రాష్ట్రంలో మరో రసవత్తర ఘట్టానికి తెరలేచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిర్యాలగూడలో నిర్వహించిన బహిరంగ సభతో మున్సి’పోల్స్’ వార్ హీటెక్కింది. అటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ కూడా ప్రచారాస్త్రాలను సిద్ధం చేసుకుంది. కేంద్రంలోని బీజేపీ సైతం ‘ఏదో ఒకటి చేసి…’ తెలంగాణ పురపోరులో తన సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఇందుకోసం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీబ్ సైతం రంగంలోకి దిగారు. జనసేనాధిపతి పవన్‌కళ్యాణ్‌ను కూడా ఇందుకోసం వినియోగించుకోవాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఆయన కూడా త్వరలోనే ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. అందువల్ల తెలంగాణ ఓటర్లు ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇలా పార్టీలన్నీ మున్సిపల్ ఎన్నికల గోదాలో దిగిన వేళ… అసలు ఇప్పటిదాకా ఇటు రాష్ట్రాన్ని, అటు దేశాన్ని ఏలిన పార్టీలు.. నగరాలు, పట్ణణాల అభివృద్ధికి తీసుకున్న చర్యల గురించి చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
74వ రాజ్యాంగ సవరణ… పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి కొన్ని నియమ నిబంధనలను స్పష్టంగా పేర్కొంది. మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలోని పౌరులకు ఆరోగ్య సంరక్షణ, విద్యా పరిరక్షణ, గృహ నిర్మాణం, రవాణా తదితర కనీస అవసరాలను తీర్చాల్సిన బాధ్యత ఆయా స్థానిక సంస్థలపైన్నే ఉంటుందని తేల్చి చెప్పింది. కానీ దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చిన తర్వాత ఈ మౌలిక సూత్రాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గాలికొదిలేశాయి. సమాఖ్య విధానంలో భాగంగా రాష్ట్రాలకు నిధులివ్వాల్సిన కేంద్రం… ఆ పని చేయకుండా వాటికి కోతలు పెడుతోంది. కేంద్రం ఏ విధంగానైతే రాష్ట్రాల పట్ల వివక్షను ప్రదర్శిస్తోందో.. అదే తరహాలో రాష్ట్రాలు సైతం పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థల పట్ల శీతకన్నేయటం మొదలుపెట్టాయి. వాటి నిధులను తమ అవసరాలకు వాడుకోవటమో, దారి మళ్లించటమో చేస్తూ మున్సిపాల్టీలు, కార్పొరేషన్లకు మొండిచేయి చూపిస్తున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలోగాని, తెలంగాణ వచ్చిన తర్వాతగానీ ఈ విధానాల్లో మాత్రం ఎలాంటి మార్పు లేకపోవటం గమనార్హం. పైగా వివిధ దేశాల్లోని ఆర్థిక సంస్థల నుంచి ఇబ్బడిముబ్బడిగా అప్పులు తీసుకోవటం, వాటితో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పటం, షరతుల్లో భాగంగా ప్రజలపై విపరీతమైన భారాలేయటం… ఇదీ ఇప్పటిదాకా కొనసాగిన తతంగం. జైకా (జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేటివ్ ఏజెన్సీ), జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎమ్ (జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రిన్యూవల్ మిషన్) తదితర పేర్లతో ముందుకొచ్చిన సంస్థల అప్పులతో పట్టణాలు, నగరాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామంటూ పాలకులు గొప్పలకు పోయారు. జేఎన్‌ఎన్ యూఆర్‌ఎమ్ కింద ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేసినప్పటికీ అవి ప్రయాణీకుల అవసరాలను పూర్తిగా తీర్చలేకపోయాయి. వాల్మీకి అంబేద్కర్ యోజన (వాంబే) కింద పేదలకు ఇండ్లు ఇచ్చామని చెప్పినప్పటికీ అవి హైదరాబాద్ సహా అనేక మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో పిట్టగూళ్లకు నమూనాలుగా మిగిలాయి. మంచినీరు, పారిశుధ్యం సంగతి సరేసరి.
రాష్ట్రంలో హైదరాబాద్‌తోపాటు వివిధ పట్టణాలు, నగరాల్లో లెక్కకు మిక్కిలిగా ఫ్లై ఓవర్లు, స్కైవేలు, హైవేలు నిర్మిస్తున్న మాట వాస్తవమే. కానీ పేదోడి జీవితానికి.. వీటికి మధ్య అసలు పొంతనే లేకపోవటం గమనార్హం. వేలాది కోట్లు వెచ్చించి కార్పొరేట్లు, పెద్దోళ్ల కోసం వీటిని నిర్మిస్తున్న పాలకులు… కనీసం సగటు జీవి నడిచేందుకు ఫుట్‌పాత్‌లు నిర్మించకపోవటం శోచనీయం. ఆర్భాటంగా కనబడుతున్న హైవేలు, స్కైవేల సంగతి అటుంచితే.. సాధారణ, మధ్య తరగతి ప్రజలు వాడే రోడ్లు, గల్లీలు గుంతలమయంగా మారతున్నాయి. ఫలితంగా ప్రమాదాల్లో రోజూ అనేక మంది గాయాల పాలవుతున్నారు. వర్షాకాలంలో వరదలు, డ్రైనేజీ సమస్యలు, వేసవికాలంలో తాగునీటి ఎద్దడి పట్టణాల్లోని ప్రజలు వేధిస్తున్నాయి. ఒకవైపు గణనీయంగా పెరుగుతున్న పట్టణ జనాభా, ఇబ్బడిముబ్బడిగా కొనసాగుతున్న పట్టణీకరణ జిల్లా కేంద్రాలు, నగర పాలక సంస్థలతో పాటు రాష్ట్ర రాజధానిపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతున్నాయి.
ఉపాధి, ఉద్యోగాల కోసం జనం వలసలు పోతున్న మాట వాస్తవమే అయినా.. వారికి చాలినంత పని కల్పించటంలో ఇటు లోకల్ బాడీలు, అటు స్టేట్ గవర్నమెంట్ పూర్తిగా విఫలమవుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న వేళ… సగటు పట్టణ, నగర ఓటర్లు ఇలాంటి అంశాలన్నింటిపై లోతుగా ఆలోచించాలి. తమకు కావాల్సింది ఉపాధి రహిత అభివృద్ధా? చేతినిండా పని, కడుపునిండా తిండి పెట్టే అభివృద్ధా? ఏది ముఖ్యమనే విషయంపై వారు దృష్టి సారించాలి. గంజాయి, డ్రగ్స్ మాఫియా హైదరాబాద్ లాంటి కాస్మోపాలిటన్ నగరాన్ని దాటి మండల కేంద్రాలను కూడా అతలాకుతలం చేస్తున్న వేళ.. దాన్ని అరికట్టాలంటూ పాలకులను, ఓటు యాచకులను నిలదీయాలి. అందుకే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు… పార్టీలతోపాటు ప్రజలకు అత్యంత కీలకం. రాబోయే తరాలకు దిశా నిర్దేశం.
‘పుర’ పోరు కీలకం…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



