నిర్మల్ జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతం పెంబి మండలం. దశాబ్దాలుగా ఇక్కడి గిరిజన గూడాలు అభివృద్ధికి దూరంలో, పాలకుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యాలుగా నిలిచాయి. ప్రాథమిక హక్కుల కోసం కూడా పోరాడాల్సిన దుస్థితి నెలకొన్న తరుణంలో గతనెలలో సీపీఐ(ఎం) చేపట్టిన 75 కిలోమీటర్ల పాదయాత్ర ఈ ప్రాంతానికి ఊరటనిస్తోందని చెప్పక తప్పదు. ”పోరాడితేనే పరిష్కారం” అన్న నినాదంతో సాగిన ఈ యాత్ర, నేడు అధికార యంత్రాంగాన్ని కదిలించేలా చేసింది. యాపాగూడెం నుండి నిర్మల్ వరకు సాగిన ఈ పాదయాత్రలో నాయకులు ప్రతి గూడెం తిరుగుతూ ప్రజా సమస్యలను తలకెత్తుకున్నారు. తాగునీరు, వైద్యం, విద్యుత్ వంటి కనీస సౌకర్యాల కోసం అధికారులు చూపుతున్న ఉదాసీనతను జిల్లా కేంద్రం సాక్షిగా ఎండగట్టారు. ఈ పోరాట సెగ తాజాగా ప్రభుత్వ యంత్రాంగం లో చలనం తెచ్చి, వరుస విజయాలకు దారితీసింది. ఈ పాదయాత్ర ఫలితంగా తాజాగా మూడు ప్రధాన సమస్యలు పరిష్కార మార్గానికి రావడం ప్రజా పోరాటానికి దక్కిన గౌరవంగా భావించవచ్చు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రెగ్యులర్ డాక్టర్ లేక గిరిజనులు గాలిలో దీపాల్లా బతుకుతున్న దుస్థితిని పాదయాత్ర బృందం బలంగా వినిపించింది. దీంతో స్పందించిన ప్రభుత్వం, తాజాగా మెడికల్ ఆఫీసర్‌ను నియమించింది. రావిగూడ గ్రామంలో మూలన పడ్డ మిషన్ భగీరథ ట్యాంకును పాదయాత్ర తర్వాతే అధికారులు పట్టించుకున్నారు. నీటి సరఫరాను పునరుద్ధరించారు.
గిరిజన మహిళల నీటి కష్టాలు తీరడంతో ఆ గూడాల్లో కాస్త ఉపశమనం కలిగింది. రాముగూడలో కూడా ప్రజల దాహార్తిపై అధికారులను నిలదీయగా నూతనంగా బోర్వెల్ వేసి నీటి సమస్యను పరిష్కరించారు.ప్రస్తుత సమస్యలు పరిష్కారమయినా, ఇవి కేవలం ఆరంభం మాత్రమే. అడవి బిడ్డల సంపూర్ణ అభివృద్ధికి ఇంకా అనేక అడ్డంకులు ఉన్నాయి. ప్రధానంగా దోత్తి వాగు, కడం వాగులపై వంతెనలు లేక వర్షాకాలంలో పెంబి మండలం బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోతోంది. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనా, అటవీ శాఖ అనుమతుల పేరుతో గృహ నిర్మాణాలను అడ్డుకోవడం గిరిజనుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోంది. పట్టాలు పొందిన భూములకు రైతుబంధు వంటి పథకాలు, సత్తుగూడ గ్రామ పునరావాసం వంటి అంశాలు ఇంకా పరిష్కారానికి నోచుకోవాల్సి ఉంది. పెంబి మండల ఆదివాసీల పోరాటం నేటి తరానికి ఒక గొప్ప సందేశం ఇస్తోంది. సమస్యలున్నప్పుడు మౌనంగా భరించడం కంటే, వ్యవస్థను నిలదీసే చైతన్యం ముఖ్యమని నిరూపించింది. ఎర్రజెండా వెనుక ఐక్యమైన గిరిజనం సాధించిన ఈ విజయం, ప్రజాగళం నినదిస్తే ఫలితం రాకుండా ఉండదని చాటిచెప్పింది.
– రాజేందర్ దామెర



