Friday, February 27, 2026
E-PAPER
Homeఎడిట్ పేజివసుధైక కుటుంబంలో విద్వేషపు విషబీజాలు

వసుధైక కుటుంబంలో విద్వేషపు విషబీజాలు

- Advertisement -

కొత్త సంవత్సరం ప్రవేశించి పట్టుమని రెండునెలలు కూడా కాలేదు. ప్రజల జీవితాల్లో నూతనత్వం ఏదీ లేకపోగా మానవత్వం మంటగలుస్తున్న ఘటనలు కోకొల్లలు. ఇవి యాదృచ్ఛికమా లేక ఒక పథకం ప్రకారం జరుగుతున్నాయా? అనేది నిజంగా అధ్యయనం చేయవలసిన విషయాలు. సంఘటనలన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలలోనే, ఇంకా బీజేపీ అనుబంధ సంస్థల వల్ల జరగడం బట్టి ఇవి ప్రేరేపిత చర్యలుగానే భావించవలసి వస్తున్నది. కానీ, ఇది దేశ సమగ్రతను ఇంత కాలంగా దేశంలో అంతర్లీనంగా ఉన్న ఏకత్వ భావనను దెబ్బ తీస్తున్నది. ఒకరకంగా సమాజం విచ్ఛిన్నం జరుగుతున్నట్టుగా కనిపిస్త్తున్నది.

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో కొన్ని దశాబ్దాలుగా స్కూలు విద్యార్థుల యూనిఫార్మ్స్‌ అమ్ముకుంటున్న ఒక డెబ్బయేళ్ల అహ్మద్‌ అనే వ్యక్తి నడుపుతున్న దుకాణం పేరు బాబా క్లాత్‌స్టోర్స్‌. యావత్తు దేశం గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఉన్న సమయాన ఒక మూక ఆ దుకాణంపై దాడిచేసి ఆ పేరు మార్చాలని బెదిరించింది. బాబా అనే పేరు ముస్లిములు వాడకూడదని వారి వాదన. నిస్సహాయంగా ఉన్న ఆ వ్యక్తికి ఎదురుగా జిమ్‌ నడుపుతున్న దీపక్‌ అనే వ్యక్తి ఆ మూకను అడ్డగించి దుకాణదారుడుకి అండగా నిలిచాడు. తెలంగాణలో జరిగిన ఆదివాసి పండుగ మేడారం సమ్మక్క సారక్క జాతరలో కర్నూల్‌ జిల్లా వెలుగొండ నుండి వచ్చిన వ్యాపారి ఒకరు కోవా బన్లను అమ్ముతున్నాడు. ఒక యూట్యూబర్‌ వచ్చి ఎక్స్పైరీ డేట్‌ ఉందా అని, అది ఎలా తయారు చేస్తారని, ఎంత గిట్టుబాటు అవుతుందని అడిగాడు. అంతటితో ఊరుకోకుండా అది తింటే పిల్లలు పుట్టరని దుష్ప్రచారం కూడా చేశారు.

కోవా బన్‌ అమ్ముకునే వలీ దాన్ని వారి కళ్లముందే తిన్నాడు. ఒక చిరు వ్యాపారిపై ఒక యూట్యూబ్‌ ఛానల్‌ వివక్షతో చేసిన విషప్రచారంతో అతడి పొట్టకొట్టింది. జాతర మొదట్లోనే తిరుగుముఖం పట్టిన వలీకి బయట సమాజం నుంచి ఎంతో మద్దతు లభించింది. హిందూ జాతరలో ముస్లిములు స్టాల్‌ పెట్టుకోరా? పెట్టుకోకూడదా? ఇక్కడ ఉదయించే ప్రశ్న. జనవరి 4న ఒడిశా రాష్ట్రం కాంథమాల్‌ జిల్లా పజ్రంగ్‌ గ్రామంలో జరిగిన సంఘటన మన లౌకికవాదానికి మచ్చ తెచ్చేది. మనలోని మానవత్వాన్ని ప్రశ్నించేది. ఆ గ్రామంలో పాస్టర్‌గా పనిచేస్తున్న బిపిన్‌ బిహారి నాయక్‌పై ఇరవై మంది దుండగులు దాడి చేశారు. కాళ్లతో తన్ని ముఖంపై సింధూరం పూశారు. హిందువులను క్రిస్టియన్లుగా మతమార్పిడులు చేస్తున్నాడన్న ఆరోపణపై ప్రార్థన చేస్తున్న అతడిని బయటికి లాగి మెడలో చెప్పులు దండవేసి ఆ గ్రామవీధుల్లో తిప్పారు. చివరికి అతనితో జుగుప్స కలిగించే రీతిలో ఆవు పేడ తినిపించి ఆ పేడ కలిపిన నీరు తాగించడం ఆమానుషత్వానికి పరాకాష్ట.

స్థానిక పోలీసులు మొదట కనీసం ఫిర్యాదు కూడా స్వీకరించలేదు. అతడిచేత అద్దె ఇల్లు కూడా ఖాళీ చేయించారు. అతనితో జై శ్రీరామ్‌ అని బలవంతంగా అనిపించారు. ఒక వ్యక్తి ఆత్మ గౌరవానికి విశ్వాసాలకు విరుద్ధంగా అతని రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ దాడులకు పాల్పడడం అనైతికం. ఒడిశా నేడు బీజేపీ పాలనలో ఉండడం గమనార్హం. ఇక డిసెంబర్‌ మాసంలోనే ప్రాచుర్యంలోనికి వచ్చిన అశ్వమిత్‌ గౌతమ్‌ ప్రశ్న అక్కడి పాలకులను నిద్ర పట్టకుండా చేసింది. 14 ఏళ్ల పిల్లవాడు డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ రచనలతోనూ, భగత్‌ సింగ్‌ వంటి దేశభక్తుల జీవిత చరిత్రను చదివి ప్రేరణ పొంది తన చుట్టూ ఉన్న సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ రీల్స్‌ తయారుచేసి విడుదల చేశాడు. సామాజిక అసమానతలను అక్రమాలను వేలెత్తి చూపించాడు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో కుర్రవాడు ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన రీల్స్‌ ప్రపంచవ్యాప్తంగా వైరల్‌ అయ్యాయి. లక్షలాది మంది అతనికి అభిమానులు లేదా ఫాలోవర్స్‌ అయ్యారు.

అతడి పాలిట అదే శాపంగా పరిణమించింది. అంత పెద్ద రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఒక పిల్లవాడు వేస్తున్న ప్రశ్నలకు ఓడిపోయింది. అతడి వయస్సు అరెస్టుకు సరిపోక అతడి అన్నను అరెస్టు చేసింది. ప్రశ్నించడాన్ని తట్టుకోలేని యోగి ప్రభుత్వం జవాబు చెప్పలేక తప్పులు సరిదిద్దుకోలేక సతమతమైపోయింది. అతనిపై ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేయడం సభ్య సమాజం మూకుమ్మడిగా ఖండించింది. డిసెంబర్‌ 9న 24 ఏళ్ల ఏంజెల్‌ చెక్మా అనే త్రిపురకు చెందిన ఎంబీఏ విద్యార్థి ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో తన సోదరుడితో పాటుగా షాపింగ్‌ చేస్తుండగా కొందరు అగంతకులు అతనిపై కత్తులతో ఇనుపరాడ్లతో దాడి చేశారు. తీవ్రమైన గాయాలతో 16 రోజుల పాటు ఆస్పత్రిలో పోరాడి చివరకు మృత్యువుకు లొంగిపోయాడు. చనిపోయే ముందు అతడి చివరి మాటలు ‘నేను చైనీయుడను కాను, భారతీయుడనుడిని’ అని పదే పదే పలువరించాడని తెలిసింది.

