Thursday, January 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమూడో వారంలో మున్సిపల్‌ ఎన్నికలు

మూడో వారంలో మున్సిపల్‌ ఎన్నికలు

- Advertisement -

10లోపు ఓటర్ల తుది జాబితా
117 మున్సిపాల్టీలు, ఆరు కార్పొరేషన్ల ఎన్నికలకు రంగం సిద్ధం
అధికారులతో కలిసి ఎన్నికల సంఘం కసరత్తు

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఇటీవల పంచాయతీ ఎన్నికలను నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల ఎన్నికలపై దృష్టి సారించింది. జనవరి మూడోవారంలో 117 మున్సిపాల్టీలకు, ఆరు కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దీనికోసం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులు కసరత్తు ప్రారంభించారు. కొత్త ఓటర్ల నమోదు, జాబితాపై దృష్టి సారించారు. ఈనెల 10లోపు ఎన్నికల కమిషన్‌ ఓటర్ల తుది జాబితాను పూర్తి చేయనుంది. ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్‌ జారీ చేయనుంది. పది రోజుల్లోనే ఎన్నికల ప్రక్రియను ముగించాలని ఎన్నికల సంఘం యోచిస్తున్నట్టు తెలిసింది. ఇదే అంశంపై మున్సిపల్‌ శాఖ అధికారులతో సమాలోచనలు చేసింది. దీంతో ఈ నెలాఖరులోపు కొత్త మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మెన్లు, వైస్‌ చైర్మెన్లు, కౌన్సిలర్స్‌ కొలువుదీరనున్నారనే చర్చ జరుగుతోంది.

గడువు ముగిసి ఏడాది
రాష్ట్రంలో 26.01.2020న మున్సిపాల్టీల పాలకమండళ్లు కొలువుదీరాయి. వాటి కాలపరిమితి 26.01.2025తో ముగిసి దాదాపు ఏడాది కావొస్తున్నది. అయితే ఇప్పటి వరకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నది. మొత్తం 130 మున్సిపాల్టీలకు గడువు ముగిసింది. 12 మున్సిపాల్టీలను కొత్తగా ఏర్పాటు చేసింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పాలకమండలి కాలపరిమితి ఈ ఏడాది ఫిబ్రవరి 10న ముగియనుంది. ఇప్పుడు గ్రేటర్‌లో అదనంగా 27 మున్సిపాల్టీలను కలిపింది. వార్డుల విభజన కూడా జరిగింది. సరిహద్దులను ఖరారు చేసే పనిలో టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు కసరత్తు చేస్తున్నారు. మొత్తం 300 డివిజన్ల హద్దులను ఖరారు చేయడం, ఓటర్ల జాబితాను సిద్ధం చేసి ఏప్రిల్‌ మొదటివారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. మున్సిపాల్టీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లలో ఏడాది కాలంగా ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుండటంతో కొత్త పనులకు అనుమతి లేకుండాపోయింది. అయితే కొనసాగుతున్న పనులకు నిధులు మంజూరు కాకపోవడంతో పెండింగ్‌ పనులు ముందుకు పోవడం లేదు. ఫలితంగా మున్సిపాల్టీల్లో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ట వేశాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -