Thursday, February 26, 2026
E-PAPER
Homeజాతీయంప్రయివేటు వర్సిటీల పేటెంట్‌ మాయాజాలం

ప్రయివేటు వర్సిటీల పేటెంట్‌ మాయాజాలం

- Advertisement -

‘ఫైలింగ్స్‌’ ఎక్కువ.. ‘మంజూరు’ తక్కువ
ఐఐటీలను మించి దాఖలు
వాస్తవ ఆవిష్కరణలు శూన్యం
‘ర్యాంకింగ్స్‌’ కోసం ‘నెంబర్‌ గేమ్‌’
పట్టీపట్టనట్టే కేంద్రం వ్యవహారం విద్యావేత్తల ఆందోళన

న్యూఢిల్లీ : ఇండియా ఏఐ సమ్మిట్‌లో ఒక చైనా రోబోడాగ్‌ ప్రదర్శనపై వివాదం రేకెత్తడం, దానిపై సదరు యూనివర్సిటీ క్షమాపణలు చెప్పడం తెలిసిందే. ఈ తీగను పట్టుకొని ‘అసలేం జరుగుతుంది’ అని లాగితే ప్రయివేటు యూనివర్సిటీల ‘పేటెంట్‌’ మాయాజాలం బయటపడింది. ర్యాంకింగ్స్‌, ప్రత్యేక గుర్తింపు, ప్రచారం, అధిక ఫీజుల వసూళ్ల కోసం ప్రయివేటు యూనివర్సిటీలు తొక్కుతున్న అడ్డతోవలు వెలుగులోకి వచ్చాయి. 2022-23 మేధో సంపత్తి వార్షిక నివేదికలోనే ప్రయివేటు, డీమ్డ్‌-ప్రయివేటు యూనివర్సిటీల పేటెంట్‌ ర్యాంకింగ్స్‌లో ఆధిపత్యం గురించి వెల్లడైంది. ప్రయివేటు యూనివర్సిటీలు పెద్ద సంఖ్యలో పేటెంట్ల దాఖలుకు ప్రాధాన్యతనిస్తున్నాయి.

వాటిలో అతి తక్కువ శాతం మాత్రమే ‘మంజూరు’కు నోచుకుంటున్నాయి. ఈ మంజూరైన వాటిలోనూ మరింత తక్కువ మాత్రమే మార్కెట్‌లోకి వస్తున్నాయి. వాస్తవాలు ఇలా ఉంటే, ఈ పేటెంట్‌ల దాఖలు వెనుక అసలు కథను విద్యారంగ నిపుణులు బట్టబయలు చేశారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) ర్యాంకింగ్స్‌, నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడేషన్‌ కౌన్సిల్‌ (న్యాక్‌) ప్రమాణాలు, బ్రాండ్‌ విలువ పెంచుకోవడం, ఫ్యాకల్టీ ప్రమోషన్లు, అకడమిక్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఇండికేటర్‌ (ఏపీఐ) స్కోర్లు వంటి వాటిని ప్రధాన కారణాలుగా చూపుతున్నారు.

టాప్‌ 10లో ప్రయివేటు ఆధిపత్యం
‘టాప్‌ 10 ఇండియన్‌ అప్లికెంట్స్‌ ఫర్‌ పేటెంట్స్‌ ఫ్రమ్‌ అకడమిక్‌ ఇన్‌స్టిట్యూట్స్‌, యూనివర్సిటీస్‌’ ప్రకారం… ఈ జాబితాల్లో తొమ్మిది ప్రయివేటు లేదా డీమ్డ్‌-ప్రయివేటు ఇన్‌స్టిట్యూషన్సే ఉన్నాయి. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐటీలు సమిష్టిగా మూడో స్థానానికి పరిమితమయ్యాయి. కేవలం తామేదో అద్భుతాలు సృష్టిస్తున్నాం అని ప్రచారం చేసుకోవడానికే ఈ ఫైలింగ్స్‌ను సదరు ప్రయివేటు యూనివర్సిటీలు వినియోగించుకుంటున్నాయనేది విద్యావేత్తల అభిప్రాయం. యూనివర్సిటీల వారీగా ఫైలింగ్స్‌లో ఆమోదం పొందినవి ఎన్ని లెక్కలు తీస్తే, కొన్ని యూనివర్సిటీలు ఇప్పటికీ బోణీనే కొట్టలేదని వెల్లడవుతోంది. పేటెంట్‌ ఫైలింగ్‌ అయినంత మాత్రానే పేటెంట్‌ మంజూరు అయినట్టు కాదు. కానీ ఆ సంఖ్య, అంశాలను ప్రయివేటు యూనివర్సిటీలు వ్యాపారాభివృద్ధికి వాడేసుకుంటున్నాయి.

ఇదీ పేటెంట్‌ ప్రక్రియ
పేటెంట్‌ మంజూరు అనేది ఆవిష్కర్తకు ప్రత్యేక న్యాయపరమైన హక్కులను కల్పిస్తుంది. ఇతరులెవరైనా సదరు ఆవిష్కర్త అనుమతి లేకుండా వాటిని తయారు చేయడం, ఉపయోగించడం, అమ్మడాన్ని నిషేధిస్తుంది. పేటెంట్‌ దాఖలు నుంచి మంజూరు వరకు మొత్తం ప్రక్రియ వివిధ దశల్లో ఉంటుంది.

  1. ఆవిష్కరణ వివరాలతో పేటెంట్‌ దరఖాస్తు దాఖలు
  2. పేటెంట్‌ పబ్లికేషన్‌ (దాదాపు దాఖలైన అన్ని పేటెంట్లూ ప్రచురితమవుతాయి)
  3. ప్రచురితమైన పేటెంట్‌ ఎగ్జామినేషన్‌ కోసం అభ్యర్థన
  4. పేటెంట్‌ కార్యాలయం లేవనెత్తే అభ్యంతరాలు
  5. మీ వాదనలను సమర్థించుకోవడం
  6. స్క్రూటినీ (పరిశీలన)లో నెగ్గగలిగితే పేటెంట్‌ మంజూరు
  7. తరువాత పేటెంట్‌ కమర్షియలైజేషన్‌
    పైన పేర్కొన్న ఏ దశలో అయినా పేటెంట్‌ ప్రక్రియ ఆగిపోవచ్చు. పేటెంట్‌ దాఖలు (ఫైలింగ్‌) చేయడం సులభం. మంజూరు (గ్రాంటింగ్‌) పొందడమే కష్టం. ఈ ప్రక్రియ పూర్తికావడానికి 12 నుంచి 30 నెలల సమయం పడుతుంది.

    ది ఇంటలెక్చ్యువల్‌ ప్రాపర్టీ రిపోర్ట్‌ (2024-25) ప్రకారం
    -పేటెంట్ల దాఖలు – 1,10,375
    -పేటెంట్ల పరిశీలన – 15,526
    -పేటెంట్ల మంజూరు – 33,504

    ర్యాంకింగ్స్‌ కోసమే ఆరాటం
    నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌), న్యాక్‌లో పేటెంట్లకు ప్రాధాన్యం ఉంటుంది. ఎన్‌ఐఆర్‌ఎఫ్‌లో మంజూరైన పేటెంట్లకు ప్రచురితమైన వాటికంటే రెండింతల వెయిటేజీ ఉంటుంది. కానీ కమర్షియలై జేషన్‌ కు ప్రత్యేక వెయిటేజీ ఉండదు. దీంతో పేటెంట్‌ సంఖ్యల పెంపుదల ద్వారా ర్యాంకింగ్స్‌ మెరుగుపర్చుకోవాలన్న ఆరాటమే ప్రయివేటు విద్యా సంస్థల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ర్యాంకింగ్స్‌ పెరిగితే అడ్మిషన్లు పెరుగుతాయి. అందుకే పేటెంట్‌ సంఖ్యలు పెంచడం ఒక వ్యూహంగా మారిందనేది విద్యావేత్తల విశ్లేషణ. ర్యాంకింగ్‌ పెంచుకోవడంతో పాటు బ్రాండ్‌ బిల్డింగ్‌, ఫ్యాకల్టీ ఇన్సెంటివ్‌ కోసం ప్రయివేటు యూని వర్సిటీలు ఈ పేటెంట్లను ఉపయోగించుకుంటున్నాయి.

    వాస్తవాలెన్ని?
    వేల సంఖ్యలో దాఖలవుతున్న పేటెంట్లలో ఎన్ని వాస్తవమైనవి? ఎన్ని ఉద్యోగాలు సృష్టిస్తున్నాయి? సమస్య లను ఎన్ని పరిష్కరిస్తున్నాయి? అనే విద్యావేత్తల ప్రశ్నలకు సమాధానాలు లభించట్లేదు. సంఖ్య కంటే నాణ్యతకు ప్రాధాన్యం ఇచ్చే వరకూ ఈ తీరు ఇలాగే కొనసాగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ప్రయివేటు యూనివర్సిటీల పేటెంట్ల దాఖలు, వాటి నాణ్యత, వాస్తవ ప్రభావంపై కేంద్ర విద్యామంత్రిత్వశాఖ సవివర నివేదికను విడుదల చేయాలని కోరుతున్నారు.

లక్ష పేటెంట్‌ ఫైలింగ్స్‌
ఇంటలెక్చ్యువల్‌ ప్రాపర్టీ ఆఫ్‌ ఇండియా 2024-25 వార్షిక నివేదిక ప్రకారం దేశంలో తొలిసారిగా లక్షకు పైగా పేటెంట్‌ ఫైలింగ్స్‌ సంఖ్య దాటింది. 2023-24లో 92,168గా ఉన్న ఫైలింగ్స్‌, 2024-25లో 1,10,375కు పెరిగి 19.75 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఈ మొత్తం ఫైలింగ్స్‌లో 68,201 భారతీయులవి కాగా, విదేశీ అభ్యర్థులవి 42,174 ఉన్నాయి. మొత్తం ఫైలింగ్స్‌లో భారతీయ దరఖాస్తుదారులు గతేడాది 56 శాతంగా ఉంటే, ఈసారి 62 శాతానికి పెరిగింది. ఇవన్నీ ‘ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌’ విభాగంలో నమోదైనవే కావడం గమనార్హం. 2023-24లో భారతీయ విద్యా సంస్థల ఫైలింగ్స్‌ 23,306గా ఉంటే, 2024-25 నాటికి 37,681కి పెరిగింది. అంటే ఒక్క ఏడాదిలో 14,375 అప్లికేషన్లు పెరిగి, 61.7 శాతం వృద్ధిని నమోదు చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -