ఢిల్లీపై గుజరాత్ ఏకపక్ష విజయం
ప్లే ఆఫ్స్‌లో టైటాన్స్, పంజాబ్, ఆర్‌సీబీ
ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్ రేసులో మూడు బెర్తులు ఖరారు అయ్యాయి. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూర్‌లు ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాయి. ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్ టైటాన్స్ 10 వికెట్ల తేడాతో ఏకపక్ష విజయం సాధించింది. క్యాపిటల్స్‌పై విజయంతో ప్లే ఆఫ్స్‌కు వెళ్లిన టైటాన్స్.. ఇతర రెండు బెర్తులను సైతం ఖరారు చేసింది. ప్లే ఆఫ్స్‌లో నాల్గో బెర్త్ కోసం ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీపడుతున్నాయి.
నవతెలంగాణ-న్యూఢిల్లీ
గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు ఖతర్నాక్ షో చేశారు. 200 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలోనే ఊదేశారు. సాయి సుదర్శన్ (108 నాటౌట్, 61 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ సెంచరీతో కదం తొక్కగా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (93 నాటౌట్, 53 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) అజేయ భారీ అర్థ సెంచరీతో చెలరేగాడు. ఆదివారం ఢిల్లీలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గిల్, సాయి సుదర్శన్ మెరుపులతో గుజరాత్ టైటాన్స్ 200 లక్ష్యాన్ని మరో ఆరు బంతులు ఉండగానే ముగించింది. 10 వికెట్ల తేడాతో ఏకపక్ష విజయం సాధించింది. పవర్‌ప్లేలో 59/0తో మెరిసిన ఓపెనర్లు.. ఆ తర్వాత అదే జోరు కొనసాగించారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ఎవరూ వికెట్ వేటలో సఫలం కాలేదు. 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 30 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన సాయి సుదర్శన్.. 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 56 బంతుల్లో సెంచరీ సాధించాడు. శుభ్‌మన్ గిల్ సైతం ఓ ఫోర్, నాలుగు సిక్సర్లతో 33 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. సెంచరీకి ఏడు పరుగుల దూరంలో నిలిచిన గిల్.. తొలి వికెట్‌కు సాయి సుదర్శన్‌తో కలిసి అజేయంగా 205 పరుగుల భాగస్వామ్యం నిర్మించాడు. గుజరాత్ టైటాన్స్‌కు 12 మ్యాచుల్లో ఇది ఎనిమిదో విజయం. ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న టైటాన్స్ టాప్-2లో చోటుపై కన్నేసి చివరి రెండు మ్యాచుల్లో బరిలోకి దిగనుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 199 పరుగులు చేసింది. ఓపెనర్ కెఎల్ రాహుల్ (112 నాటౌట్, 65 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ సెంచరీతో మెరిసినా.. ఆశించిన వేగంతో పరుగులు చేయలేదు. అభిషేక్ పోరెల్ (30), అక్షర్ పటేల్ (25), ట్రిస్టన్ స్టబ్స్ (21 నాటౌట్) రాణించినా.. ఢిల్లీ క్యాపిటల్స్ కాస్త తక్కువ స్కోరుకే పరిమితమైంది. టైటాన్స్ బౌలర్లలో అర్షద్ ఖాన్, ప్రసిద్ కృష్ణ, సాయి కిశోర్ తలా ఓ వికెట్ పడగొట్టారు.
ఓపెనర్లే ఊదేశారు
- Advertisement -
- Advertisement -