గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్
నవతెలంగాణ – ములుగు
మేడారం మహా జాతర అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని గిరిజన సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ అన్నారు. బుధవారం హైదరాబాద్ సచివాలయంలో మేడారం మహాజాతర ఏర్పాట్లు, సివిల్ వర్క్స్ స్టేటస్, నాన్ సివిల్ వర్క్స్ యాక్షన్ ప్లాన్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్యసాచి ఘోష్ మాట్లాడుతూ.. మేడారం మహా జాతర నిర్వహణకు గిరిజన సంక్షేమ శాఖ రూ.150కోట్లు మంజూరు చేసిందని, అందులో రూ.90కోట్లు సివిల్ వర్క్స్‌కు, రూ.60కోట్లు నాన్ సివిల్ వర్క్స్‌కు కేటాయించారని తెలిపారు. మేడారం జాతర ఏర్పాట్లను మొత్తం 8 జోన్లు, 31 సెక్టార్లుగా విభజించినట్టు తెలిపారు. జోన్-3 జంపన్న వాగు ప్రాంతంగా నిర్ణయించారని, జాతర సమయంలో 10 నుంచి 12 వేల మంది పోలీసు సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారని అన్నారు. ప్రతి జోన్‌కు ఒక జోనల్ ఆఫీసర్‌ను నియమించనున్నట్టు చెప్పారు.
24 శాశ్వత టవర్స్, 20 సెల్-ఆన్-వీల్స్, 350 వైఫై పాయింట్లు ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. కోర్ రూట్లు, పార్కింగ్ ప్రదేశాలను గుర్తించారు. మొత్తం 49 పార్కింగ్ కోసం 1050 ఎకరాలు గుర్తించామని, దాంట్లో దాదాపు 4.5లక్షల నుంచి 6 లక్షల వాహనాలు నిలిపే సదుపాయం ఉందని తెలిపారు. ఈ ఏర్పాట్లు నవంబర్ 30నాటికి పూర్తవుతాయని తెలిపారు. అటవీశాఖ ఆధ్వర్యంలో ఫారెస్ట్ రోడ్లు అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. వీటిలో భాగంగా వైల్డ్ లైఫ్ శాంక్చువరీలోని రహదారులు కూడా చేర్చబడ్డా యన్నారు. ఆర్ అండ్ బీ శాఖ ద్వారా రూ.42కోట్లతో ఆలయం చుట్టూ రహదారులు, రూ.92కోట్లతో ప్రధాన రహదారులు నిర్మిస్తున్నట్టు చెప్పారు. కాగా, జంపన్నవాగు వద్ద తాత్కాలిక రహదారి కూలిపోయిన కారణంగా మరమ్మతు పనులు వేగంగా జరుగుతున్నా యని చెప్పారు. 517 బోరు పాయింట్లు, నీటి వనరులు, 250 కిలోమీటర్ల రహదారులపై లైటింగ్ పనులు జరుగుతున్నాయని అన్నారు.
స్థానికుల సహకారంతో 6 స్లాటర్ సెంటర్లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. జంపన్న వాగు పునరుద్ధరణ పనులు సాగు తున్నాయని తెలిపారు. 9,111 విద్యుత్ స్తంభాలు, 259 ట్రాన్స్‌ఫార్మర్లు అమర్చే పనులు విద్యుత్‌శాఖ చేపట్టింది. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి జాతర విజయవంతంగా జరిగేలా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ మహేష్ భగత్, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, ములుగు ఎస్పీ, ఐటీడీఏ పీఓ చిత్ర మిశ్రా, డీఎఫ్‌ఓ రాహూల్ కిషన్ జాదవ్, ఎలక్ట్రిసిటీ సీఎండీ వరుణ్ రెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రియాంక, ఇతర సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.