పర్యాటకులకు సాదర ఆహ్వానం పలుకుతున్నాం : పంచాయతీరాజ్, మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క
నవతెలంగాణ-ములుగు
ములుగు జిల్లా పర్యాటకులకు భూతల స్వర్గధామంగా ఉందని, సహజసిద్ధ ప్రకృతి అందాలు, భక్తి, ఆనందం, ఆహ్లాదంతోపాటు చారిత్రాత్మక నేపథ్యం కలిగిన పర్యాటక ప్రదేశాలు నెలవై ఉన్నాయని పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ములుగు జిల్లా పర్యాటక అందాలను చూడటానికి వచ్చే పర్యాటకులకు సాదర ఆహ్వానం పలుకుతున్నామని చెప్పారు. తాడ్వాయి మండల కేంద్రంలో బుధవారం ఎకో టూరిజం ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్‌లోని తాడ్వాయి వైల్డ్ లైఫ్ మేనేజ్‌మెంట్ రేంజ్, తాడ్వాయి హాట్స్, రెండు సఫారీ వాహనాలను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, డీఎఫ్‌ఓ రాహుల్ కిషన్ జాదవ్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా తాడ్వాయి హాట్స్ ఆవరణలో ఉన్న వివిధ జాతులకు చెందిన వృక్షాలు, వాటి ప్రయోజనాల గురించి పూర్తి వివరాలను డీఎఫ్‌ఓ రాహుల్ కిషన్ జాదవ్ వివరించారు.
ఆ తర్వాత వారంతా సఫారీ వాహనంలో తాడ్వాయి వైల్డ్ లైఫ్ రేంజ్ సుమారు 7 కిలోమీటర్ల మేర పర్యటించారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ.. పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశాల మేరకు.. ఎకో టూరిజం ఏటూరు నాగారం వైల్డ్‌లైఫ్‌లోని తాడ్వాయి వైల్డ్ లైఫ్ మేనేజ్‌మెంట్ రేంజ్‌లోని తాడ్వాయి హాట్స్‌ను ఆధునీకరణంగా సుందరీకరించి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు చెప్పారు.
ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం ప్రపంచ పర్యాటకులను సైతం ఆకట్టుకుంటుందని, రామప్ప సరస్సు మధ్యగల ద్వీపకల్పంలో నూతనంగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. త్వరలోనే పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. కొండల మధ్య కాకతీయులు నిర్మించిన లక్నవరం సరస్సు ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటుందని వివరించారు. పస్రా-తాడ్వాయి జాతీయ రహదారి నుంచి మూడు కిలోమీటర్ల దట్టమైన అటవీ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కలిగిన బ్లాక్ బెర్రీ ఐలాండ్‌ను పున్ణప్రారంభించినట్టు తెలిపారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు నైట్ క్యాంప్ విడిది కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. తెలంగాణ నయాగరా బొగత వాటర్ ఫాల్స్ చూపరులను ఆకట్టుకుంటుందన్నారు.
భూతల స్వర్గధామం ములుగు ప్రకృతి అందాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



