Wednesday, December 3, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపురపాలిక చట్టాన్ని సవరించాలి

పురపాలిక చట్టాన్ని సవరించాలి

- Advertisement -

– సీఎంకు రాష్ట్ర మున్సిపల్‌ చాంబర్స్‌ చైర్మెన్‌ వెన్‌రెడ్డి రాజు విజ్ఞప్తి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్రంలో అమలవుతున్న పురపాలిక చట్టాన్ని సవరించాలని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్‌ చాంబర్స్‌ చైర్మెన్‌ వెన్‌రెడ్డి రాజు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డిని కోరారు. హైదరాబాద్‌లోని మున్సిపల్‌ చాంబర్స్‌ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన అన్ని వ్యవస్థలను గాడిలో పెడుతున్న రేవంత్‌రెడ్డి పురపాలిక వ్యవస్థ ఉనికికే ప్రమాదకారిగా మారిన 2019లో పురపాలక నూతన చట్టాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి స్థానిక సంస్థలను కాపాడాలని కోరారు. స్థానిక సంస్థల ప్రాతినిధ్యం నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన రేవంత్‌రెడ్డి సమగ్రమైన పురపాలిక చట్టాన్ని రూపొందించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2019 పురపాలక చట్టం తీసుకొచ్చి స్థానిక సంస్థలను అపహాస్యం చేసిందన్నారు. ఈ చట్టం వల్ల పురపాలక పాలకవర్గానికి ఏ అధికారాలు ఉన్నాయో, ఒక్కసారి అధ్యయనం చేయాలని కోరారు. రాజీవ్‌గాంధీ స్థానిక సంస్థల పటిష్టత కోసం 73, 74వ రాజ్యాంగ సవరణ చేసి పట్టణాలు, పల్లెల అభివృద్ధికి ఊతమిస్తే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తూట్లు పొడిచిందని విమర్శించారు. కేసీఆర్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలతో అధికారాలన్నీ అధికారులకు అప్పగించి బాధ్యతలను మాత్రమే పాలకవర్గాలకు అప్పగించిందని తెలిపారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలు కేవలం ఉత్సవ విగ్రహాలుగా మారి నిర్వీర్యమయ్యాయన్నారు. ఈ చట్టాలతో స్థానిక సంస్థలపై అధికారాలు, అజమాయిషీలను జిల్లా కలెక్టర్లకు అప్పగించడంతో వారు సామంత రాజుల్లా మారి, వేధింపులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టాలు ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎదగకుండా ఆర్థికంగా చితికిపోయి వారి పట్ల మరణశాసనంగా మారాయని వాపోయారు. పురపాలక సంఘాలపై అజమాయిషీని కలెక్టర్ల నుంచి సీడీఎమ్‌ఏకు అప్పగించాలని కోరారు. ఇతర రాష్ట్రాల్లో అమలౌతున్న విధంగా తెలంగాణలో చట్టాలను పున:సమీక్షించాలని విజ్ఞప్తి చేశారు. పురపాలక సంఘాల చైర్మెన్‌ పదవులకు నేరుగా ఎన్నికలు నిర్వహించడం వల్ల సమర్థవంతంగా విధులను నిర్వహించే అవకాశం ఉందన్నారు. పురపాలక సంఘాల్లో పదవులకు రెండు పర్యాయాలు రిజర్వేషన్లను యధావిధిగా కొనసాగించాలని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిరంకుశ, అభివృద్ధి నిరోధక చర్యలతో తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేయబడ్డాయని తెలిపారు. గత పదేండ్లలో పురపాలక సంఘాలకు టీడీఎస్‌ నిధులు విడుదల చేయకపోవడంతో పురపాలక సంఘాలు ఆర్థికంగా చితికిపోయాయన్నారు. పురపాలక సంఘాలను పటిష్టవంతం చేయాలన్న సంకల్పంతో ప్రజాపాలనను అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పదేండ్ల నుంచి బకాయి ఉన్న టీడీఎస్‌ నిధులు రూ.2800 కోట్లను విడుదల చేయడమే కాకుండా అభివృద్ధి, మౌలిక సదుపాలయ కల్పన కోసం మరో రూ.2700 కోట్లు విడుదల చేసినట్టు గుర్తు చేశారు. పురపాలక సంఘాల్లో స్థానిక పరిస్థితులకనుగుణంగా విద్యుత్‌ దీపాల నిర్వహణ బాధ్యతలను పురపాలికలకే అప్పగించాలని కోరారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పురపాలికల ఉనికినే కోల్పోయే విధంగా విద్యుత్‌ దీపాల నిర్వహణ బాధ్యతలను ఈఈఎస్‌ఎల్‌ ఎనర్జీ ఎఫిసెన్సీ సర్వీసింగ్‌కు అప్పగించిందన్నారు. తక్షణమే దాని నుంచి విముక్తి కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో చాంబర్స్‌ ప్రతినిధులు జి.ఈశ్వర్‌, చందు, అల్లంపల్లి నర్సింహా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -