రాష్ట్రంలో పదిరెట్లు పెరిగిన అబార్షన్లు
మారుతున్న సమాజపోకడలు
సృష్టికి ప్రతిసృష్టి చేసే అమ్మతనం పేగుబంధాన్ని తెంచేసుకుంటోంది. భయమో, భారమో, బాధ్యతారాహిత్యమో.. గర్భస్థ శిశువుల్ని తల్లులు కడుపులోనే చిదిమేస్తున్నారు. ఓవైపు మహిళల్లో పునరుత్పత్తి శక్తి సన్నగిల్లుతోందని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. దానికి మారుతున్న ఆలోచనలు, బాధ్యతలు, ఆహార అలవాట్లు, సమాజ పోకడలు సహా అనేక కారణాలు ఉన్నాయి. కానీ గర్భం ధరించినా, బిడ్డల్ని వద్దనుకొనే తల్లులూ లేకపోలేదు. దీనికి కారణాలు అనేకం. గడచిన ఐదేండ్లలో తెలంగాణలో పదిరెట్లు అబార్షన్లు పెరిగాయి. ఈ విషయాన్ని స్వయంగా పార్లమెంటులోనే ప్రభుత్వం వెల్లడించింది.
ఎస్‌ఎస్‌ఆర్ శాస్త్రి
దేశవ్యాప్తంగా అబార్షన్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఓవైపు దక్షిణాది రాష్ట్రాల్లో జనాభాను పెంచాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని కోరుతున్నా యి. గతంలో కుటుంబ నియంత్రణ పాటిస్తే ఇచ్చిన ప్రయో జనాలకంటే, ఎక్కువ మంది పిల్లల్ని కంటే ఇంకా ఎక్కువ ప్రయోజనాలు కల్పిస్తామనీ హామీలు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో పెరుగుతున్న అబార్షన్లు అందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా 2020-21లో తెలంగాణలో 2,282 అబార్షన్లు నమోదయ్యాయి. 2024-25 నాటికి ఈ సంఖ్య పదిరెట్లు పెరిగి, 16,059 అబార్షన్లు జరిగినట్టు గణాంకాలు చెప్తున్నాయి. ఈ లెక్కల్ని పార్లమెంటులో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని హెల్త్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం (హెచ్‌ఎమ్‌ఐఎస్) వెల్లడించింది. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో గడచిన ఐదేండ్లలో అబార్షన్లు నాలుగు రెట్లు పెరిగాయి. ఈ రాష్ట్రంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో 2,282 అబార్షన్లు జరగ్గా, 2024-25 నాటికి ఈ సంఖ్య10,676కు పెరిగింది. దేశవ్యాప్తంగా అబార్షన్లు అధికంగా జరిగిన టాప్-5 రాష్ట్రాల వివరాలను హెచ్‌ఎమ్‌ఐఎస్ ప్రకటించింది. అబార్షన్లలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో 2,07,019 అబార్షన్లు జరిగాయి. ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు- 1,01,414, అస్సాం- 76,642, కర్నాటక- 70,241, రాజస్థాన్- 53,714 ఉన్నాయి. అయితే ఈ అబార్షన్ల వెనుక అనేక విషాద ఘటనలు ఉన్నాయి.మెడికల్ అన్‌ఫిట్‌తో అబార్షన్లు కావడం వేరు…ఉద్దేశ్యపూర్వకంగా గర్భ విచ్ఛిత్తి చేయించుకోవడం వేరు. సమాజంపై ముఖ్యంగా మహిళల మానసిక, శారీరక ఆరోగ్య పరిస్థితులపై అబార్షన్లు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఇటీవల హైదరాబాద్ సంజీవరెడ్డినగర్ ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలిక గర్భవతి అయ్యింది. ఈ విషయం తెలిసి ఆ బాలిక తల్లి అబార్షన్‌కు అనుమతించాలని కోరుతూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ నాగేశ్ భీమపాక విచారించారు. ఈ కేసు విషయంలో న్యాయస్థానం ఏర్పాటుచేసిన వైద్య బృందం సమర్పించిన నివేదిక ప్రకారం సదరు బాలికకు 28 వారాలుగా ట్విన్ ఫీటస్ ఉందని, ఈ దశలో అబార్షన్ చేస్తే తల్లి, శిశువుల ప్రాణాలకు ప్రమాదం కలగొచ్చని పేర్కొంది. దీనితో హైకోర్టు అబార్షన్‌కు అనుమతించలేదు. అబార్షన్ల సంఖ్య పెరుగుదలపై సమాజంలో ఆందోళనలు పెరుగుతున్నాయి. దీనిపై ప్రజలకు విస్త్రుత అవగాహన కల్పించాల్సిన బాధ్యత కచ్చితంగా ప్రభుత్వాలపై ఉంది. ఇటీవలి కాలంలో హైదరాబాద్, బెంగుళూరు, ముంబయి లాంటి సిటీల్లో సహజీవనం (కో లివింగ్) కల్చర్ పెరిగిపోతోంది. ఇందుకు కారణం యువతలో మారుతున్న ఆలోచనా ధోరణి, ఆర్థిక స్వేచ్ఛ, పాశ్చాత్య సంస్కృతి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో ‘కో లివింగ్’ హాస్టల్స్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడి ఐటీ కంపెనీల్లో పనిచేసేందుకు దేశం నలుమూలల నుంచి యువతీ యువకులు వస్తుంటారు. ఒకే ఆఫీసులో పనిచేస్తూ, కో లివింగ్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. అదే సమయంలో తెలిసీ తెలియని వయసులో మైనర్ బాలికలు గర్భం దాల్చడం, పరువు పోతుందనే భయంతో తల్లిదండ్రులు కుల పంచాయతీలు పెట్టి గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్లు చేయించడం ఆనవాయితీగా మారుతోంది. మరోవైపు ఆదివాసీ, గిరిజన ప్రాంతాల మహిళలకు సరైన వైద్యసౌకర్యాలు లేకపోవడం, పౌష్టికాహారం లేకపోవడం వంటివి కూడా అబార్షన్ల పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. మరోవైపు ఆర్థిక భద్రత ఉన్నా, ఇప్పట్లో సంతానం వద్దనుకొనే దంపతుల సంఖ్యా పెరుగుతోంది. ఉన్నంతకాలం ఎంజారు చేద్దాం అనే ధోరణి ప్రబలుతోంది. గర్భం దాల్చినట్టు తెలియగానే అబార్షన్లు చేయించుకుం టున్నారు. ఈ తరహా ధోరణులు సమాజంలో ఆందోళన కల్గించే అంశాలే!!
అమ్మబంధం తెగుతోంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES