– ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలి : సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం (2026-27)లో విద్యార్థులు అధిక సంఖ్యలో పెరిగేలా చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సోమవారం ఆయన లేఖ రాశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఏటా విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం ఆందోళనకరమని తెలిపారు. రాష్ట్రంలో 18,259 ప్రభుత్వ, మండల పరిషత్ పాఠశాలల్లో 2024-25 యూడైస్ గణాంకాల ప్రకారం 6,87,395 మంది విద్యార్థులు చదివారని వివరించారు. వాటిలో 1,825 బడుల్లో విద్యార్థుల్లేరనీ, 2,242 పాఠశాలల్లో పది కంటే తక్కువ మంది పిల్లలున్నారని తెలిపారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో మౌలిక మార్పులు చేయాలనీ, తరగతికొక టీచర్, గది ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అది చేయకుంటే ఏటా మరికొన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య సున్నాకు చేరేవి పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నగరాలు, పట్టణాల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నదని తెలిపారు. 70 శాతం మంది విద్యార్థులు మున్సిపాల్టీలు, మున్సిపల్ కార్పొరేషన్లలోనే చదువుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను అభివృద్ధి చేస్తేనే నిలబడతాయని తెలిపారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సింగిల్ సెక్షన్, డబుల్ సెక్షన్ లేదా త్రిబుల్ సెక్షన్ నిర్వహించడానికి అనుగుణంగా పోస్టులను మంజూరు చేయాలని కోరారు. రేషనలైజేషన్ ఉత్తర్వులను సవరించి అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించాలని తెలిపారు. పట్టణాలు, నగరాల్లో కొత్త ప్రభుత్వ బడులను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. 2026-27 రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయింపులు పెంచి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అవసరమైన చర్యలు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. వచ్చే విద్యాసంవత్సరాన్ని వినూత్నంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



