– కేంద్రానికి పార్లమెంటరీ కమిటీ సిఫారసు
న్యూఢిల్లీ : ఉద్యోగుల పెన్షన్ పథకం (ఈపీఎస్-95) కింద ఇచ్చే నెలవారీ కనీస పెన్షన్ వెయ్యి రూపాయిలు చాలా తక్కువగా వుందని, ఆ మొత్తం కనీస ప్రాధమిక అవసరాలకు కూడా సరిపడడంలేదని పార్లమెంటరీ కమిటీ మంగళ వారం పేర్కొంది. వెంటనే ఆ కనీస పెన్షన్ మొత్తా న్ని పెంచాల్సిన అవసరం వుందని సిఫార్సు చేసింది. దీనిపై అత్యవసరంగా, సమగ్ర సమీక్ష జరపాలని కోరింది. ఈ పెన్షన్‌ను మరింత వాస్తవికతతో కూడిన, గౌరవప్రదమైన స్థాయికి పెంచాలని సూచించింది. నెలకు రూ.7500కు పెన్షన్ పెంచాలని పెన్షనర్లు దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ సిఫార్సు ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇందుకోసం ప్రభుత్వం బడ్జెట్‌లో అధిక మొత్తాలను కేటాయించే అంశాన్ని పరిశీలించాలని పెన్షనర్లు కోరుతున్నారు. ఏండ్ల తరబడి ఈ పెన్షన్ ఎలాంటి సవరణకు నోచుకోలేదు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆరోగ్య సంరక్షణ, జీవన వ్యయాలను దృష్టిలో వుంచుకుంటే ఈ మొత్తం ఏ మూలకు సరిపోదని పెన్షన్‌దారులు గగ్గోలు పెడుతున్నారు. ఈ నెల 9 నుంచి మూడు రోజుల పాటు దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద పెన్షనర్లు నిరసనలు చేపట్టారు.
కార్మికులు, జౌళి, నైపుణ్యాల అభివృద్ధిపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ 2026-27 సంవత్సరానికి పద్దులపై తన 15వ నివేదిక సమర్పించింది. ఇవి కాకుండా ఈ పార్లమెంటరీ కమిటీ కార్మికులకు సంబంధించి విస్తృత సూచనలు చేసింది. కాంట్రాక్టు వర్కర్లు సకాలంలో పీఎఫ్, ఈఎస్‌ఐ ప్రయోజనాలు పొందేలా చూడాలని, పని ప్రదేశాల్లో ప్రమాదాలు జరిగినపుడు మెరుగైన నష్టపరిహారం అందేలా చూడాలని కోరింది. అలాగే గిగ్ వర్కర్లను ఈ-శ్రమ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని, వారికి కూడా జీవిత, ప్రమాద బీమా కల్పించాలని, అలాగే ఇలాంటి విషయాల్లో స్విగ్గి, జొమాటో వంటి సంస్థల బాధ్యతలేమిటో నిర్వచించాలని కమిటీ పేర్కొంది.
ఇక కార్మిక సంస్కరణలకు సంబంధించి కేంద్రం, రాష్ట్రం మధ్య సమన్వయ బోర్డు ఏర్పాటు చేయాలని సూచించింది. లేబర్ కోడ్‌ల అమలును మెరుగుపరచాలని పేర్కొంది. గనులు, అక్రమ తవ్వకాలు వంటి అంశాల్లో మరింత మెరుగైన పర్యవేక్షణ వుండాలని, ఆధునిక తనిఖీ సాంకేతికతలు ఉపయోగించాలని సూచించింది.
ఈపీఎఫ్ కనీస పెన్షన్‌ను పెంచాలి
- Advertisement -
- Advertisement -



