Sunday, March 29, 2026
E-PAPER
Homeచైల్డ్ హుడ్కోతి విందు

కోతి విందు

- Advertisement -

అనగనగా ఒక అడవిలో ఒక పులి ఉండేది. అది చాలా మంచిది. చిన్న చిన్న జంతువులతో కూడా స్నేహం చేసేది.
తమ ఇంట వేడుకలకు వెళ్లి విందు ఆరగించి వచ్చేది. పులికి ఎప్పుడో కానీ కోపం వచ్చేది కాదు.
ఒకరోజు కోతి పులి వద్దకు వెళ్లి ”పులిరాజా! రేపు నా బిడ్డ పుట్టిన రోజు. మీరు తప్పకుండా బిడ్డను దీవించి విందు ఆరగించాలి!” అని కోరింది.
మర్నాడు పొద్దుపొద్దునే పులి తన పరివారమైన ఎలుగుబంటి, నక్కలతో కోతి ఇంటికి వెళ్లింది .
పులి రాజు రావడంతో కోతి ఎంతో సంతోషించింది. కోతి బిడ్డని దీవించి విలువైన కానుకనిచ్చింది పులి.
కోతులన్నీ పులి రాజును చూసి ముచ్చటపడ్డాయి.
పొద్దుపొద్దునే పరగడుపున వచ్చిన పులికి ఆకలేసింది. వెంట వచ్చిన ఎలుగుబంటి, నక్కలకు కడుపులో నకనకలాడ సాగింది.
కోతి ఎంతకూ భోజనం పెట్టలేదు.
చెట్టు మీద ఉండే ఉడుత కోతి వద్దకు వచ్చి ”మిత్రమా! పులి రాజు ఉదయం ఎప్పుడో వచ్చాడు కదా.. అల్పాహారం ఏమన్నా పెట్టావా!?” అంది.
”అయ్యో! మాకు అల్పాహారం తినే అలవాటే లేదు. నేరుగా భోజనమే చేస్తాము!” అంది కోతి.
ఉడుత మాట్లాడలేదు.
మధ్యాన్నం కావస్తున్నా కోతి భోజనం వడ్డించలేదు.
పులికి ఆకలితో కొంచెం కడుదు నొప్పి వచ్చింది.
ఎలుగుబంటి, నక్కల కడుపులో ఎలుకలు పరిగెత్త సాగాయి. చెట్టు మీద ఉండే చిలుక కిందికి దిగి ”మిత్రమా! పులి రాజు పొద్దున ఎప్పుడో వచ్చాడు. భోజనం ఇంకా పెట్టనేలేదే!” అంది చిలుక.
”అయ్యో! మేము రోజూ సూర్యుడు నడినేత్తిన వచ్చాక గాని తినం!” అంది కోతి.
చిలుక మౌనంగా ఉండిపోయింది.
పులి, ఎలుగుబంటి, నక్క ఆకలికి తాళలేకపోయాయి. ఇక, ఇంటికి పోయి తిందామను కున్నాయి. ఆసనం నుంచి లేచి వెళ్ళొస్తామని కోతితో చెప్పాయి.
”అయ్యో పులిరాజా! మా ఇంట భోజనం చేయకుండానే వెళ్తారా! కూర్చోండి కూర్చోండి !!”’ అంటూ కూర్చోబెట్టింది కోతి.
మొహమాటం కొద్దీ అవి మూడూ అలానే కూర్చున్నాయి. మూడిటి ముందూ పెద్ద పెద్ద అరిటాకులు పరిచింది.
”పులిరాజా! ఈరోజు అన్నీ ఇష్టమైన కమ్మటి పదార్థాలే ! నెమ్మదిగా కడుపునిండా భోజనం చేయాలి!” చెప్పింది కోతి.
విందు భోజనాన్ని తలుచుకొని లొట్టలు వేశాయి పులి, ఎలుగుబంటి నక్క.
అన్నం, మామిడికాయ పప్పు, గుత్తి వంకాయ కూర. సాంబారు, అప్పడాలు, పులిహొర, పాయసం, పరమాన్నం, దద్దోజనంతో పాటు కోతికి ఇష్టమైన పిండి వంటలన్నీ అరిటాకులో వడ్డించింది. కోతి మాంసాహారం వడ్డిస్తుందని ఎదురుచూశాయి.
అన్నంలో నెయ్యి వేస్తూ ”పులిరాజా! ఇక మొహమాటం పడకుండా కడుపునిండా భోజనం ఆరగించండి !” అంది కోతి
అసలే ఆకలి మీద ఉన్న పులికి మాంసం లేకపోయేసరికి కోపం వచ్చింది.
”ఒరేరు! ఎవరిని పిలిచి ఏం పెడుతున్నావు. ఈ వంటలన్నీ నేనేం చేసుకోవాలి !” అని గాండ్రించి కోతి మీదపడి కొరకబోయింది.
”క్షమించండి ప్రభూ! క్షమించండి!! తప్పయింది” గజగజా వణుకుతూ అంది కోతి.
పులిరాజు క్షమించి కోతిని వదిలేశాడు. కోపం చల్లారాక శాకాహారం తినే జీవుల ఇంట మాంసాహారం కోరుకోటం తన తప్పేనని తెలుసుకుని, కోతి ప్రేమతో వడ్డించిన శాకాహారమే పరివారంతో తిని వెళ్లింది పులి.
చిలుక, ఉడుత చెట్టుదిగి కిందికి వచ్చాయి.
”మిత్రమా! మన ఇంటికి అతిథిగా వచ్చిన వారికి ఏమి ఇష్టమో తెలుసుకుని అవి వండి పెడితే వాళ్ళు తృప్తిగా తింటారు” అంది చిలుక.
”మనం ఆలస్యంగా తింటామని అతిథిని ఆకలితో ఉంచటం తప్పు!” అంది ఉడుత.
మాసాహారం తినే పులి రాజుకు శాకాహారం వండించి పెట్టడం తప్పని తెలుసుకుంది.
ఆనాటినుండి అతిథికి ఏమి ఇష్టమో తెలుసుకొని ఆ పదార్థాలు వండి వారు తినే సమయానికి వేడివేడిగా వడ్డించి తృప్తి పరిచింది కోతి.

పైడిమర్రి రామకృష్ణ , 92475 64699

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -