పలు గ్రామాలకు రాకపోకలు రద్దు..
వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన ఎమ్మెల్యే
నవతెలంగాణ – అచ్చంపేట
మొంథా తుపాన్ ప్రభావంతో కురుస్తున్న వారి వర్షాలకు నల్లమల్లలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నల్లమల్ల అటవీ ప్రాంతంలోని మారుమూల గ్రామాలలో వరదలు ఉప్పొంగిపొర్లుతున్నాయి. కుమ్మరోనిపల్లి బ్రిడ్జి వద్ద వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. లింగాల మండలం అంబటిపల్లి -ఆసలికుంట గ్రామాల మధ్య వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. వాగులో చిక్కుకున్న కారును స్థానికులు సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు.
మద్దిమడుగు తదితర గ్రామాలకు ఆర్టీసీ అధికారులు బస్సులు రద్దు చేశారు. అచ్చంపేట మండల పరిధిలోని చంద్రవాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. హైదరాబాదు శ్రీశైలం ప్రధాన రహదారి మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి బ్రిడ్జి మీదుగా వరదలేరు ప్రవహిస్తుంది. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చంద్ర వాగులో 10 బర్లు (గేదెలు) కొట్టుకుపోయాయి.
బ్రిడ్జి కూలిపోయే ప్రమాదం ఉందని స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మార్లపాడు తండాలో వరద ఉధృతికి తాండ ప్రజలు అవస్థలు పడుతున్నారు. పట్టణంలోని మధుర నగర్, ఆదర్శనగర్, రాజీవ్ నగర్ కాలనీలు వరద నీటితో నిండుకున్నాయి. మునిసిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు వరద ప్రభావిత కాలనీలలో పర్యటించారు. పరిస్థితిలను అడిగి తెలుసుకున్నారు.
వరద ప్రభావిత గ్రామాలను మండల పరిషత్ అధికారులు, స్థానిక పోలీస్ అధికారులు, ఉపాధి హామీ అధికారులు పరిశీలించారు. ఉమా మహేశ్వరం దేవాలయంలో కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. కొండపై నుంచి వరద నీరు ఉదృతంగా కిందికి ప్రవేశిస్తుంది.భక్తులు ఎవరు ఉమామహేశ్వర రావద్దని ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు సూచిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పర్యటించారు ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలకు వివరించారు.
కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు సహాయం అందించేందుకు జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇలాంటి ప్రమాదాలు విపత్తులు సంఘటనలు జరిగిన వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 08540-230201 సమాచారం ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. ప్రధానంగా మారుమూల గ్రామాలలో గర్భిణీ మహిళలగర్భిణీ మహిళల వైద్య ఆరోగ్యశాఖ అధికారుల పర్యవేక్షణ ఉండాలన్నారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా పంట నష్ట వివరాలను వ్యవసాయ అధికారులు సేకరించాలని కలెక్టర్ ఆదేశించారు.
భారీ వర్షాలకు ప్రజల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ సూచించారు. ప్రధాన రహదారుల పైకి వరదనీరు ఉదృతంగా రావడంతో పరుచోట్ల వాహనాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎక్కడైనా ప్రమాదం ఇబ్బందులు ఏర్పడితే సహాయం కోసం పోలీస్ శాఖ 100 కు ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. కురుస్తున్న వర్షాలకు గ్రామాలలో వాగులు, వంకలు ఉధృతంగా ఉప్పొంగిపొర్లుతున్నాయి. నల్లమల్ల ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ డిఎస్పి పల్లె శ్రీనివాసులు ప్రజలకు సూచించారు.




