ప్రపంచ పర్యావరణ సంస్థ ఆధ్వర్యంలో.. 22 భాషల భారీ బ్యానర్‌తో వినూత్న అవగాహనా ర్యాలీ
నవతెలంగాణ-సుబేదారి
మేడారం మహాజాతర పవిత్రతను, అక్కడి అటవీ సంపదను పరిరక్షించడమే లక్ష్యంగా ప్రపంచ పర్యావరణ సంస్థ ఆధ్వర్యంలో గురువారం హనుమకొండ కలెక్టరేట్ వద్ద భారీ అవగాహన ర్యాలీ, ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సామాజిక వేత్తలు ఈవీ శ్రీనివాస్‌రావు, డాక్టర్ సీహెచ్ భద్రతో కలిసి హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం చేపడుతున్న వినూత్న కార్యక్రమాన్ని అభినందించారు. మేడారం వంటి పవిత్ర ప్రాంతాల్లో ప్రజల సహకారంతోనే ప్లాస్టిక్ నియంత్రణ సాధ్యమవుతుందని తెలిపారు. ఈ నెల 28వతేదీ నుంచి 31 వరకు జరగనున్న మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను పూర్తిగా ‘ప్లాస్టిక్ రహిత’ జాతరగా మార్చాలని పిలుపునిచ్చారు.
ఈవీ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. ఈసారి జాతరకు సుమారు 2.5 కోట్ల నుంచి 3 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఒక్కొక్కరు సగటున 10-20 ప్లాస్టిక్ కవర్లు లేదా బాటిళ్లు వాడితే, 10 నుంచి 15 కోట్ల ప్లాస్టిక్ వ్యర్థాలు అడవిలో చేరే ప్రమాదం ఉందని అన్నారు. ఇది మేడారం అడవిని కాలుష్య కాసారంగా మారుస్తుందని తెలిపారు. కాబట్టి భక్తులు బాధ్యతగా ప్లాస్టిక్‌ను త్యజించి అడవి తల్లిని కాపాడితేనే మన భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాజీపేట ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ పిట్టల వెంకన్న, ప్రపంచ పర్యావరణ సంస్థ కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ పటేల్, జాతీయ యువజన కార్యదర్శి సుమెర్, కాంగ్రెస్ నాయకులు ఏనుగుల రాంప్రసాద్, దయాప్రసాద్, సామాజిక కార్యకర్త చంద్రప్రకాష్, జనగామ జిల్లా అధ్యక్షులు నీలం యువరాజ్, సంస్థ అంబాసిడర్ అద్విత్ తదితరులు పాల్గొన్నారు.



