Monday, February 2, 2026
E-PAPER
Homeజాతీయంప్రతికూల ప్రభావం ఆర్థికవేత్తల ఆందోళన

ప్రతికూల ప్రభావం ఆర్థికవేత్తల ఆందోళన

- Advertisement -

న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన ప్రకటనలు ప్రతికూల ఫలితాలు ఇస్తాయని మార్కెట్‌ విశ్లేషకులు, నిపుణులు అభిప్రాయపడ్డారు. సెక్యూరిటీల లావాదేవీల పన్ను (ఎస్‌టీటీ)ను పెంచడం మూలధన మార్కెట్‌ వ్యవస్థకు ఇబ్బందిగా పరిణమిస్తుందని వారు తెలిపారు. ఫ్యూచర్స్‌పై ఎస్‌టీటీ ని 0.05శాతం పెంచాలని ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ప్రతిపాదించారు. దీనివల్ల ట్రేడింగ్‌ పరిమాణం తగ్గిపోతోంది. మార్కెట్‌లో చురుకుగా భాగస్వాములయ్యే వారి లాభాలు పడిపోతాయి. కేంద్ర బడ్జెట్‌ ప్రకటన వెలువడుతున్న సమయంలో మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. సెన్సెక్స్‌ భారీగా పతనమైంది. ఇన్వెస్టర్లలో విశ్వాసం సన్నగిల్లిపోయింది. దీర్ఘకాలిక, స్వల్పకాలిక లాభాల పన్ను రేట్లకు తరచూ సర్దుబాట్లు చేస్తే అస్థిరత ఏర్పడుతుంది. స్థిరమైన పెట్టుబడులకు గమ్యస్థానంగా భారత్‌కు ఉన్న ఇమేజ్‌ దెబ్బతింటుంది. కాగా మూలధనపు వ్యయంలో వృద్ధి లేకపోవడాన్ని ఆర్థికవేత్తలు ప్రస్తావించారు. గత కేటాయింపులతో పోలిస్తే ఈసారి పెద్దగా పెరుగుదల కన్పించలేదని వారు పెదవి విరిచారు. దీనివల్ల మౌలిక సదుపాయాల కల్పన కుంటుపడే ప్రమాదం ఉంది.

ఈ బడ్జెట్‌లో కొన్ని నిర్దిష్ట రంగాలకు మద్దతు తగ్గిపోవడం గమనార్హం. ఉదాహరణకు విద్యుత్‌ ప్రాజెక్టులకు ఇచ్చే రుణాలలో పాతిక శాతం కోత విధించారు. పాఠశాల విద్యపై కూడా బడ్జెట్‌ తగినంత దృష్టి కేంద్రీకరించలేదు. అధిక జీడీపీ కేటాయింపులు జరపాలన్న సిఫార్సులు ఉన్నప్పటికీ బడ్జెట్‌ ప్రసంగంలో దీని ప్రస్తావన తగినంత లేదన్న విమర్శలు వస్తున్నాయి. నీటి సరఫరా, పారిశుధ్య పనులకు బడ్జెట్‌ కేటాయింపులు ఏ మాత్రం సరిపోవడం లేదు. విదేశీ రుణాలు కొండలా పెరిగిపోతున్న విషయాన్ని బడ్జెట్‌ గుర్తు చేసింది. 2026-27లో ఈ రుణాలు రికార్డు స్థాయిలో రూ.17.2 ట్రిలియన్లకు చేరవచ్చు. మార్కెట్‌ అంచనాల కంటే ఇది ఎక్కువే. ఇక ప్రజల్లో వినియోగాన్ని పెంచేందుకు ప్రకటించిన చర్యలు కూడా పరిమితంగానే ఉన్నాయి.

డిమాండ్‌ను పెంచేందుకు విస్తృత చర్యలు చేపట్టాల్సి ఉండగా ఆ దిశగా బడ్జెట్‌లో చర్యలను ప్రతిపాదించలేదు. దీర్ఘకాలిక సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి. బడ్జెట్‌ అంచనాలలో వాస్తవికత లోపిస్తోంది. ప్రాజెక్టుల అమలులో జాప్యం జరుగుతోంది. ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో నిధులను ఖర్చు చేసే ధోరణి నేటికీ కొనసాగుతోంది. మొత్తంగా చూస్తే వృద్ధికి ఊతమిచ్చే ప్రకటనలకు బదులుగా ఆర్థిక క్రమశిక్షణ పైనే బడ్జెట్‌ దృషి పెట్టిందని, దీనివల్ల మార్కెట్లలో సెంటిమెంట్‌ బలహీనపడుతుందని ఆర్థికవేత్తలు తెలిపారు. సమగ్ర దేశాభివృద్ధిపై దృష్టి సారించాల్సిన ప్రభుత్వం భాగస్యామ్య పార్టీల ఒత్తిడికి తలవంచి వాటి డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రాధాన్యత ఇచ్చిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -