Tuesday, January 27, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఆర్ట్‌లో 'అమ్మ' బంధం

ఆర్ట్‌లో ‘అమ్మ’ బంధం

- Advertisement -

ఐద్వా మహాసభలో స్ట్రెంత్‌ ఇన్‌ సాఫ్ట్‌నెస్‌ గ్యాలరీ
ముగ్దులవుతున్న ఐద్వా ప్రతినిధులు
ఐలమ్మ ఆర్ట్‌ గ్యాలరీని ప్రారంభించిన కేరళ ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ ఆర్‌.బిందు రాధాకృష్ణన్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఐద్వా 14వ జాతీయ మహాసభల ప్రాంగణంలో ఐలమ్మ ఆర్ట్‌ గ్యాలరీని సోమవారం కేరళ విద్యా శాఖ మంత్రి ఆర్‌. బిందు రాధా కృష్ణన్‌ ప్రారంభించారు. సహజసిద్ధంగా దొరికే వస్తువులతో స్ట్రెంత్‌ ఇన్‌ సాఫ్ట్‌నెస్‌ పేరుతో ఐలమ్మ ఆర్ట్‌ గ్యాలరీలో ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను ఆమె ఆసక్తిగా తిలకించారు. ఒక్కో చిత్రం వద్దకెళ్లి దానిలో దాగి ఉన్న అంతరార్ధాన్ని ఆర్టిస్టులను అడిగి మరీ తెలుసుకున్నారు. గ్యాలరీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఫర్జోనా పఠాన్‌, కిరణ్‌ను అభినందించారు.

ఈ సందర్భంగా బిందు మాట్లాడుతూ…కళ కూడా ఒక సాంస్కతిక విప్లవ రంగమేనన్నారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన చిత్రాలు మహిళల నిజ జీవితాలను ప్రతిబింబించేలా ఉన్నాయని కొనియాడారు. గ్యాలరీ ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. సమాన అవకాశాల కోసం, లింగ సమానత్వం కోసం మున్ముందు మరిన్ని పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐద్వా అఖిల భారత అధ్యక్షులు పీకే. శ్రీమతి టీచర్‌, కోశాధికారి పుణ్యవతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, అధ్యక్షులు అరుణజ్యోతి, ఐద్వా జాతీయ నాయకులు, చిత్రప్రదర్శన నిర్వాహకులు ఫర్జోనా పఠాన్‌, కిరణ్‌, తదితరులు పాల్గొన్నారు.

గ్యాలరీ ప్రత్యేకతలివే…
ఐలమ్మ ఆర్ట్‌ గ్యాలరీలో స్టెంత్‌ ఇన్‌ సాఫ్ట్‌నెస్‌ పేరుతో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో ఒక్కో చిత్రానికి ఒక్కో నేపథ్యముంది. తల్లీబిడ్డల అనుబంధాలు, సమాజంతో స్త్రీ మమేకమయ్యే తీరును చిత్రాల ద్వారా ఆర్టిస్టులు అద్భుతంగా తీర్చిదిద్దారు. స్త్రీ పుట్టుక నుంచి మరణించే వరకు భారతీయ సమాజంలో ఆమెకు తాడుతో ఉన్న అనుబంధాన్ని తెలిపేలా రూపొందించిన ఆర్ట్‌ ప్రత్యేకంగా నిలిచింది. గుడ్‌టచ్‌, బ్యాడ్‌ టచ్‌పై అవగాహన కల్పించేలా మహిళలు ధరించే డ్రస్సులపై వేసిన ఆర్ట్‌ ఆలోచింపజేసింది. మహిళా పారిశుధ్య కార్మికురాలిని ప్రతిబింబించేలా క్రిస్టల్‌ స్టోన్స్‌తో ఏర్పాటు చేసిన ప్రదర్శన ఆకట్టుకునేలా ఉంది. వస్త్రంపై మెహందీతో ఆదివాసీ గిరిజనుల జీవనశైలిని చిత్రీకరించిన తీరు బాగుంది.

పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు భారం అనుకోకుండా కుటుంబ పనుల్లో, అటు ఆఫీసు పనుల్లో నిమగమయ్యే స్త్రీమూర్తి ఏనుగంత భారాన్ని మోస్తుందనే భావాన్ని కండ్లకు కట్టినట్టు చూపే చిత్రం ఆలోచింపజేస్తున్నది. మహిళల్లోని కోపం, బాధ, సంతోషం, దు:ఖం, తదితర భావోద్వేగ రూపాలను ఉలెన్‌ జాకెట్‌లో చిత్రీకరించిన తీరు విభిన్న ఆలోచనకు ప్రతిరూపంగా నిలుస్తున్నది. కాన్వాస్‌పై తల్లీబిడ్డల అనుబంధాన్ని తెలిపేలా గీసిన చిత్రం, బాల్యజీవితంలోని ఆలోచనల దొంతరతో కూడిన చిత్రం వేటికవే ప్రత్యేకంగా ఉన్నాయి. పూల మొక్క నుంచి పూ మొగ్గలు వికసించినట్టుగా తల్లి గర్భం నుంచి పిల్లలు ఉద్భవించే తీరును పోలిక పెడుతూ గీసిన చిత్రం బాగున్నది. అంతిమంగా గ్యాలరీలో అమ్మతో ముడిపడి ఉన్న బంధం కండ్లకు కట్టినట్టుగా కనిపించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -