పంపులు, మోటార్లు పాడయ్యేలా కుట్ర
ఆ నెపాన్ని బీఆర్‌ఎస్‌పై నెట్టేందుకు ప్రయత్నం
మంత్రి ఉత్తమ్‌కు మాజీమంత్రి హరీశ్‌రావు బహిరంగ లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల్లోని భారీ మోటార్లను నిబంధనలకు విరుద్ధంగా పదేపదే ఆన్, ఆఫ్ చేయడం అశాస్త్రీయమని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బుధవారం ఆయన బహిరంగ లేఖ రాశారు. భారీ నీటిపారుదల మోటార్లను ఇష్టానుసారంగా ఆన్, ఆఫ్ చేయడం ఇంజినీరింగ్ నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. ఇలా చేస్తే వైబ్రేషన్స్ వచ్చి పంపులు, ఇంప్లర్స్, మోటార్లు పాడైపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఆ నెపం నెట్టేందుకే ఉద్దేశపూర్వకంగా మోటార్లను పాడు చేసే ప్రయత్నం చేస్తున్నారా?అని ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ పాలనాపరమైన నిర్లక్ష్యమా? లేక కావాలనే చేస్తున్న కుట్రనా?అని తెలిపారు.
భారీ మోటార్లు నిరంతరాయంగా నడిచేలా డిజైన్ చేసినవనీ, పదే పదే ఆపితే తీవ్ర నష్టం తప్పదని పేర్కొన్నారు. రూ.వేల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టులను ఇలా నిర్లక్ష్యంగా వాడటం శోచనీయమని తెలిపారు. చందలాపూర్ సహా ప్యాకేజీ 6, 8, 10, 11, 12లలో మోటార్ల ఆపరేషన్ తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మోటార్లను పదే పదే ఆన్, ఆఫ్ చేసే అశాస్త్రీయ విధానాన్ని ప్రభుత్వం తక్షణమే మానుకోవాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ నిబంధనల ప్రకారం, డిజైన్‌కు అనుగుణంగా నిరంతరాయంగా పంపులను నడిపించాలని కోరారు. రాజకీయాల కోసం తెలంగాణ రైతుల జీవనాడి అయిన ప్రాజెక్టులతో చెలగాటం ఆడొద్దని ఆయన హెచ్చరించారు.