అతడి రూపురేఖలను బట్టి వేషభాషలు బట్టి అతడిని చైనీయుడిగా భావించిన మూక అతనిపై దాడికి దిగింది. ఒకపక్క చైనాతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నామన్న భారతదేశం విదేశీ విధానానికి విరుద్ధంగా బీజేపీ పాలిత రాష్ట్రంలో చైనీయుడని భావించిన ఒక విద్యార్థిపై అనాగరికంగా అమానుషంగా దాడి జరిగింది. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని సగౌరవంగా చెప్పుకుంటున్నాం. కుల, మత, భాష, ఆహారం, ప్రాంతీయ భేదాల కతీతంగా అందరూ భారతీయులనే ఒక సూత్రం ప్రజల మనసుల్లో ఇంతకాలంగా ఉంది. వివక్ష, విద్వేషాలకు అతీతమైన జాతి ఇది. కేవలం రాజకీయ లబ్ధి కోసమో, లేక తాత్కాలిక ప్రయోజనాల కోసం కొన్ని శక్తులు ఈ విధమైన విద్వేష బీజాలు నాటితే అవి విషవృక్షాలుగా వృద్ధి చెందే ప్రమాదం ఉంది. అవి దేశ సమగ్రతకు సమైక్యతకు భంగం కలిగించే విషయాలు. వాటిని మొగ్గ దశలోనే తుంచి వేయాలి.

ప్రతి పౌరుడు నిత్యం తమ గుర్తింపు కార్డులు మెడలో వేసుకుని తిరగాలా? రంగురూపు చూసి వ్యక్తులను గుర్తిస్తే అది సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకోవాల్సిన పరిస్థితిగానే భావించాలి. పరమత సహనం క్రమంగా క్షీణిస్తున్నది. సాటి మానవుడిని మతం పేరుతోనో ప్రాంతం పేరుతోనూ ద్వేషిస్తే అది ఆరోగ్య సమాజానికి ప్రమాదకరం. అడగడం అపరాధం, ప్రశ్నించడం పాపం, నిలదీయడం నేరమైతే అది ప్రజాస్వామ్య వ్యవస్థకు చేటు. మతసామరస్యం లోపిస్తే అది భారత లౌకిక సూత్రానికి భంగం కలిగిస్తున్నట్లే. ఒకపక్క శాస్త్ర సాంకేతిక రంగాల్లో అగ్ర రాజ్యాలతో పోటీ పడుతున్నామని చాలా ఘనంగా, గర్వంగా చెప్పుకుంటూ మరోపక్క అశాస్త్రీయ అమానుష చర్యలతో మన అజ్ఞానాన్ని చాటుకుంటున్నాం. ఎవరి మతాన్నివారు గౌరవించుకోవడం తప్పుకాదు. కానీ, ఎదుటివారి మతాన్ని ద్వేషించడం లేదా ఎదుటివారు కూడా మన మతాన్ని గౌరవించాలని కోరుకుంటూ దౌర్జన్యానికి, మతమార్పిడులకు పాల్పడితే అది సమాజం అంగీకరించదు.

మతవాదం కంటే మానవతావాదం గొప్పదని మహమ్మద్‌ దీపక్‌ నిరూపించాడు. రూపురేఖలతో జాతిని నిర్ణయించవద్దని ఏంజెల్‌ చెక్మా ఉదంతం తెలుపుతుంది. మతవిద్వేషాలు మానవత్వాన్ని మంట కలిపాయని వలీ, బిపిన్‌ నాయక్‌ సంఘటనలు బోధిస్తున్నాయి. ప్రశ్నిస్తే ప్రమాదమని అశ్వమిత్‌ గౌతమ్‌ అరెస్టు ఒక ఉదాహరణ. ఇవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతున్నాయని అనిపించడం లేదు. ఒక పథకం ప్రకారమే కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నాయనేది నిరూపణ అవుతున్నది. కానీ, ఈ ఘటనలు దేశ సమైక్యతకు మాయని మచ్చలుగా మిగిలిపోతాయి. ఎవరికీ అచ్చేదిన్‌? వికసిత్‌ భారత్‌ ఎలా సాధ్యం? ఈ గమ్యం ఎటు? ఏ వెలుగులకీ ప్రస్థానం? ‘కనిపించని మాధవుడిని కానుకలతో కొలుస్తాడు; కనిపించే మానవుడిని కాలరాయదలుస్తాడు’ అన్న మహాకవి శ్రీశ్రీ మాటలు మన దేశంలో అక్షర సత్యాలు.

శ్రీశ్రీ కుమార్‌ 9440354092

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -