సర్ ప్రజాస్వామ్యానికి ముప్పు : సీపీఐ(ఎం) ఎంపీ శివదాసన్
పలుమార్లు అంతరాయాలతో వాయిదా పడిన లోక్‌సభ
ఉభయ సభల్లోనూ రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ
న్యూఢిల్లీ : ఆదివారం కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌కు సమర్పించిన తర్వాత సోమవారం సమావేశమైన పార్లమెంట్ ఉభయ సభలు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియచేసే తీర్మానంపై చర్చ ప్రారంభించాయి. లోక్‌సభలో సోమవారం నుంచి బుధవారం వరకు దీనిపై చర్చకు కేటాయించగా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 11న సమాధానమిస్తారు. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో మోడీ పేరు, జాతీయ భద్రత, రాజకీయ హింస, జవాబుదారీతనం వంటి అంశాలపై సభలో గందరగోళం చోటు చేసుకుంది. రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ కొనసాగుతుండగా పలుసార్లు సభకు అంతరాయాలు కలిగాయి.
ఎప్‌స్టీన్ ఫైల్స్‌పై చర్చకు వాయుదా తీర్మానం
గత కొంతకాలంగా ఎప్‌స్టీన్ ఫైల్స్ వ్యవహారం ప్రపంచ రాజకీయాలను కుదిపేస్తుంది. తాజాగా ఆ ఫైల్స్‌లో భారత ప్రధాని మోడీ పేరు బయటపడటంతో దుమారం రేగింది. అయితే ఎప్‌స్టీన్ సంబంధిత డాక్యుమెంట్లలో ప్రధాని మోడీ పేరు ప్రస్తావనపై వివరణ ఇవ్వాలని ఆప్ ఎంపీ సంజరు సింగ్ డిమాండ్ చేశారు. ఎప్‌స్టిన్ ఫైల్స్‌లో మోడీ పేరు ప్రస్తావనపై చర్చించేందకు వీలుగా వాయిదా తీర్మానానికి కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ నోటీసు ఇచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాగరికా ఘోష్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వాన్ని వాస్తవాలను అంగీకరించని ప్రభుత్వంగా వ్యాఖ్యానిస్తూ, రాష్ట్రపతి ప్రసంగానికి డి గ్రేడ్ ఇచ్చారు. విద్వేష ప్రసంగాలు పెరుగుతున్నాయని, మైనారిటీల భద్రత ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.
తొలుత నామినేటెడ్ ఎంపీ సి.సదానందన్ మాస్టర్ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రతిపాదించారు. మరోవైపు దేశ సరిహద్దుల్లో చైనా దురాక్రమణకు పాల్పడిందంటూ ఆర్మీ మాజీ చీఫ్ ఎం.ఎం.నరవణెకి చెందిన ఒక పుస్తకం నుంచి కొన్ని అంశాలను ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రస్తావించారు.. దీనిపై బీజేపీ ఎంపీలు అభ్యంతరం వ్యకం చేశారు. రాహుల్ పేర్కొంటున్న పుస్తకం ఇంకా ప్రచురితం కాలేదని, దానిపై ఎలా మాట్లాతారని ప్రశ్నించారు. దీనిపై సభలో గందరగోళం నెలకొంది. ఇరు పక్షాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అనంతరం రాహుల్ స్పందిస్తూ జాతీయ భద్రతకు సంబధించిన అంశాలపై చర్చించడానికి ప్రభుత్వం ఇబ్బంది పడుతోందని రాహుల్ విమర్శించారు. ఇదే అంశాలపై సభలో పదే పదే అంతరాయాలు కలగడంతో రెండుసార్లు వాయిదా పడిన లోక్‌సభ చివరగా మంగళవారానికి వాయిదా పడింది.
ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పు సర్ : శివదాసన్
పార్లమెంట్‌లో జీరో అవర్‌లో సీపీఐ(ఎం) ఎంపీ డాక్టర్ వి.శివదాసన్ మాట్లాడుతూ, సర్‌ను తీవ్రంగా విమర్శించారు. ప్రజలకు ఇంటర్‌నెట్ సేవలు అందించడంలో గల అంతరాలు, డిజిటల్ విభజన గురించి మాట్లాడుతూ ఆయన, దేశంలో ప్రమాదకరమైన ‘పత్రాల విభజన’ ఆవిర్భవించడం కనిపిస్తోందని అన్నారు. గుర్తింపు పత్రాలు వున్నవారు లేనివారు అంటూ సమాజం రెండుగా విభజించబడుతోందని అన్నారు. ప్రస్తుతమున్న డిజిటల్ విభజన మరింత ముదిరి ఓటర్ల జాబితా నుంచి అట్టడుగు వర్గాల తొలగింపును ఉధృతం చేస్తోందని విమర్శించారు.
ఇది ప్రజాస్వామ్య హక్కులకు తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తుందని హెచ్చరించారు. పౌరసత్వానికి, ఓటింగ్ హక్కులకు ఇప్పుడు పత్రాలు తప్పనిసరవుతున్నాయన్నారు. ఈ పత్రాలు సరిగా లేవనే కారణంతోనే లక్షలాదిమందిని ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారు. డిజిటల్ డివైడ్ అనేది డాక్యుమెంట్ డివైట్‌గా మారిందని వ్యాఖ్యానించారు. ఇలా ప్రజల కనీస మౌలిక హక్కులు కూడా నిరాకరించబడుతున్నాయన్నారు. ఇదంతా ప్రజాస్వామ్యాన్ని ప్రత్యక్షంగా సవాలు చేయడమేనన్నారు.



