కవిత్వం సమాజానికి దర్పణం. అది కేవలం సౌందర్యాత్మక ఆవిష్కరణ మాత్రమే కాదు, సామాజిక చైతన్యాన్ని రగిలించే అగ్నిశిఖ కూడా. ప్రముఖ కవి, వాగ్గేయకారుడు కన్నెగంటి వెంకటయ్య రచించిన ‘భుజంమీద భూమి’ కవితా సంకలనం దళితోద్యమ సిద్ధాంతానికి నిలువెత్తు నిదర్శనం. ఇది ఆధునిక దళితోద్యమ చైతన్య పతాకగా నిలుస్తుంది.
ఈ కవితా సంకలనం గత మూడు దశాబ్దాల సామాజిక పరిణామాల సాహిత్య చరిత్ర. ఈ ‘భుజం మీద భూమి’ ఆయన కవిత్వ సంపుటిగా వెలువరించిన తొలి రచన.
‘అనుభవాల సుతారి’ అనే కవితతో ప్రారంభమై, జీవితపు బాల్య, యవ్వన దశలను ”బొంగరంలా గిర్రున తిరిగి పోయింది” అని, ”గబ్బిలాయిలా తపస్సు చేసింది” అని శక్తివంతమైన ఉపమానాలతో వర్ణిస్తూ, విలువైన జీవితం ”సంతలో పిల్లాడిలా తప్పి పోయింది” అని కడు వాస్తవికంగా ఆవిష్కరిస్తుంది. ఈ వర్ణన మానవ జీవితపు క్షణికత్వాన్ని, సమయం వేగంగా జారిపోయే వైనాన్ని గుర్తుచేస్తుంది. అయినప్పటికీ, కవి నిరాశకు లోనుకాకుండా,
”పగిలిన మనసు పలకమీద/ బతుకు రాజ్యాంగాన్ని రాయడానికి/ చెదిరి పోతున్న ఆశలపునాదిపై/ సంతోషపు భవంతిని నిర్మించడానికి/ అనుభవాల సిమెంటును సిద్ధం చేస్తున్న” అని ఆశావాద దక్పథాన్ని, నిర్మాణ కాంక్షను ప్రగాఢంగా ప్రకటిస్తాడు. ఈ పంక్తులలో కవి జీవితాన్ని ఒక సజనాత్మక ప్రక్రియగా చూస్తూ, గత అనుభవాల నుండి పాఠాలు నేర్చుకొని భవిష్యత్తును దఢంగా నిర్మించుకోవాలనే ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తాడు. ఇది దళిత సమాజం ఎదుర్కొన్న అసంఖ్యాకమైన అడ్డంకులు, వేదనల నేపథ్యంలో ఆత్మస్థైర్యాన్ని, పునర్నిర్మాణ సంకల్పాన్ని ప్రోత్సహించే ఒక తాత్విక దక్పథాన్ని సూచిస్తుంది, దళితులు తమ చరిత్ర నుండి శక్తిని పొంది, మెరుగైన భవిష్యత్తును నిర్మించుకోవాలనే ఆకాంక్షను రేకెత్తిస్తుంది.
‘కాకీ నానుడి రుజువు చేసుకో’ అనే కవితలో జాషువా గబ్బిలాన్ని దళితుడికి ప్రతీకగా స్వీకరించినట్టు ఈ కవి కాకిని తీసుకున్నాడు. ఈ స్వీకరణ కవి ఔచిత్య నిర్వహణకు ప్రబలమైన నిదర్శనం.
”నలుపు బూడిద రంగుతో/ నిగారించే నా ప్రియమైన కాకీ!/ భయం భయంగా బతికే నిన్ను చూస్తుంటే/ మా మా’నవ’ సమాజంలో దళితుడు గుర్తొస్తాడు” అని కాకిని సమాజం ఎన్ని రకాలుగా ఈసడించుకుంటుందో అలాగే దళితుడినీ అమానవీయంగా చూస్తుంటుందని ఉపమాన ప్రాయంగా ప్రస్తావిస్తాడు.
”నీ తిండి నీకు దక్కకుండా చేసే/ గద్ద పెద్దలు నిన్ను వెంటాడు తుంటారు” అని వర్తమాన సమాజపు వాస్తవికతను ఆర్ధ్ర హదయంతో అభివ్యక్తి చేస్తాడు.
”అక్షర జ్ఞానం లేని/ నా జాతి మూతికి ఉమ్మి ముంతల్ని/ మొలకు చీపుర్లు వేలాడ కట్టి/ వీధికి విధి వంచితుణ్ణి చేసిందీ కులమే” అంటూ తరతరాల దళితజీవన వ్యథలకు కారణమైన కులవ్యవస్థను తూర్పారబట్టాడు.
‘నువ్వు బతకాలి! బతికించాలి!!’ అనే కవితలో రైతు పడుతున్న కష్టాలను, అప్పుల ఊబిలో కూరుకుపోతున్న వైనాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించడం పేదరికం పట్ల కవికి ఉన్న లోతైన సానుభూతికి నిదర్శనం.
”జాతి జీవగర్రా! ఓ నా రైతన్నా!!/ ”అప్పుల నిప్పులవాగులో బుగ్గై పోతున్నావా..!?” అని ప్రశ్నిస్తాడు. కరువు ఎడారిలో బతుకు తడి ఆరిపోకుండా/ దేహపు ఓయాసిస్సునుండి/ వెచ్చటి నెత్తుటిని వడకట్టి/ సుజల ధారల కాలువలతో ముద్దులు పెట్టి/ మొక్కబిడ్డల్నీ అక్కునచేర్చుకున్న అన్నదాత! చీడపీడల దాడిలో గాయపడి/ పంట కళ్ళంలో కయిలు చేయకుండానే/ పురుగు మందుల పెరుగుబువ్వ తిని/కాలసర్పాల వైకుంఠపాళిలో/ కొనవూపిరితో కొట్లాడుతున్నావా..!?” అని ప్రశ్నిస్తాడు.
ఈ వర్ణన కేవలం రైతు సమస్య మాత్రమే కాదు, దళిత జీవితాలలో అంతర్లీనంగా ఉన్న ఆర్థిక, సామాజిక అభద్రతలను, శ్రమదోపిడీని, వ్యవస్థీకత నిర్లక్ష్యాన్ని సూచిస్తుంది. ఈ కవిత గ్రామీణ సమాజంలోని అణగారిన వర్గాల బాధలను, వారి శ్రమకు దక్కని గుర్తింపును, నిస్సహాయతను, అప్పుల ఊబిలో కూరుకుపోతున్న వైనాన్ని ప్రతిబింబిస్తుంది.
కన్నెగంటి శైలి సరళంగా, సూటిగా ఉంటూ, సామాన్య ప్రజలకు కూడా చేరువయ్యేలా ఉంటుంది. సంక్లిష్టమైన భావాలను కూడా సులభంగా అర్థమయ్యేలా చెప్పడం ఆయన ప్రత్యేకత. అలంకార ప్రయోగాలు, భావచిత్రాలు ఆయన కవిత్వానికి జీవం పోశాయి. ఉపమానాలు, రూపకాలు, సామెతలు, జాతీయాలు ఆయన కవిత్వానికి మరింత పదును పెట్టి, భావవ్యక్తీకరణను సుసంపన్నం చేశాయి. బాల్యం, యవ్వనం, జీవితం వంటి కీలక దశలను వర్ణించడానికి ”బొంగరంలా,” ”గబ్బిలాయిలా,” ”సంతలో పిల్లాడిలా” వంటి లోకవ్యవహారిక ఉపమానాలను ఉపయోగించడం కవిత్వానికి పఠనీయతను చేకూర్చింది.
ఉద్యమ చైతన్యంలో అంతర్గతంగా సమానత్వం, అణచివేత వ్యతిరేకత ఉండటం వల్ల, కన్నెగంటి కవిత్వం కేవలం సంప్రదాయ శైలికి కట్టుబడి ఉండకుండా, ప్రయోగశీలతను చాటుకుంది. ఆధునిక పోకడలను, పదజాలాన్ని కవిత్వంలోకి తీసుకురావడం కన్నెగంటి నవ్యాభివ్యక్తికి నిదర్శనం.
‘నిట్టూర్పు ఎలినినో’ అనే కవితలో ”ఉదగ్ర నిద్రా సముద్రంలో/ చెదిరి చిద్రమవుతున్న స్వప్నపుకెరటాల ఘోషలు/ భావాల అగ్ని పర్వతాల విస్ఫోటనం వల్ల/ ఉద్వేగ సునామీలై ఎగసిపడుతూ/ వినీల నేత్రపునింగిని పెటేల్మని తాకాయి/ ఉలిక్కిపడి మేల్కొన్నాను” అని గతంలోని బాధలను, అనుభవాలను వివరిస్తారు.
”దైనందిన కర్తవ్యాల గండ శిలలను మోస్తూ/ నిజ జీవితపు నిట్టూర్పు ఎలినినో సెగలమధ్య/ హిమాలయమై కరిగిపోతూ/ అనుభవాల జలపాతాలు స్రవిస్తూ/ కుటుంబదేశానికి పెట్టనికోటలా నిలబడివున్నాను” అని వర్తమానంలో ప్రజల కష్టాలను, బాధ్యతలను వివరిస్తాడు.
కవి కన్నెగంటి కవిత్వంలో ఒక అంతర్గత లయ, శబ్ద మాధుర్యం కూడా ఉండి పాఠకునికి ఆసక్తిని, అనురక్తిని కలిగిస్తుంది. ఈ విధమైన రచనా శైలి చదవడానికి సులువుగా ఉండటమే కాకుండా, భావ వ్యక్తీకరణకు మరింత బలాన్ని చేకూరుస్తుంది.
‘పలుకరించే నాల్కలన్నీ/ ప్రేమ పందిళ్లు కాలేవు/ కలిపే చేతులన్నీ/ అనురాగపులతలయి అల్లుకోలేవు’
వంటి పంక్తులలోని శబ్దాలంకారాలు, లయాత్మకత కవిత్వానికి మరింత ఆకర్షణను ఇస్తాయి, జీవితంలోని సంబంధాల సంక్లిష్టతను సూచిస్తాయి. కవి సంభాషణకు దగ్గరైన భాషను ఉపయోగించడం ద్వారా కవిత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేస్తాడు. ఈ ప్రయోగశీలత దళిత సాహిత్యానికి కొత్త దిశను నిర్దేశిస్తుంది.
కవి కన్నెగంటి వెంకటయ్య కవిత్వంలో లోతైన తాత్త్విక దక్పథం అంతర్లీనంగా ప్రవహిస్తుంది. అది కేవలం సమస్యలను ఎత్తి చూపడం మాత్రమే కాదు, వాటికి పరిష్కారాలను సూచించడం, జీవితం పట్ల ఒక సానుకూల దక్పథాన్ని అందించడం. జీవితంలోని కష్టాలను గుర్తించినప్పటికీ, కవి ఆశావాదాన్ని వదులుకోడు.
”రెండు చెకుముఖి రాళ్ళతో/ నిప్పును పుట్టించిన వాడి వారసుణ్ణి నేను/ ఇన్ని అక్షరాలతో బొబ్బలు పెట్టించలేనా…”
అని తన అక్షరాలను ఆయుధంగా మలిచి సామాజిక మార్పు కోసం పోరాడతానని ప్రకటిస్తారు. ఈ వాదన కవి తన కలం ద్వారా అగ్నిని రగిలించి, అణగారిన వర్గాలలో చైతన్యాన్ని తీసుకురాగలననే ధీమాను, కవిత్వ సామాజిక కర్తవ్యాన్ని స్పష్టం చేస్తుంది. కవి తనను తాను కేవలం ఒక కవిగా కాకుండా, సామాజిక మార్పుకు కారకుడిగా, స్ఫూర్తిదాతగా భావిస్తాడు.
ఈ కవిత్వం కేవలం భావోద్వేగాల వ్యక్తీకరణ కాకుండా, సామాజిక న్యాయం కోసం ఒక తాత్త్విక ప్రస్థానంగా సాగిపోయింది.
‘భుజంమీద భూమి’ దళిత సాహిత్యంలో ఒక కీలకమైన రచనగా, సామాజిక చైతన్యానికి ఒక పతాకగా నిస్సందేహంగా నిలుస్తుంది, సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడవలసిన అవసరాన్ని గుర్తుచేస్తుంది. కవి సమాజానికి ఒక ఆశాకిరణంగా నిలబడి, అణగారిన వర్గాలకు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తాడు, తద్వారా వారు తమ హక్కుల కోసం పోరాడి గౌరవంగా జీవించడానికి ప్రేరణనిస్తాడు.
– డా.పోతగాని సత్యనారాయణ 919182531202
ఆధునిక దళితోద్యమ చైతన్య కవిత ‘భుజం మీద భూమి’
- Advertisement -
- Advertisement -