నూతన సంవత్సర వేడుకల్లో డీజీపీ ప్రశంస
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
జాతీయ స్థాయిలో రాష్ట్ర పోలీసులు అగ్రగామిగా పేరు పొందడానికి వెన్నుదన్నుగా మినిస్టీరియల్ స్టాఫ్ అందిస్తున్న సేవలు కూడా ఉన్నాయని డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డి ప్రశంసించారు. గురువారం డీజీపీ కార్యాలయంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో ఆయన మాట్లాడుతూ… కార్యాల యాల్లో పని చేస్తూ క్షేత్రస్థాయిలో పని చేసే పోలీసు అధికారులు, సిబ్బందికి అవసరమైన సహకారాన్ని ఎప్పటికప్పుడు మినిస్టీరియల్ స్టాఫ్ అందిస్తున్నదని అన్నారు. తాను ఇంతకముందు డీజీపీ కార్యాలయంలో ఆరేండ్ల పాటు కోఆర్డినేషన్, పర్సనల్, తదితర విభాగాలలో అదనపు డీజీగా పని చేసిన సందర్భంలో ఈ కార్యాలయంలో పని చేసే మినిస్టీరియల్ స్టాఫ్ విద్యుక్త ధర్మాలను అవగాహన చేసుకోవడానికి వీలైందని శివధర్‌రెడ్డి తెలిపారు.
కనిపించని నాలుగో సింహం మినిస్టీరియల్ స్టాఫ్ అని ఆయన అభివర్ణించారు. పోలీసు శాఖలో తీసుకొస్తున్న వినూత్న విధానాలకు కార్యాలయ సిబ్బంది కూడా అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తూ సరిదిద్దుతున్నారని చెప్పారు. ఈ సందర్భంగా మినిస్టీరి యల్ స్టాఫ్‌కు చెందిన ఒక మహిళ వినిపించిన ఒక కవితకు స్పందించిన డీజీపీ అక్కడికక్కడే రూ.10 వేల బహుమానాన్ని అందజేసి, అభినందించారు. అనంతరం మినిస్టీరియల్ స్టాఫ్‌ను కలిసి డీజీపీ కేక్ కట్ చేసి అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ మహేశ్ భగవత్, సీఐడీ చీఫ్ చారుసిన్హా, సైబరాబాద్ నూతన కమిషనర్ రమేశ్ తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.



