– చట్టం తన పని తాను చేసుకుపోతుంది
– కాంగ్రెస్ పార్టీ ఎవరినీ వేధించదు
– సమన్వయం కావాలి.. ప్రజల మన్ననలు పొందాలి : మహబూబాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ-మహబూబాబాద్
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా వ్యవహరించాలని, సిట్ విచారణలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని మహబూబాబాద్ పార్లమెంట్ మున్సిపాలిటీ ఎన్నికల ఇన్‌చార్జి, మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహాక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సకల జనులు తెలంగాణ కోసం ఉద్యమం చేశారని, నీళ్లు, నిధులు, నియామకాలు సాధించుకుని, నియంతృత్వానికి వ్యతిరేకంగా జీవించాలని తెలంగాణను సాధించుకున్నామని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించిందని అన్నారు. నాటి ప్రతిపక్ష పార్టీ నాయకుల ఫోన్లతో పాటు అధికారులు, సొంత పార్టీలోని ఎమ్మెల్యేలు, మంత్రులు, కుటుంబంలోని అల్లుడు, బిడ్డ, ఇతర ప్రముఖుల ఫోన్లనూ ట్యాపింగ్ చేశారని తెలిపారు. వీరంతా దేశద్రోహులు, ఉగ్రవాదులు, తీవ్రవాదులు, అసాంఘిక శక్తులా అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ చేసి విచారణకు హాజరు కాకుండా ఉండటం, అందుకు కాంగ్రెస్ పార్టీ వేధిస్తుందనేది శుద్ధతప్పని తెలిపారు. తెలంగాణలో అహంకార ప్రభుత్వం వద్దని ప్రజలు బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఓడించారని, దురహంకారానికి గుర్తుగా పార్లమెంట్ ఎన్నికల్లో గుండుసున్నా ఇచ్చారని గుర్తుచేశారు. సర్పంచ్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పినా వారి వంకర బుద్ధి మారడం లేదని ఆరోపించారు. సర్పంచ్ ఎన్నికల్లో తీర్పు ఇచ్చినట్టుగానే మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే తీర్పు ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లోని మున్సిపాల్టీల్లో నాయకులంతా సమన్వయం కావాలని, ప్రజల మన్ననలు పొందాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి అన్ని వార్డులను గెలుచుకోవాలని మంత్రి సూచించారు. ఆశావహులు చాలామంది ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ విధి విధానాల మేరకు బీఫాములను అందిస్తామన్నారు. సీపీఐతో కలిసి మున్సిపల్ ఎన్నికలకు పోవాలని, వారితో చర్చలు తుది దశకు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు డాక్టర్ భూక్య మురళినాయక్, కోరం కనకయ్య, డీసీసీ అధ్యక్షురాలు డాక్టర్ ఉమామురళినాయక్, మాజీ డీసీసీ అధ్యక్షులు జన్నారెడ్డి భరత్‌చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రతిపక్షం బాధ్యతగా వ్యవహరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



