– ఏర్పాట్లను వేగవంతం చేస్తున్న ప్రభుత్వం
– నిర్మిత స్థలాన్ని పరిశీలించిన నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి
నవతెలంగాణ-కాగజ్‌నగర్/కౌటాల
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పురుడు పోసుకున్న ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కనుమరుగైంది. ఇక ఈ ప్రాజెక్టుపై ఆశలు లేవనుకున్న సమయంలో రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ఆశలు రేకెత్తాయి. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర గడిచినా రేపు మాపంటూ ప్రస్తుత ప్రభుత్వం కూడా కాలం వెళ్లదీయడంతో నిరాశే ఎదురైంది. కాగా, మంగళవారం నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ తుమ్మిడిహట్టికి వచ్చి ప్రాజెక్టు నిర్మిత స్థలాన్ని పరిశీలించి వెళ్లడంతో ఈ ప్రాజెక్టు ఫైలు ముందుకు కదులుతోందనే భావన రైతుల్లో వ్యక్తమవుతోంది.
గత రెండు దశాబ్దాలుగా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు.. పాలకుల నోళ్లలో నానుతూనే వస్తోంది. ‘ఎంతెంత దూరం అంటే నీకందనంత దూరం’ అనే రీతిలో ఈ ప్రాజెక్టు రైతులకు అందనంత దూరంలోనే ఉంటూ వస్తోంది. 2008లో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శంఖుస్థాపన జరిగిన అనతికాలంలోనే ఇది మూలకు పడింది. ప్రాజెక్టు బ్యారేజీ నిర్మాణ పనులు ప్రారంభం కాకముందే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడం, వెంటనే బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఈ ప్రాజెక్టును రీ డిజైన్ పేరుతో కాళేశ్వరానికి తరలించిన విషయం తెలిసిందే. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేండ్ల కాలంలో ఈ ప్రాజెక్టు ఊసే లేదు. ఈ ప్రాంత రైతుల నుంచి వస్తున్న డిమాండ్ దృష్ట్యా వార్దా ప్రాజెక్టును నిర్మిస్తామని బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రకటించినా అది కార్యరూపం దాల్చలేదు. 2024 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే ఈ ప్రాజెక్టును కట్టి తీరుతామని హామీ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో ఈ ప్రాజెక్టు నిర్మాణంపై మళ్లీ రైతుల్లో ఆశలు చిగురించాయి.
రూ. 35 వేల కోట్లు.. 150 మీటర్ల ఎత్తు
కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే పలు సార్లు సాగునీటి పారుదల శాఖాధికారులతో సమీక్షలు నిర్వహించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణ స్థలం, బ్యారేజీ నిర్మాణం ఎత్తు, మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే ప్రాంతం, సాగునీటి లభ్యత తదితర అంశాలపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్షించారు.
సమీక్షల అనంతరం ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.35 వేల కోట్లు అవసరమని అంచనా వేశారు. గతంలో ప్రతిపాదించిన తుమ్మిడిహట్టి వద్దే 150 మీటర్ల ఎత్తుతో 80 టీఎంసీల నీటి తరలింపుతో డీపీఆర్ సిద్ధం చేయాలని నిర్ణయించింది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో 152 మీటర్ల ఎత్తుతో 165 టీఎంసీల నీటి తరలింపు లక్ష్యంగా డీపీఆర్ సిద్ధం చేశారు. తర్వాత ఏర్పడ్డ తెలంగాణ ప్రభుత్వం అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో చర్చలు జరిపి 148 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణానికి 2016లో ఒప్పందం చేసుకుంది. ఆ తర్వాత రీ డిజైన్ పేరుతో ఈ ప్రాజెక్టును పక్కన పెట్టినా ఇపుడు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణానికి అధికారులు డీపీఆర్ సిద్ధం చేస్తున్నారు. ఈ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ కానున్నారు.
క్షేత్రస్థాయిలో ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ పర్యటన
ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్ తుమ్మిడి హట్టి వద్ద ప్రాణహిత నదిని పరిశీలించారు. మంగళవారం ఉదయం ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి కుమురం భీం-ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని తుమిడిహట్టి ప్రాణహిత నది వద్దకు చేరుకున్నారు. అక్కడ ప్రాజెక్టు నిర్మించేందుకు గతంలో గుర్తించిన స్థలం, ప్రస్తుత ప్రతిపాదిత స్థలం గురించి అధికారులు మ్యాప్ ద్వారా వివరించారు. తీరంలో తిరిగి పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమగ్ర వివరాలు అందించాలని ఆదేశించారు. ఇరిగేషన్ అధికారులు తుమిడిహట్ట్టికి ఎగువన వార్ధా, వైన్‌గంగ నదుల సంగమంతో ప్రాణహితగా ఏర్పడే ప్రాంతాన్ని మ్యాప్‌లో చూపించగా ప్రశాంత్ పాటిల్ బైనాక్కులర్ సాయంతో పరిశీలించారు. ఆయన వెంట ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ సత్యరాజచంద్ర, కాగజ్‌నగర్ ఎస్‌ఈ రవి కుమార్, ఈఈ ప్రభాకర్, డీఈ ఎల్లా వెంకటరమణ, భద్రయ్య, తిరుపతి, భానుమూర్తి, తహసీల్దార్ ప్రమోద్‌కుమార్ ఉన్నారు.
కదులుతున్న ‘ప్రాణహిత’ ఫైలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES