అకస్మాత్తుగా తగ్గిన ప్రభుత్వ పంటనష్టం లెక్కలు
అడ్డగోలు షరతులతో పత్తిరైతుల అరిగోస
కొట్టుకుపోయిన పంటకే పరిహారం…
అదీ 33 శాతం దాటితేనే
రాలిన, మురిగిన కాయలు లెక్కల్లో లేవ్
పంట బీమా ఎటుపాయెనో…
కిసాన్ కపాస్ కష్టాలతో దళారులకు పండుగ
పత్తిరైతులు అరిగోస పడుతున్నారు. తమ కష్టం పగోడికి కూడా రావద్దంటూ బోరుమంటున్నారు. ఎకరాకు రూ.10వేలు ఇస్తామని స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. కేంద్రంలోని మోడీ సర్కారు ఉలుకూ పలుకూ లేదు. రాష్ట్రంలో ఏ ప్రకృతి వైపరీత్యం జరగనట్టే సైలెంట్‌గా చోద్యం చూస్తోంది. మొంథా తుపానుతో రాష్ట్రంలో దాదాపు 4.72 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం తొలుత అంచనా వేసింది. సీఎం ఎకరాకు రూ.10వేలు పరిహారం ప్రకటించాక ఆ సంఖ్య హఠాత్తుగా 1.17 లక్షల ఎకరాలకే పరిమితమైంది. పరిహారం పరిధిలోకి రావాలంటే సవాలక్ష షరతులు విధించారు. రైతాంగం సహనాన్ని పరీక్షిస్తున్నారు.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఈ ఏడాది రాష్ట్రంలో పత్తి రైతులకు మొదట్లో అదును కాక రెండుసార్లు విత్తనాలు విత్తుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆగస్టు, సెప్టెంబర్‌లో అకాల వర్షాలతో కాయలు మురిగిపోయాయి. దసరా తర్వాత అకాల వర్షాలు, మొంథా తుఫాను విపత్తుతో పత్తిరైతు బోరుమన్నాడు. తీసిన పంట తడిసిపోయింది. ఉన్న కాయలు రాలిపోయాయి. మిగిలిన కాయలు మురిగిపోయాయి. పంటకోసం పెట్టిన పెట్టుబడి, తెచ్చిన అప్పులు నీళ్లపాలయ్యాయి. ఇవన్నీ నిన్న మొన్నటి వరకు కండ్ల ముందు కనిపించిన సజీవ దృశ్యాలు. ప్రకృతి వైపరీత్యం సమయంలో హడావిడి చేసిన పాలకులు, ఆ తర్వాత నింపాదిగా పంటనష్టం అంచనాకు పొలాల్లోకి దిగారు.
ఆగస్టులో కురిసిన వర్షాలతో 2.36 లక్షల ఎకరాలు, మొంథా తుఫాన్‌తో 4.72 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు ప్రభుత్వం తొలి అంచనా వేసింది. అందులో 1.60 లక్షల ఎకరాల పత్తిపంట ఉంది. ఎకరాకు రూ.10వేలు పరిహారం ప్రకటన తర్వాత అన్ని పంటల నష్టం 1.17 లక్షల ఎకరాలకు పరిమితమైంది. కానీ 13.5 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని రైతు సంఘాలు చెప్తున్నాయి. నష్టపోయిన రైతులందర్నీ పరిహార జాబితాలో చేర్చట్లేదు. కొన్ని రకాల పంట నష్టాలనే సర్కారు పరిగణనలోకి తీసుకుంటోంది. కౌలు రైతులను నమోదు చేయట్లేదు. పంట బీమా పథకం ఏమైందో కూడా రైతాంగానికి చెప్పట్లేదు.
అంచనాల్లోనూ అన్యాయమే
రైతు సాగు చేసిన విస్తీర్ణంలో 33 శాతానికిపైగా పంట దెబ్బతింటేనే సర్కారు పంట నష్టంగా చూపెడుతున్నది. వాస్తవానికి పత్తి పంట చూడటానికి పచ్చగా కనిపిస్తున్నప్పటికీ వర్షాలతో చాలా వరకు కాయలు రాలిపోవడం, మురిగిపోవడం జరిగింది. దాన్ని అధికారులు పరిగణనలోకి తీసుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. సాధారణంగా తెలంగాణలో నల్లరేగడి భూముల్లో కాలాన్ని బట్టి ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల పత్తి, ఎర్ర నేలల్లో అయితే 6 నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. కానీ ప్రకృతి వైపరీత్యాల తర్వాత పత్తి రైతులకు ఎకరాకు మూడు నుంచి ఐదు క్వింటాళ్లకు మించి పత్తి దిగుబడి వచ్చే అవకాశం లేదు. ఇది రైతులకు ముమ్మాటికీ తీవ్ర నష్టమే.
కేంద్రం మౌనం
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తుది జాబితా ప్రకారం పంట నష్టం జరిగిన ఎకరాలకు పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. రైతు స్వరాజ్య వేదిక 2020 అక్టోబర్‌కు సంబంధించిన పరిహారంపై కేసు వేయగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.552 కోట్ల పరిహారం ప్రతిపాదించింది. దానిలో కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.188 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. ఎకరాకు కనీసం రూ.10 వేల ఆర్థిక సహాయం ఇవ్వాలన్న నలుగురు సీఎంల నేతృత్వంలోని హుడా కమిటీ సిఫారసులను కేంద్రం బుట్టదాఖలు చేసింది. తరి పంటకు రూ.6,800, మెట్ట పంటలకు రూ.3,400 మాత్రమే ఇస్తున్నది. అయితే, కేంద్రానికి పంపే జాబితాను పట్టించుకోకుండా కొన్ని రాష్ట్రాలకు ఎక్కువగా, మరికొన్ని రాష్ట్రాలకు తక్కువగా ఇస్తున్నదనే విమర్శ ఉంది.
కిసాన్ కపాస్ కష్టాలు
కేంద్ర ప్రభుత్వం సీసీఐ ద్వారా రైతుల నుంచి పత్తి కొనుగోలు చేసేందుకు ఇటీవల కిసాన్ కపాస్ యాప్‌ను తీసుకొచ్చింది. అది రైతులకు ప్రాణసంకటంగా మారింది. బాగా చదువుకున్నవాళ్లే యాప్‌లో ఫారాలు నింపడం కష్టం. అలాంటిది రైతులు ఎలా దరఖాస్తు చేసుకుంటారనే కనీస ఆలోచన కూడా కేంద్రం చేయట్లేదు. యాప్‌లో నమోదు, 12 శాతం లోపు తేమ వంటి నిబంధనలతో రైతులు దళారులకు పత్తి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఫలితంగా ఒక్కో క్వింటాకు రైతు రూ.2 వేల మేరకు నష్టపోతున్నారు. ఇంత జరుగుతున్నా రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు ఏ పట్టింపూ లేకుండా ఉన్నారని రైతులు విమర్శిస్తున్నారు.
ఆగమైనాం…ఆదుకోవాలే దీపక్, సిరికొండ మండలం, ఆదిలాబాద్ జిల్లా
మూడెకరాల్లో పత్తి, రెండెకరాల్లో వరి పంట వేసినం. విత్తనాలు వేసినప్పుడు వానలు పడక ఆగమైంది. మొలకెత్తినంక ఎక్కువ వానలు పడి పంట ఆగమైంది. ఈసారి రెండు విధాలా నష్టపోయినం. వర్రెపక్కన భూముంది. వానలు పడ్డప్పుడల్లా చేను కొట్టుకుపోతున్నది. ఈసారీ రెండు ఎకరాల పత్తి పంట నష్టపోయిన. ఏటా ఎకరానికి 12 నుంచి 13 క్వింటాళ్ల పత్తి పండేది. ఈసారి మూడు క్వింటాళ్లు కూడా పండేది కష్టంగ ఉంది. విత్తనాలకు రూ.20వేలు, దున్నకాలకు రూ.15వేలు, పత్తిమందులకు పదివేలకుపైగా ఖర్చుపెట్టిన. ఈసారి అంతా మీదపడ్డది.
పరిహారం మాదాక అందుతుందా? తిరుమలయ్య, పెద్ద ఉమ్మంతల్, పోడూరు మండలం, వికారాబాద్ జిల్లా
నష్టపరిహారం మాదాక అంతదంటవ. నా పదెకరాలు, కౌలుకు తీసుకున్న ఐదెకరాల్లో మొత్తం పత్తే వేసిన. మొత్తం పోయింది. మంచి నల్లరేగడి భూమి. కాలమైతే 14, 15 క్వింటాళ్ల పత్తి వస్తది. ఈసారి రెండు క్వింటాళ్లు కూడా ఎల్లెటట్టు లేదు. చేనుమీద ఇంగేం ఉన్నది. కాయంతా మురిగిపోయింది. కొంత కాయ రాలిపోయింది. పగిలిన కాయ పాయలుపాయలు ఎల్తున్నది. ఒక్కరు తీసే పత్తి నలుగురు తీస్తున్నరు. ఇప్పటిదాకా ఐదారులక్షల పెట్టుబడి అయింది. కొంత మొక్కజొన్న వేసిన. అది కలిసొచ్చింది. అంతపోను మూడు, మూడున్నర లచ్చలు మీదపడేటట్టుంది. ఒక్కఊర్లో 400 ఎకరాల్లో పంట నష్టమైతే మండల మొత్తం 40 ఎకరాల్లో పంట నష్టపోయినట్టు సార్లు లెక్కలు రాసిరంట. ఎట్టిస్తరు. ఊరికొక ఎకరం, ఊరికొక రైతుకు ఇస్తరన్నమాట. దళారులు 50, 60 రూపాయలకు కిలో లెక్క కొంటరు. అదే పత్తిని పొద్దుగూకినంక మార్కెట్ల రూ.80కి అమ్ముకుంటున్నరు.
మా పరిస్థితి దారుణం
సొంతంగ మూడెకరాల్లో, కౌలుకు దీసుకున్న ఐదెకరాల్లో పత్తి సాగుచేసిన. మొదట్ల కాలం గాక చేనుపెరగలే. చెట్టుకు 35 నుంచి 40 కాయలు పడ్డయి. దసర నుంచి దీపావళి అయిపోయిందాక వానలు ఇడ్వలే. చెట్టుకు 15 నుంచి 20 కాయలు పాసిపోయినయి. ఎకరానికి రెండు, మూడు క్వింటాళ్లు వచ్చేదే కష్టంగ ఉంది. అదిగూడ కిల పత్తి ఏర్తె పది, 12 రూపాయలంటున్నరు. ఎంత ఏరిన అది జమ కూడా అయితలేదు. అందుకే కిలోల లెక్కన ఏరమంటున్నరు. కైకిలుకు రమ్మంటే రోజుకు 300 అడుగుతున్నరు. 10-15 కిలోలు ఏర్తె మాకేం గిడ్తది. సోయ పంటేస్తే అదీ పాడైపోయింది. నష్టపరిహారం వస్తదేమో చూడాలి. వచ్చిరు కొంత మంది రాసుకుపోయిరు. అందులో మా పేరు ఉన్నదో లేదో కూడా తెల్వదు. ఇప్పటిదాకనైతే రిపోర్టు రాలేదు. పత్తి రైతుల పరిస్థితి ఘోరంగ ఉంది.
మడవి లక్ష్మణ్, దనూర, ఇంద్రవెల్లి మండలం, ఆదిలాబాద్ జిల్లా



