ఎర్రజెండా అండతో పోరు సలిపిన సకల జనులు
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులే
నాడు స్వేచ్ఛ కోసమైతే.. నేడు హక్కుల కోసం పోరాడుదాం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అబ్బాస్ పిలుపు
నిజామాబాద్‌లో సెమినార్.. బైక్ ర్యాలీ
నవతెలంగాణ- నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
‘నాడు దొరల పాలనలో ఇంట్లో తినాలే.. దొరకాడ పని చేయాలే. అప్పుల చిట్టా అంటూ దొంగ లెక్కలు చూపుతూ తాతల నుంచి మనవళ్ల వరకు కొన్ని తరాలను వెట్టి చాకిరీ చేయించుకున్నారు. కులవృత్తుల వారు వారి పని చేసుకోకుండా దొరలు, పటేల్, పట్వారీల వద్ద పనులు చేయాల్సిందే. ఇంట్లో ఉన్న రోకలి బండతో సహా.. ప్రతి వస్తువుకు, పశువులకు పన్నులు కట్టాల్సిన పరిస్థితి. ఇలాంటి స్థితిలో స్వేచ్ఛ కోసం ఎర్రజెండా అండతో ప్రజలు పోరాటాల బాట పట్టారు. చిట్యాల ఐలమ్మ, దొడ్డి కొమరయ్యతో మొదలు సకల జనులు దొరలకు వ్యతిరేకంగా పోరాడారు. శాంతియుత నిరసనపై కాల్పులు చేపట్టడంతో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో రైతులు, ప్రజలు సాయుధులై దొరలను గడీల నుంచి తరమికొట్టారు. అందుకే సెప్టెంబర్ 17ను తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట దినంగా నిర్వహిస్తున్నాం’ అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అబ్బాస్ తెలిపారు. ఆదివారం నిజామాబాద్‌లోని సీపీఐ(ఎం) కార్యాలయంలో ‘తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వాస్తవాలు-వక్రీకరణ’ అనే అంశంపై సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేశ్‌బాబు అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. ముందుగా ఆ పార్టీ కార్యాలయం నుంచి నాందేవ్‌వాడ నుంచి హమాల్‌వాడీ బ్రిడ్జి, గాంధీ గంజ్, గాంధీ చౌక్ మీదుగా బస్టాండ్, రైల్వేస్టేషన్, ఎన్‌టీఆర్ చౌరస్తా నుంచి సుభాష్‌నగర్ మీదుగా పార్టీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. ర్యాలీ పొడవునా.. కార్యకర్తలు, నాయకులు నినాదాలతో హోరెత్తించారు.
ఈ సందర్భంగా అబ్బాస్ మాట్లాడుతూ.. దొర వద్ద వెట్టి చాకిరీ చేయడం ఇష్టం లేని చిట్యాల ఐలమ్మ తన నాలుగెకరాల్లో పంట సాగు చేసుకుంటే.. పండిన పంటను విసునూరు రామచంద్రారెడ్డి దొర తన గుండాలతో తీసుకెళ్లాడని తెలిపారు. దాంతో ఆమె సంఘం వారిని కలవగా.. వారు ఇచ్చిన ఎర్రజెండాను తన భూములో పెట్టుకొని పంట పండించిందని అన్నారు. దాన్ని సైతం తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన దొర గుండాలకు ఎదురుతిరిగిందని తెలిపారు. ఎర్రజెండా ఇచ్చిన ధైర్యం, అండ, విజ్ఞానంతో ఎదురుతిరిగింది. దొడ్డి కొమురయ్య సైతం వెట్టి నుంచి విముక్తి కల్పించాలని శాంతియుతంగా నిరసన చేపడితే.. కాల్పులు జరపడంతో పోరాటంలో తొలి అమరుడయ్యాడని తెలిపారు. ఇలా వెట్టి చాకిరి నుంచి ప్రజలకు విముక్తి కల్పించి.. దొరల ఆధీనంలో ఉన్న భూముల్లోంచి 10 లక్షల ఎకరాలు పేదలకు పంచిన చరిత్ర కమ్యూనిస్టులదని అన్నారు. సర్దార్ పటేల్ వచ్చి ఏం చేశాడని పండుగ చేసుకోవాలని ప్రశ్నించారు. భారత సైన్యం ప్రవేశంలో మూడు రోజుల్లోనే నిజాం లొంగిపోగా.. సైన్యాలు తిరిగి వెళ్లిపోకుండా మళ్లీ గ్రామాలకు దొరలతో కలిసి వచ్చి వారి గుండాలతో కమ్యూనిస్టులే లక్ష్యంగా కాల్పులు జరిపారని తెలిపారు.
ఈ పోరాటంలో 4 వేల మంది అమరులయ్యారని అన్నారు. కానీ నాటి పోరాటంతో ఎలాంటి సంబంధం లేని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్.. నేడు పోరాటంపై వక్రీకరణలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతాంగ పోరాటాన్ని హిందూ ముస్లిం పోరాటంగా చూపించాలని ప్రయత్నిస్తున్నారని.. హిందువులుగా ఉన్న దొరలకు వ్యతిరేకంగా ప్రజలంతా పోరాటం చేశారని, నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారిలో ముస్లింలు సైతం ఉన్నారని తెలిపారు. నాడు స్వేచ్ఛ కోసం పోరాడితే నేడు హక్కుల కోసం పోరాడాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. రాబోయే తరాల కోసం, హక్కుల కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో పోరాటాలు చేపడదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్, నూర్జహాన్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పల్లపు వెంకటేశ్, శంకర్‌గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, యేశాల గంగాధర్, కొండ గంగాధర్, విఘ్నేశ్ తదితరులు పాల్గొన్నారు.
శాంతియుత నిరసనలతో వినలే..సాయుధులై తిరగబడ్డ రైతాంగం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES