కేతిగాడు : మహాజనులారా అందరూ శ్రద్ధగా వినండి. బంగారక్క ఈ రోజు మనల్ని ఉద్దేశించి శాంతి ప్రవచనం చెప్తున్నది.
బంగారక్క : హమ్మయ్య. ఎట్టకేలకు యుద్దానికి తాత్కాలికంగా తెరపడింది. ప్రపంచం ఊపిరిపీల్చుకో గలిగింది. అమెరికా, ఇజ్రాయిల్ కలిసి ఇరాన్‌పై ఏకపక్షంగా దాడులు మొదలుపెట్టిన దాదాపు నలభై రోజులకు గాని ఈ మార్పు జరగలేదు. ఈ యుద్ధంలో ఎవరికి వారు తామే గెలిచామని అటు ట్రంప్, ఇటు ఇరాన్ చెప్పుకోవచ్చు. యుద్ధ విరమణ ఒప్పందం మాటునే ఇజ్రాయిల్, ఇరాన్ మిత్రదేశం లెబనాన్‌పై దొంగదాడి చేసి మరో మూడొందల మందిని బలికొన్నది. ఈ ఒప్పందానికి ముందు ట్రంప్ ఎన్నో బీరాలు పలికాడు. ఇరాన్‌ను నామరూపాలు లేకుండా చేస్తానన్నాడు. తన మాట వినని దేశాధినేతలను బూతులు లంఘించుకున్నాడు. హేళన చేశాడు. ఇలా మతిస్థిమితం లేకుండా పూటకోమాట మాట్లాడాడు. ఓ అగ్రరాజ్యం అమెరికా దేశానికి సాక్షాత్తు దేశాధ్యక్షునిగా వుండి, ఇంత నీచంగా మాట్లాడడం చూసి యావత్ ప్రపంచమే ఔరా! అని ముక్కున వేలేసుకున్నది. రెండో ప్రపంచ యుద్దంలో నరహంతకులు హిట్లర్, ముస్సోలినీ గురించి మనం విన్నాం. ఇప్పుడు ట్రంప్. ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహును కళ్లారా ప్రత్యక్షంగా చూస్తున్నాం. అయితే అప్పుడు భూతల యుద్ధాలు జరిగాయి. కోట్ల లక్షల సంఖ్యలో జన నష్టం సంభవించింది. ఇప్పుడు శాస్త్ర సాంకేతిక జ్ఞానం చాలా రెట్లు పెరిగింది. మానవరహిత గగన తల క్షిపణి దాడుల వలన మృతుల సంఖ్య తక్కువగా వుంటున్నది.
కానీ, నరహంతకుల మనస్తత్వం ఎప్పుడూ భీభత్సంగానే వుంటుందనే విషయం అర్థమవుతున్నది. దేశం ఏదైనా వారు అనుకున్నదే చేస్తారు. జాతి ద్వేషానికి, క్రూరమైన దోపిడీకి, మానవహననానికి సునాయాసంగా పాల్పడతారు. సాటి మనుషుల ప్రాణాలకు వీసమెత్తు విలువ ఇవ్వరు. అంతర్జాతీయ న్యాయచట్టాలను పాటించరు. ఐక్య రాజ్య సమితి నేతల మాటలను లెక్కచేయరు. వారేదనుకుంటే అదే చేస్తారు.
అయితే ప్రపంచం ముందుకే నడుస్తుంది. నరహంతకుల ఉన్మాదాన్ని, పిచ్చి ప్రేలాపనలు ఓ కంట కనిపెడ్తూనే వున్నది. పత్రికల ద్వారా, ముఖ్యంగా సోషల్‌మీడియా ద్వారా వీరి దుర్మార్గాలను ఘాటుగా విమర్శిస్తున్నది. తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ విచక్షణా, వివేకమే మానవజాతిని ఆశావాహకంగా ఉంచగల్గుతున్నది. అక్కడిదాకా ఎందుకు? అమెరికా దేశంలోనే దాదాపు కోటిమంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ‘మాకు యుద్ధాలు వద్దు – శాంతి కావాలి’, ‘రాజులు వద్దు – ప్రజాస్వామ్యం కావాలి’ ట్రంప్ దిగిపో అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. ఇంతటి మూర్ఖపు నేతను ఎందుకు ఎన్నుకున్నామా? అని తలపట్టుకుంటున్నారు.
జుట్టుపోలుగాడు : అయితే ఇక యుద్ధంముసిగిపోతుందా?
బంగారక్క : యుద్ధం ముగియాలనేది ప్రపంచ ప్రజలందరి కోరిక. కాని ట్రంప్, నెతన్యాహుల చరమాంకం పూర్తిగా అంతం కాలేదు. పూర్తయేంతవరకు అప్రమత్తంగా వుండాల్సిందే. ఈ యుద్ధోన్మాదులు ఉన్నంతవరకూ మానవాళికి క్షేమం వుండదు. మరోపక్క ప్రపంచం అస్తవ్యస్తమవుత్నుది. యుద్ధానికి ముందు చమురు బావులు, సహజ వాయువు నిక్షేపాలు, రవాణా సరఫరా అన్నీ ప్రశాంతంగా జరిగిపోయేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అవి దెబ్బతిన్నాయి. హార్మోజ్ జలసంధి ద్వారా చమురు రవాణా ఇప్పుడు దినదినగండం నూరేళ్ల ఆయుష్షులా మారింది. ఏ క్షణాన చమురు ఆగిపోతుందో అందిరికీ భయంగొలుపుతున్నది. చమురుకొరతతో మొత్తం రవాణా స్తంభిస్తున్నది. క్యూబా వంటి దేశాల్లో విద్యుత్ కొరత ఏర్పడి హాస్పిటల్, ఇంక్యుబేటర్‌లలోని చిన్నారులకు ప్రాణాంతక ముప్పు ఏర్పడుతున్నది. ఒక పక్క పాలకులు అభివృద్ధి పేరుతో అంతరిక్ష విహారం (స్పేస్ టూరిజం) ఏర్పాట్లు చేస్తున్నారు. కాని నేలమీద ఆకలి దప్పులతో అలరారే మానవాళిని పట్టించుకోలేక పోతున్నారు. అంటే మానవుడు మానవీయం కాలేకపోతున్నాడనే మౌలిక సత్యాన్ని మనం గ్రహించాలి.
మనం మన భావితరాలకు అంటే మన పిల్లలకు ఈ విషయాలను పూసగుచ్చినట్టు చెప్పాలి. యుద్ధాలు యాదృశ్చికంగా రావని, మానవ కల్పిత వైపరీత్యాలేనని తేటతెల్లం చేయాలి. ఒక రాజ్యంపై మరో రాజ్యం, ఒక దేశంపై మరో దేశం.. ఇంకానా.. ఇక పై సాగదంటూ ఎలుగెత్తి చాటేలా మన చదువులు ప్రాణం పోసుకోవాలి.
అంతులేని సామ్రాజ్యవాద కార్పొరేట్ దోపిడి, అమానవీయ మూర్ఖత్వం కలగలిసిన క్రూర పాలకులు దేశాలు ఏలుతున్న ఆధునిక కాలంలో మనం జీవుస్తున్నామన్న వాస్తవాన్ని ప్రతి ఒక్కరం తెలుసుకోవాలి. అప్పుడే యువత తమ భవితను తామే తీర్చిదిద్దుకోగలమన్న ఆత్మస్థైర్యంతో ముందుకు పోగలుతుంది. ఇదే చరిత్ర గమనం.
సర్వేజనా సుఖినోభవంతు.
కె.శాంతారావు, 9959745723
నరహంతక చరమాంకం?!
- Advertisement -
- Advertisement -



