ఎంబీబీఎస్ విద్యార్థులపై ఏటా రూ.209 కోట్ల భారం
ఐదేండ్ల ఫీజు కట్టించుకుంటున్న కళాశాలలు
హెల్త్ యూనివర్సిటీ సర్క్యూలర్ జారీ చేసినా పట్టించుకోని వైనం
ఎక్కువ కాలేజీలు ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజకీయ నేతలవి కావడంతో ఇష్టారాజ్యం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాజకీయ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేల గుప్పిట్లో ఉన్న ఎక్కువ మెడికల్ కాలేజీలు ఫీజుల దందాకు తెగబడుతున్నాయి. ఎంబీబీఎస్ విద్యనభ్యసించే విద్యార్థుల నుంచి నాలుగున్నరేండ్ల ఫీజును మాత్రమే వసూలు చేయాలనే నిబంధనన ఉంది. తెలంగాణలోని కాలేజీలు మాత్రం ఆ నిబంధనను తుంగలో తొక్కి ఐదేండ్ల ఫీజును ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు ఇదేం అన్యాయమని ప్రశ్నిస్తే..’అటెండెన్స్ తక్కువ వేస్తాం..ప్రాక్టికల్స్‌లో మార్కులు తక్కువేస్తాం..గట్టిగా మాట్లాడితే ఫెయిల్ చేస్తాం’ అని బాహాటంగానే బెదిరిస్తున్నాయి. ఇదే అంశంపై కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ రిజిస్ట్రార్‌కు మెడికో పేరెంట్స్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే అన్ని మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లకు కేఎన్ఆర్యూహెచ్ఎస్ రిజిస్ట్రార్ సర్క్యూలర్‌ను ఈ నెల రెండో తేదీన జారీ చేశారు. ‘ప్రతి మెడికల్ కాలేజీ ఎంబీబీఎస్ విద్యార్థుల నుంచి నాలుగున్నరేండ్లకు సంబంధించిన ఫీజును మాత్రమే వసూలు చేయాలి. టీఏఎఫ్ఆర్సీ గైడ్‌లైన్స్‌ను పాటించాలి. ఈ విషయంలో నిబంధనలు విస్మరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
మెడికల్ విద్యార్థులను అదనపు ఫీజు విషయంలో వేధిస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. తీవ్రతను బట్టి మెడికల్ కాలేజీ అనుమతి కూడా రద్దు చేస్తాం’ అంటూ ఆ సర్క్యూలర్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే తెలంగాణలోని మెడికల్ కాలేజీలు ఎక్కువగా రాజకీయ నేతలవే కావడం గమనార్హం. పొద్దున లేస్తే అసెంబ్లీలో, మీడియాలో అధిక ఫీజుల గురించి మాట్లాడే ఆ నాయకుల కనుసన్నల్లోని ప్రయివేటు కాలేజీలు మెడికోల నుంచి అధిక మొత్తంలో ఫీజులను వసూలు చేస్తున్నాయి. రెండో తేదీన రిజిస్ట్రార్ సర్క్యూలర్ జారీ చేయగా…నాలుగో తేదీనే పలు ప్రయివేటు మెడికల్ కాలేజీలు ఐదేండ్లకు ఫీజు కట్టాల్సిందేనని చెబుతూ విద్యార్థులకు నోటీసులిచ్చాయి. తెలంగాణలో ఎంబీబీఎస్ బీ కేటగిరీలో 2091 మంది విద్యార్థులు, సి కేటగిరీలో 872 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. బీ కేటగిరీకి సంబంధించి కాలేజీలను బట్టి రూ.11,50,000 నుంచి రూ.13,00,000 వరకు, అదే సీ కేటగిరీకి సంబంధించిన వారు రూ.23 లక్షల నుంచి రూ.26 లక్షల వరకు ఫీజును కడుతున్నారు. ఆ కోర్సు వ్యవధి నాలుగున్నరేండ్లు మాత్రమే కావడంతో ఫీజు కూడా నాలుగున్నరేండ్లకే వసూలు చేయాలనే నిబంధన ఉంది. అంటే చివరి సంవత్సరంలో ఏటా కట్టే దాంట్లో సగం ఫీజు కడితే సరిపోతుంది. కానీ, కాలేజీలు మాత్రం ఐదో యేడు కూడా మొత్తం ఫీజు కట్టాలని మెలిక పెట్టి కూర్చుంటున్నాయి. ఫీజుల విషయంపై ప్రశ్నించే విద్యార్థులను.. ప్రాక్టికల్ పరీక్షలో మార్కులు వేయకుండా ఫెయిల్ చేస్తామని బెదిరిస్తున్నాయి. ఇలా ప్రయివేటు కాలేజీలు ఏటా రూ. 209 కోట్లను విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేస్తున్నాయంటే పరిస్థితి తీవ్రత ఎలాగుందో అర్థం చేసుకోవచ్చు. దీంతో తల్లిదండ్రులు ఆందోళనలు చేసినా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. ఫీజుల దందాను అడ్డుకోవాల్సిన ప్రభుత్వం తనకేం పట్టనట్టు వ్యవహరిస్తున్నదనే విమర్శ బాహాటంగానే వినిపిస్తున్నది.
భారం మోపడం మెడికల్ కాలేజీలకు తగదు : మల్లోజు సత్యనారాయణ చారి
మెడికో పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు
ప్రయివేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలు అదనపు ఫీజుల పేరుతో విద్యార్థులపై, తల్లిదండ్రులపై భారం మోపడం తగదు. వర్సిటీ రిజిస్ట్రార్ సర్క్యూలర్ జారీ చేసిన తర్వాత కూడా కాలేజీలు విద్యార్థులను పీక్కుతినడమేంటి?. అదనపు ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీల వద్ద ఆందోళనలకు దిగుతాం. అప్పటికీ యాజమాన్యాలు స్పందించకపోతే కోర్టుకెళ్లి ఆ కాలేజీల రిజిస్ట్రేషన్లు రద్దు చేసేదాకా పోరాడుతాం. ఎవరైతే ప్రశ్నిస్తూ ముందుకొచ్చే, పోరాడే వారిని టార్గెట్ చేయడం తగదు.



