తిరువనంతపురం : ఉద్దేశపూర్వక మైన, దశలవారీ చర్యలద్వారా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టాన్ని (ఎంజీఎన్‌ఆర్‌ఈ జీఏ) నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్ని స్తోందని కేరళ స్థానిక స్వపరిపాలన శాఖమంత్రి ఎంబీ రాజేశ్ ఆరోపించారు. కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త బిల్లు ఈ చట్టం మూల సూత్రాలను పూర్తిగా తుడిచిపెట్టేసి, ఉపాధి కల్పించే బాధ్యత నుంచి పూర్తిగా వైదొలగాలని చూస్తోందని ఆయన అన్నారు. 40 శాతం వ్యయాన్ని రాష్ట్రాలపైకి బదిలీ చేయడం ద్వారా, కేరళ ఒక్కదానికే ఏటా రూ. 1600 కోట్ల నష్టం వాటిల్లుతుందని మంత్రి చెప్పారు. ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని రాష్ట్రం డిమాండ్ చేస్తోందని ఆయన చెప్పారు.
వామపక్షాల ఒత్తిడితో మొదటి యూపీఏ ప్రభుత్వం కనీస ఉపాధి కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు ఉపాధి హామీ చట్టం రూపుదిద్దుకుందని రాజేశ్ అన్నారు. వామపక్షాలు భాగస్వామిగాలేని రెండవ యూపీఏ ప్రభుత్వ హయాంలో ఈ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని ఆయన ఆరోపించారు. అప్పుడే కేటాయింపులలో పెద్దఎత్తున కోతలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ప్రస్తుత బిల్లు దశాబ్దకాలపు ప్రణాళికకు పరాకాష్ట అని అన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. గత పదేండ్లుగా, వేతనాలను ఆలస్యం చేయడం, బకాయిలు సృష్టించడం, పని దినాల సంఖ్యను తగ్గించడం ద్వారా ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించిందని ఆయన చెప్పారు.
అర్హులైన కుటుంబాలకు కనీసం 100 పనిదినాలు కల్పించడం, ఉపాధిని చట్టబద్ధమైన హక్కుగా స్థాపించడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశమని రాజేశ్ నొక్కిచెప్పారు. కొత్త బిల్లు ఈ మూల భావనను తొలగించి, కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు, కార్మిక బడ్జెట్ ప్రకారం మాత్రమే ఉపాధి కల్పించేదిగా దీన్ని నీరుగార్చిందని ఆయన అన్నారు. ఇకపై ప్రభుత్వ నిర్దేశిత బడ్జెట్, షరతులకు సరిపోతేనే ఉపాధి కల్పిస్తారని, తద్వారా పని కల్పించాలనే కేంద్రం బాధ్యత నుంచి సమర్థవంతంగా వైదొలగుతున్నారన్నారు. నిధుల విడుదల మార్పులతో కేరళ వంటి రాష్ట్రాలపై అత్యధిక ప్రభావం చూపుతాయని రాజేశ్ అన్నారు. దాదాపు 40 శాతం వ్యయాన్ని రాష్ట్రంపై మోపుతోందన్నారు. దీంతో పాటు నిర్ణయ హక్కులు రాష్ట్రాలకు కల్పించటంలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం కేరళ కేవలం 25శాతం మాత్రమే భరిస్తోందని, అయితే బిల్లులోని సెక్షన్ 22(2) ప్రకారం.. వ్యయ పంపిణీ నిష్పత్తి 60:40కి మారుతుందని, అంటే ఏటా రూ.1,600 కోట్ల మేర అదనపు భారం పడుతుందని ఆయన అన్నారు.
సెక్షన్ 22(4) ప్రకారం కేంద్ర ప్రభుత్వం ‘ప్రామాణిక కేటాయింపు’ ఆధారంగా రాష్ట్రాలకు నిధులను కేటాయిస్తుందని, దీన్ని మించి చేసే ఏ ఖర్చునైనా సెక్షన్ 22(5) ప్రకారం రాష్ట్రమే భరించాలని రాజేశ్ వివరించారు. రాష్ట్రం తన లక్ష్యాలను అధిగమించినప్పటికీ, కేంద్రం కొన్నేండ్లుగా కేరళకు కేటాయించే పనిదినాలను క్రమంగా తగ్గిస్తోందని తెలిపారు. 2021-22లో 7.5 కోట్లు, 2022-23 నుంచి 2024-25 వరకు 6 కోట్లు, 2025-26 సంవత్సరానికి 5 కోట్ల మేర పనిదినాలు కేటాయించారని ఆయన చెప్పారు. అయితే.. ఆయా సంవత్సరాల్లో కేరళ కేటాయించిన దానికంటే ఎక్కువ పనిదినాలను కల్పించిందని వెల్లడించారు. కానీ కొత్త బిల్లు అదనపు పనిని అందించే రాష్ట్ర సామర్థ్యాన్ని తగ్గించేలా ఉందని ఆయన అన్నారు.
పనిదినాలను 100 నుంచి 125కి పెంచుతామన్న ప్రకటనను రాజేశ్ ”ఒక డొల్ల వాగ్దానం” అని అభివర్ణించారు. బిల్లులోని సెక్షన్ 5(1) ప్రకారం, నోటిఫై చేసిన గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నవారికి మాత్రమే 125 రోజుల పని కల్పిస్తారని, ఇది అన్ని పంచాయతీలను కవర్ చేయదని వివరించారు. విత్తనాలు వేసే, పంట కోసే సమయాల్లో ఆంక్షలు విధించడం వంటి నిబంధనల వల్ల లక్షలాది గ్రామీణ కుటుంబాలు మినహా యింపునకు గురవుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సుదూర పని ప్రదేశాలు, గిరిజన ప్రాంతాల్లో సాంకేతిక సమస్యలు, కార్మికుల్లో తక్కువ సాంకేతిక అక్షరాస్యతను ఉదహరిస్తూ, ఆధార్ ఆధారిత ధ్రువీకరణపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. కేరళ ఈ పథకాన్ని పూర్తి సామాజిక ఆడిటింగ్‌తో అమలు చేసిందని, ఇది జాతీయ నమూనాగా నిలిచిందని, అయితే కొత్త బిల్లు ఈ ఆడిటింగ్ యంత్రాంగాన్ని బలహీన పరుస్తుందని ఆయన అన్నారు.
కొత్త బిల్లుతో కేరళపై ఏటా రూ.1600 కోట్ల భారం
- Advertisement -
- Advertisement -



