈసారి రూ.101 కోట్లతో గద్దెలను పునర్నిర్మాణం చేసి ఘనంగా నిర్వహించడం జాతర చరిత్రలో ఒక మైలురాయి. ఎన్నడూ లేనివిధంగా జాతర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.251 కోట్లు మంజూరు చేయడం విశేషం. మేడారం గ్రామ పరిసర ప్రాంతాల్లో బిటీ రోడ్ల స్థానంలో సీసీ రోడ్లను డబుల్ లైన్ రోడ్లుగా వేశారు. ములుగు ఎమ్మెల్యే, మంత్రి ధనసరి అనసూయ సీతక్క రాత్రింపవళ్లు మేడారంలోనే బస చేస్తూ పనులను నిత్యం దగ్గరుండి సకాలంలో పూర్తి చేయడానికి తీవ్రంగా కృషి చేశారు. జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పీ సురేంద్ర రాంనాధ్ కేకన్ అనునిత్యం పర్యవేక్షించారు.
హెలికాప్టర్ సేవలు..
రాష్ట్ర పర్యాటక శాఖ హన్మకొండ జిల్లా కేంద్రం నుంచి మేడారం వరకు, మేడారం నుంచి హన్మకొండ వరకు హెలికాప్టర్‌లో సందర్శకులు జాతరకు వెళ్లడానికి ఏర్పాట్లు చేసింది. రూ.31 వేలు టికెట్ ధర నిర్ణయించింది. మేడారం పరిసర ప్రాంతాల్లో హెలికాప్టర్ ద్వారా పర్యటించడానికి ఒక్కొక్కరికి రూ.4,800 టికెట్ ధరగా నిర్ణయించారు. హెలికాప్టర్ సేవలను థంబి ఏవియేషన్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ నిర్వహిస్తుంది. ఫోన్ నెంబర్లు 9676320139, 8530004309, 7660939509, వెబ్‌సైట్ http://www.helitaxii.comను సంప్రదించాలి.
మేడారం మహాజాతర షురూ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



