విధ్వంసంతో ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ
శిలాజ ఇంధనాల విస్తరణ, రాజకీయ అలసత్వమే కారణమంటున్న నిపుణులు
న్యూఢిల్లీ : ఈ ఏడాది ప్రపంచ దేశాలను కుదిపేసిన అత్యంత ఖరీదైన, ప్రభావవంతమైన వాతావరణ విపత్తులలో భారత్‌పై ప్రభావం చూపిన రుతుపవనాలు కూడా ఉన్నాయి. లండన్‌లో శనివారం అర్ధరాత్రి ప్రచురితమైన ఓ అంతర్జాతీయ నివేదిక ఈ విషయాన్ని తెలియజేసింది. ‘కౌంటింగ్ ది కాస్ట్ 2025’ పేరిట క్రిస్టియన్ ఎయిడ్ సంస్థ రూపొందించిన నూతన నివేదిక ప్రకారం వడగాల్పులు, అడవుల్లో కార్చిచ్చులు, కరువులు, తుపానుల కారణంగా సంభవించిన అత్యంత ప్రభావవంతమైన పది విపత్తులు ప్రపంచానికి ఏకంగా 120 బిలియన్ డాలర్లకు పైగా నష్టాన్ని కలిగించాయి. ఆర్థిక నష్టాల ఆధారంగా చూస్తే భారత్‌తో పాటు పాకిస్తాన్ ఐదో స్థానంలో ఉంది.
ఏ ఖండంలో చూసినా విధ్వంసమే
మన దేశంలో రుతుపవనాల ప్రభావం మేలోనే మొదలైంది. సెప్టెంబర్ నాటికి దేశంలో సగటు కంటే ఎనిమిది శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. 2,227 వరదలు, భారీ వర్షపాత ఘటనలు నమోదయ్యాయి. వాతావరణ మార్పుల కారణంగా పెరుగుతున్న వ్యయంతో పాటు శిలాజ ఇంధన కంపెనీలు సంక్షోభంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రపంచంలోని నిరుపేద దేశాలలో నష్టం అధికంగా ఉంది. వాతావరణ సంక్షోభం కారణంగా ప్రభావితమైన అత్యంత ఖరీదైన పది ఘటనలలో ఒక్కోటి బిలియన్ డాలర్లకు పైగానే నష్టం మిగిల్చింది. ఈ ఏడాది ఏ ఖండం కూడా విధ్వంసక విపత్తు నుంచి తప్పించుకోలేకపోయింది.
అపార నష్టం మిగిలింది
కాలిఫోర్నియాలో ఎత్తయిన కొండల వరుసలు, ఈటన్ కార్చిచ్చులు అధిక నష్టాన్ని (60 బిలియన్ డాలర్లు) కలిగించాయని నివేదిక తెలిపింది. జూన్-సెప్టెంబర్ మధ్యకాలంలో భారత్, పాకిస్తాన్‌లోని సంభవించిన అధిక వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడడం వంటి ఘటనల కారణంగా 5.6 బిలియన్ డాలర్ల నష్టం చేకూరింది. ఈ కాలంలో రెండు దేశాలలో రుతుపవనాలు చురుకుగా కదులుతూ భారీ వర్షాలు కురిపించాయి. ప్రారంభంలోనే కుండపోత వానలు పడ్డాయి. ముఖ్యంగా పర్వత ప్రాంతాలలో ఆకస్మిక వరదలు సంభవించాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. అనేక చోట్ల నదులు ఉప్పొంగాయి. వ్యవసాయ భూములు నీట మునిగాయి. హిమానీనదాలు కరిగిపోయి వరదలు తీవ్రమయ్యాయి. వేలాది ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి.
సీఎస్‌ఈ అంచనా ప్రకారం…
ఈ ఏడాది మన దేశంలో సంభవించిన విపత్తులపై సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్‌ఈ) వేసిన అంచనా ప్రకారం…తొలి తొమ్మిది నెలల కాలంలో 99 శాతం రోజులు దేశం తీవ్రమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంది. వేడి, చలిగాలులు, మెరుపులు, తుఫానులు, భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. 4,064 మంది చనిపోయారు. 9.47 మిలియన్ హెక్టార్ల పంట నష్టం జరిగింది. సుమారు లక్ష నివాస గృహాలు దెబ్బతిన్నాయి. అరవై వేల వరకూ జంతువులు చనిపోయాయి. ఈ ఏడాది మొత్తం 122 రుతుపవన దినాలలోనూ భారత్‌లో తీవ్రమైన వాతావరణ పరిస్థితులే నెలకొన్నాయి.
భవిష్యత్‌పై ఏమీ చెప్పలేం
అత్యంత ఖరీదైన ఆరు విపత్తులలో నాలుగు ఆసియాలోనే సంభవించాయని నివేదిక తెలియజేసింది. భారత్, పాకిస్తాన్‌లో సంభవించిన వరదల కారణంగా 1,860 మంది ప్రాణాలు కోల్పోయారు. బీమా నష్టాల ఆధారంగానే అనేక అంచనాలు రూపొందించామని, వాస్తవానికి ఆర్థిక నష్టం మరింత అధికంగా ఉంటుందని నివేదిక చెప్పింది. విపత్తులు సహజంగా వచ్చి పడినవి కావని, శిలాజ ఇంధనాల విస్తరణ, రాజకీయ అలసత్వం వాటికి కారణమని నిపుణుడొకరు వ్యాఖ్యానించారు. పేదలే ఎక్కువగా ప్రభావితులయ్యారని, శిలాజ ఇంధనాల నుంచి పరివర్తన చెందకపోతే భవిష్యత్తులో ఏం జరుగుతుందో కూడా చెప్పలేమని క్రిస్టియన్ ఎయిడ్ సీఈఓ పాట్రిక్ వాట్ హెచ్చరించారు.



