Tuesday, March 31, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమంత్రులవి గాలితిరుగుళ్లు

మంత్రులవి గాలితిరుగుళ్లు

- Advertisement -

– శాసనసభలో నోరుజారిన బీజేపీ ఎల్పీనేత ఏలేటి
– వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోరిన స్పీకర్‌, మంత్రులు
– దాంట్లో తప్పేం లేదని వాదించే యత్నం
– వెనక్కి తీసుకోవాల్సిందేనని పట్టుబట్టిన భట్టి, పొన్నం, విప్‌ ఆది శ్రీనివాస్‌
– చివరకు వెనక్కి తీసుకుంటున్నట్టు చెప్పిన మహేశ్వర్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

‘రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి గాలిమోటార్లలో గాలి తిరుగుళ్లు తిరుగుతున్నారు’ అంటూ బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు శాసనసభలో దుమారాన్ని రేపాయి. సోమవారం శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మంత్రుల గాలి తిరుగుళ్లకు అయ్యే ఖర్చు కంటే తక్కువ అయిన రూ.50 లక్షలతో రాష్ట్రంలో ఆహార కల్తీని ఎలా అరికడుతారంటూ ఏలేటి ప్రశ్నించారు. వెంటనే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జోక్యం చేసుకుని మాట్లాడుతూ..’విలువైన సమయాన్ని వృథా చేయకూడదనే ఉద్దేశ్యంతోనే మంత్రులు అవసరమైనప్పుడు మాత్రమే హెలిక్యాప్టర్లలో ప్రయాణిస్తారు. మంత్రుల పర్యటనలను గాలి తిరుగుళ్లు అనటం సరిగాదు. మహేశ్వర్‌రెడ్డి మాటల్ని ఉపసంహరించుకోవాలి’ అని సూచించారు. ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోగా..తెలంగాణలో గాలి మోటార్‌లో తిరగడాన్ని గాలి తిరుగుడే అంటానీ, తాను అన్నదాంట్లో తప్పేం లేదని వాదించే ప్రయత్నం చేశారు. వెంటనే మరో మంత్రి పొన్నం ప్రభాకర్‌ లేచి…’తెలంగాణలో అవారాగా, పనిపాట లేకుండా తిరగడాన్ని గాలి తిరుగుళ్లు అంటారు. రాష్ట్ర మంత్రులను పట్టుకుని అలా అనటమేంటి?’ అని ప్రశ్నించారు.
కేంద్రం నుంచి రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడి నిధులు తేరుగానీ, పైగా అనవసరమైన ఈ విమర్శలేంటి? అని నిలదీశారు. తాను గాలిలో తిరుగుతున్నారని అన్నానని ఏలేటి చెప్పే యత్నం చేశారు. ‘గాలిలో తిరుగుతున్నారు… గాలి తిరుగుళ్లు తిరుగుతున్నారు అన్నదానికి తేడా లేదా? మహేశ్వర్‌రెడ్డి ఆ మాటను వెనక్కి తీసుకోవాల్సిందే’ అని పొన్నం పట్టుబట్టారు. విప్‌ ఆది శ్రీనివాస్‌ కల్పించుకుంటూ..బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి స్పీకర్‌ చైర్‌ను కూడా అవమానించారని ఎత్తిచూపారు.
స్పీకర్‌ లేనప్పుడు ప్యానల్‌ స్పీకర్‌ బృందంలోని ఒకరు స్పీకర్‌గా వ్యవహరిస్తారనే విషయం ఏలేటికి తెల్వదా? స్పీకర్‌గా బయటకు వెళ్తే… కౌసరుద్దీన్‌ ప్యానల్‌ స్పీకర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన్ను పట్టుకుని తాము మాట్లాడే సమయంలో వాళ్లను అక్కడ కూర్చోబెడుతున్నారు అని మాట్లాడటం తగదు’ అన్నారు. ఇష్యూ మరింత ముదురుతుండటంతో తన మాటల్ని వెనక్కి తీసుకుంటున్నట్టు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రకటించారు. అంతకుముందు కూడా ‘తెలంగాణలోనూ బుల్డోజర్‌ ప్రభుత్వం వస్తుంది. అప్పుడు మా వైపు రాకపోతే బుల్డోజ్‌ అవుతారు’ అంటూ మంత్రులు, కాంగ్రెస్‌ సభ్యులనుద్దేశించి ఏలేటి అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -