Thursday, January 22, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఏడు రోజుల్లో మేడారం మహా జాతర

ఏడు రోజుల్లో మేడారం మహా జాతర

- Advertisement -

– విధుల్లో 50 వేలమంది అధికార యంత్రాంగం
– రూ. 251 కోట్లతో విస్తృత ఏర్పాట్లు
– సరైన సమయంలో పనులు పూర్తి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన సమ్మక్క, సారలమ్మ జాతర ప్రారంభానికి మరో వారం రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ జాతర ఏ విధమైన ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజులపాటు జరిగే ఈ జాతరకు దాదాపు కోటిన్నరకు పైగా మంది భక్తులు హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేసింది. మేడారం చరిత్రలో మరెన్నడూ లేని విధంగా 2026 జాతరకు రూ. 251 కోట్లను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కేటాయించారు. మరో వందేండ్ల వరకు నిలిచిపోయేలా సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణ అభివృద్ధికే రూ. 100 కోట్లను కేటాయించి రికార్డు సమయంలో పనులను పూర్తి చేసింది. ఈనెల 19న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రుల బృందం ఈ అభివృద్ధి పనులను జాతికి అంకితం చేశారు.

జాతర నిర్వహణకు 50వేల మంది అధికారులు, సిబ్బంది
ప్రతి రెండేండ్లకు ఒకసారి జరిగే ఈ జాతరకు కోటిన్నరకు పైగా భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈజాతరకు వచ్చే భక్తులు మూడు దశలలో వస్తారు. జాతర ప్రారంభానికి ముందుగానే దాదాపు 30 నుంచి 35 శాతం అమ్మవార్లను దర్శించుకుంటారు. జాతర సమయంలో 60 నుంచి 65 శాతం, జాతర అనంతరం 3.5 శాతం భక్తులు దర్శించుకుంటారు. ఇందుకుగాను, మేడారం జాతర ప్రదేశాన్ని మొత్తం ఎనిమిది ప్రధాన పరిపాలనా జోన్లుగా విభజించారు. ఈజోన్‌ ఒక్కొక్కటికి ఒక జిల్లా స్థాయి అధికారిని జోనల్‌ అధికారిగా, సీనియర్‌ అసిస్టెంట్‌ అధికారిని అసిస్టెంట్‌ జోనల్‌ అధికారిగా నియమించారు. 42 సెక్టార్లుగా ఏర్పాటు చేసి ఒక్కో సెక్టార్‌కు మండల స్థాయి అధికారిని ఇన్‌చార్జిగా నియమించారు. వీటిలో ముఖ్యంగా, టెంపుల్‌-చిలకలగట్టు ప్రాంతాన్ని జోన్‌-1గా పెట్టి దీనిలో మాస్టర్‌ కంట్రోల్‌ రూమ్‌, మేడారం ప్రోటోకాల్‌ ఆఫీస్‌, టెంపుల్‌ ఎంట్రీ పాయింట్స్‌, టెంపుల్‌ ఎగ్జిట్‌ పాయింట్లు, గద్దెల వద్ద తప్పిపోయిన వారి క్యాంపు, మీడియా సెంటర్‌, ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ బృందాలను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సు స్టాండ్‌- రెడ్డిగూడెంను రెండవ జోన్‌గా ఏర్పాటు చేసి బస్సుల అలైటింగ్‌ పాయింట్స్‌, మెస్‌, అధికారులు, ఉద్యోగుల బసను ఏర్పాటు చేశారు. స్థూపం, కోటూరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 3, 4 జోన్లలోనూ తప్పిపోయిన వారి కేంద్రాలు, ఓవర్‌ అల్‌ మానిటరింగ్‌ టీమ్స్‌, షటిల్‌ బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. ఊరట్టం, శివరాం నగర్‌, పడిగాపూర్‌, నార్లాపూర్‌లను మిగతా జోన్లుగా విభజించి తగు ఏర్పాట్లు చేశారు.

21 ప్రభుత్వ శాఖలతో సమన్వయం
ఈ జాతరకు సంబంధించి సివిల్‌, నాన్‌ సివిల్‌ పనులను 21 ప్రభుత్వ శాఖలు చేపట్టాయి. ఎన్‌ఎస్‌ఎస్‌ ఆదివాసీ యువకులు మొత్తం 2వేల మంది ప్రత్యక్షంగా ఈ జాతర నిర్వహణలో స్వచ్ఛందంగా భాగస్వాములు అవుతున్నారు. ఆరు వేలమందిని ప్రీ-జాతరకు ముందుగా, 32 వేల మందిని నాలుగు రోజుల పాటు జరిగే జాతర కోసం ఆరువేలకుపైగా సిబ్బందిని జాతర అనంతరం ఏడు రోజులపాటు పనులు నిర్వహించేందుకు కేటా యించారు.మెరుగైన నెట్వర్క్‌, కమ్యూనికేషన్‌ కోసం 27 శాశ్వత సెల్‌ టవర్స్‌, 33 వీల్‌ సెల్‌ టవర్స్‌ పెట్టారు. మెరుగైన మొబైల్‌ సెల్‌ సేవలను అందించేందుకు ప్రయివేటు ప్రొవైడర్లు పెట్టారు. ఇప్పటికే, 27 మొబైల్‌ టవర్స్‌ ఏర్పాటు చేశాయి. మరో 33 వీల్స్‌ టవర్లు, 450 వీహెచ్‌ఎఫ్‌ సెట్లను ఏర్పాటు చేశాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -