Thursday, February 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు మీడియా అకాడమీ భరోసా

మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు మీడియా అకాడమీ భరోసా

- Advertisement -

గుత్తా సుఖేందర్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు అండగా మేమున్నామనే భరోసా ఇచ్చి వారికి తెలంగాణ మీడియా అకాడమీ ఆర్థిక సహాయం అందజేస్తున్నదని తెలంగాణ శాసన మండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అభినందించారు. బుధవారం హైదరాబాద్‌ నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమి ఆడిటోరియంలో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ, అకాడమి ప్రచురించిన చిరుపుస్తకాలు (మోనోగ్రాఫ్స్‌) ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావుతో కలిసి శాసనమండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్‌ రెడ్డి మాట్లాడుతూ అక్షరమే ఆయుధంగా క్షేత్రస్థాయిలో పని చేసే జర్నలిస్టులు అకాలంగా మరణించడం పట్ల విచారం వ్యక్తం చేశారు. మరణించిన జర్నలిస్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి ఆర్థిక సహాయంగా లక్ష రూపాయలు మంజూరు చేయడంతోపాటు అయిదు సంవత్సరాల పాటు పెన్షన్‌ సదుపాయం కల్పించడం మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు తోడ్పడుతుందని తెలిపారు. అదే విధంగా పాత్రికేయ రంగంలో అనేక సంవత్సరాలు సేవలందించిన ప్రముఖ జర్నలిస్టుల జీవిత విశేశాలు తెలిపే చిరు పుస్తకాలు (మోనోగ్రాఫ్స్‌) రాబోయే తరాలకు స్పూర్తిదాయకంగా నిలుస్తుందని తెలిపారు.

కె.కేశవరావు మాట్లాడుతూ ప్రముఖుల చరిత్ర తెలిపే పుస్తకం చదవడం సులభమనీ, అదే చరిత్రను మోనోగ్రాఫ్‌గా అక్షర రూపం దాల్చడంలో భాగస్వాములైన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. సమాజానికి అద్దం పట్టేది వార్త అయితే ఆ వార్త వెనుక ఉన్న నిజాన్ని వెలికి తీసిన జర్నలిస్ట్‌ భవిష్యత్‌ తరాలకు దారి చూపిన వారవుతారని చెప్పారు. సోషల్‌ మీడియాను నియంత్రించడం ఎవరి తరం కాదనీ, అయితే జర్నలిస్టులందరూ ఎకతాటిపై వచ్చి చర్చించడం లేదా వర్క్‌ షాప్‌లు నిర్వహించి కొంత మార్పునకు నాంది పలకాలని సూచించారు.

తెలంగాణ మీడియా అకాడమి చైర్మెన్‌ కె.శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ చనిపోయిన 18 మంది జర్నలిస్టుల కుటుంబాలకు ఒక లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చెక్కుల పంపిణీ, ప్రమాదానికి గురైన జర్నలిస్టుకు రూ.50 వేల ఆర్థిక సహాయం చెక్కును అందజేసినట్టు వెల్లడించారు. ప్రముఖ పాత్రికేయులైన అబిద్‌ అలీఖాన్‌, డి. సీతారాం, బేతనబొట్ల నాగేశ్వరరావు, పొత్తూరి వెంకటేశ్వరరావు, ఎం.ఎస్‌.ఆచార్య, ఎ.బి.కె. ప్రసాద్‌, జి.ఎస్‌. వరదాచారి, సి.రాఘవాచారి, వి.హనుమంతరావు, ఆదిరాజు వెంకటేశ్వరరావులపై అకాడమి చిరు పుస్తకాలను ప్రచురించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమి కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వర రావు, సీనియర్‌ జర్నలిస్టులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -