అనగనగా జడల చింత అనే ఊరిలో భద్రం, లక్ష్మీ అనే దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి లక్ష్మణ్, అమ్మాయి ప్రవళిక. లక్ష్మణ్‌కు ఐదు సంవత్సరాలు నిండగానే ప్రైవేటు బడికి పంపించారు. అమ్మాయికి అబ్బాయికి ఒక సంవత్సరం తేడా. ముందు అబ్బాయిని బడికి పంపించారు. అలా సంవత్సరం గడిచింది. లక్ష్మణ్ రెండో తరగతిలోకి వచ్చాడు. ప్రవళిక ఎంతో ఉత్సాహంగా తాను కూడా బడికి వెళ్ళవచ్చు అనుకుంది. కానీ ఆ అమ్మాయిని బడికి పంపియ్యలేదు. తనను ఎందుకు పంపించడం లేదో తెలుసుకుందామని ”అమ్మా! నాన్నా! నన్ను బడికి ఎందుకు పంపించడం లేదు? అని అడిగితే వాళ్ళ నాన్న ”మీ అన్నయ్యను పంపించడానికే అప్పు తెచ్చి ఫీజు కడుతున్నాం. నిన్ను పంపించడానికి డబ్బులు ఎక్కడివమ్మా?’ అన్నాడు.
అప్పుడు ప్రవళిక ”నన్ను గవర్నమెంట్ బడికి పెంపు నాన్నా! అక్కడ చదువుకుంటాను” అనగానే ”ఏ బడీ లేదు. నువ్వేదో బాగా చదువుతా అన్నట్లు బడికి వెళ్తాను అని అడుగుతున్నావు?” అని కోపంగా అన్నాడు. అప్పుడు అక్కడే ఉన్న వాళ్ళ అమ్మ ”ఇప్పటి నుంచే నువ్వు ఇంటిపని, వంటపని, కూలిపని మంచిగా నేర్చుకోవాలి” అంటుంది. తల్లి మాటలకు ఏడుస్తూ రోజూ ఇంట్లో అన్ని పనులు చేస్తూ తల్లితో కలిసి కూలిపనికి వెళ్ళి వస్తోంది. అలా సంవత్సరం గడిచింది. చదువుకోవాలనే ఆశతో మళ్ళీ అమ్మానాన్నలను బడికి పంపమని అడిగితే మళ్ళీ ”చదువు లేదు, గిదువు లేదు” అని కోపంగా తిడతారు. అలా మరో సంవత్సరం గడిచింది. మళ్ళీ అమ్మానాన్నలను బడికి పంపమని బతిమిలాడింది. అయితే ఒకరోజు బడికి ఒకరోజు కూలిపనికి వెళ్ళడానికి ఒప్పుకున్నారు ఎంతో సంతోషంగా అలా వెళ్ళడం మొదలుపెట్టింది.
బడిలో చకచకా ఒక సంవత్సరంలోనే అఆలు, గుణింతాలు, ఒత్తులు, పాఠాలు, లెక్కలు అన్నీ నేర్చుకుంది. బడిలో ఉపాధ్యాయులు ప్రవళిక తెలివి తేటలు చూసి 3వ తరగతిలో చేర్చారు.
అలా బడిలో చెప్పిన పాఠాలను వాళ్ళ అమ్మ నాన్న, అన్న నిద్రపోయిన తర్వాత చదువుకునేది. ఇలా 7వ తరగతిలోకి వచ్చింది. వాళ్ళ తరగతి ఉపాధ్యాయినికి ఒక సందేహం వచ్చింది.
ప్రవళిక ఒక రోజు వచ్చి ఒకరోజు ఎందుకు రావట్లేదో.. అదే విషయం ప్రవళికను పిలిచి అడుగుతాడు. అప్పుడు ప్రవళిక ”మా అమ్మ నాన్న బడికి వెళ్ళొద్దని అంటున్నారు సర్! అందుకే వాళ్ళని ఒప్పించి ఇలా ఒకరోజు బడికి, మరొక రోజు కూలిపనికి వెళ్తున్నాను” అని చెప్పింది. ఆ మాటలు విన్న ఉపాధ్యాయునికి చాలా బాధ కలిగింది. విషయం ఏమిటో తెలుసుకుందామని అనుకున్నాడు.
ప్రవళికకు తెలియకుండా వాళ్ళ ఇంటికి వెళతాడు. ఆ సమయంలో భద్రం ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు.
తాను వాళ్ళ ఊరి ప్రభుత్వ బడిలో పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడినని చెప్పి ” మీ అమ్మాయిని బడికి ఎందుకు పంపించడం లేదు?” అని ప్రశ్నించారు. అప్పుడు భద్రం ”ఆడపిల్లలు ఇంటిపనులకే అంకితం కావాలి. అదే అబ్బాయిలయితే మంచిగా చదువుకొని జాబ్ చేస్తారు. ఆడపిల్లకు చదువెందుకు?” అంటాడు. ఆ మాటలు విన్న ఉపాధ్యాయుడు ప్రవళికను ఎలాగైనా 10వ తరగతి పాస్ అయ్యేలా చేయాలని అనుకున్నారు. మరుసటి రోజు ప్రవళికను పిలిచి ”నువ్వు రోజూ బడికి రా! నువ్వు కూలిపని చేసినట్లు నేను నీకు ఆ డబ్బులు ఇస్తాను. కానీ నువ్వు రోజూ క్రమం తప్పకుండా బడికి రావాలి” అన్నారు. ఉపాధ్యాయుని మంచి మనసుకు దండం పెడుతూ ”అలాగే సర్!” అంటుంది. అలా రెండు సంవత్సరాలు గడిచాయి. ప్రవళిక అన్న లక్ష్మణ్ ఇంట్లో గారాబంతో బడికి సరిగా పోకుండా, అటూ ఇటూ తిరుగుతూ చదువుకోక పోవడంతో 10వ తరగతిలో ఫెయిల్ అయ్యాడు.
ప్రవళిక మాత్రం రోజూ బడికి వెళ్ళి వచ్చేది. ఇంటికి రాగానే పనులన్నీ పూర్తి చేసేది. అందరూ పడుకున్నంక చదువుకునేది. తాను, తమ ఉపాధ్యాయులు అనుకున్నట్లుగానే 10వ తరగతి మంచి మార్కులతో పాస్ అయ్యింది. బడిలో ఉపాధ్యాయులు ప్రవళిక పేరును పేపర్లో వేయించారు. అది చదివిన ఊర్లో వారందరూ భద్రం దగ్గరకు వెళ్ళి మీ అమ్మాయి 10వ తరగతి పాస్ అయినట్లు పేపర్లో పడింది. నువ్వు బడికే పంపలేదు కదా! అని ఆశ్చర్యంగా అడుగుతారు. భద్రం వెంటనే ఇంటికి వచ్చి ప్రవళికను అడగుతుండగా వాళ్ళ బడి ఉపాధ్యాయులు వచ్చారు. ”ఆ రోజు మీ అమ్మాయిని బడికి పంపమని అడిగితే ఆడపిల్లలు ఇంటికే పరిమితం, అంకితం కావాలని అన్నారు. కూలిపనికి పంపించారు.
అమ్మాయిలను ఇంటికి అంకితం చేయకూడదు. మగపిల్లలతో సమానంగా చదువుకునే హక్కు ఉంది. అందులోనూ ప్రవళిక చాలా తెలివైన అమ్మాయి. అటు కూలిపనికి, ఇటు బడికి వస్తూ చదువుకుంటుంటే రోజూ బడికి వచ్చేలా చేశారు మా ఉపాధ్యాయుడు. ఇప్పుడు మన ఊరికే గర్వకారణంగా చక్కగా మంచి మార్కులతో పాస్ అయ్యింది. కాబట్టి మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలను బడికి పంపించాలి. ఆడపిల్ల చదువు అవనికి వెలుగు. ఈ అమ్మాయిని ఎలాంటి ఆటంకాలు లేకుండా చదివిస్తే మంచి ఉద్యోగం చేసి మీకు, మాకు మన ఊరికే గొప్ప పేరు తీసుకొని వస్తుంది” అన్నారు. ఆ మాటలకు భద్రం, లక్ష్మి తమ తప్పు తెలుసుకున్నారు ప్రవళిక పట్టుదలతో చదువుకొని తాను అనుకున్నది సాధించింది.
నీతి:- ఆడపిల్లలను చదివిస్తే అనుకున్నది సాధిస్తారు.
కొట్టె మేఘన, 8వ తరగతి, జి.ప.ఉ.పా. పాపకొల్లు, జూలూరుపాడు, భద్రాద్రి కొత్త గూడెం.


