కోల్పోయిన సెల్ఫోన్లు తిరిగి పొందేందుకు అవకాశం : టెలికం అదనపు డీజీ నాగేశ్‌రావు
నవతెలంగాణ-బేగంపేట్
సైబర్ నేరాలను నియంత్రించడంతోపాటు వినియోగదారులు కోల్పోయిన సెల్ఫోన్లు తిరిగి పొందేందుకు సంచార సారథి పోర్టల్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలుగు రాష్ట్రాల టెలికం అదనపు డీజీ నాగేశ్‌రావు స్పష్టం చేశారు. సికింద్రాబాద్ ప్యారడైజ్ వద్ద ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగు ప్రజల్లో దూరసంచార విభాగానికి సంబంధించి మరింత అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను సంచార సారథి పోర్టల్ సీఈఐఆర్ సహకారంతో సులభంగా గుర్తించి తిరిగి వినియోగదారులకు అందించేందుకు ఈ ప్రక్రియ ఉపయోగ పడుతుందన్నారు.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో నాలుగు లక్షలకు పైగా సెల్ ఫోన్లు వినియోగదారులు కోల్పోయినట్టు ఫిర్యాదులు రాగా.. దాదాపు లక్ష ఫోన్లను ఈ యాప్ ద్వారా తిరిగి అందించినట్టు చెప్పారు. సంచార సారథి పోర్టల్‌లోని చక్షు మాడ్యూల్ ద్వారా సైబర్ మోసాలను గుర్తించి వ్యక్తిగత డేటా చోరీ చేసే కాల్స్, ఆర్థిక మోసాలను నివారించొచ్చన్నారు. ప్రజలంతా సంచార సారథి పోర్టల్‌ను వినియోగించుకోవాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల ఎప్పటికప్పుడూ అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు పాటించాలని, విదేశాల నుంచి లేదా అనుమానాస్పద కాల్స్ వచ్చినప్పుడు వెంటనే వారు ఎక్కడి నుంచి చేస్తున్నారో కనుక్కోవచ్చని వివరించారు. సంబుద్ధ గ్రామపంచాయతీ ప్రాజెక్టు కింద తెలంగాణలో 258 గ్రామాలు ఎంపిక చేసి కనెక్షన్లు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.
సంచార సారథి పోర్టల్ ఎంతో ఉపయోగకరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



