Tuesday, April 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసమ్మెతోనైనా పోర్టర్‌ యాజమాన్యం బుద్ధి తెచ్చుకోవాలి

సమ్మెతోనైనా పోర్టర్‌ యాజమాన్యం బుద్ధి తెచ్చుకోవాలి

- Advertisement -

డ్రైవర్‌ పార్టనర్ల సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌-సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌
ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌, లేబర్‌ కమిషనర్‌ ఆఫీస్‌ వద్ద నిరసన
లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ స్టేట్‌ హెడ్‌కు వినతి

నవతెలంగాణ-సిటీబ్యూరో
పోర్టర్‌ డ్రైవర్‌ పార్టనర్లు చేపట్టిన ఒక్క రోజు సమ్మె తర్వాతనైనా యాజమాన్యం కండ్లు తెరవాలని, సమస్యలను పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలను ఉధృతం చేస్తామని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి, ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.శ్రీకాంత్‌ హెచ్చరించారు. సోమవారం ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌, లేబర్‌ కమిషనర్‌ కార్యాలయం వద్ద పోర్టర్‌ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పోర్టర్‌ కమిటీ జనరల్‌ సెక్రెటరీ సాజిద్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ మాట్లాడుతూ.. డ్రైవర్ల పార్టనర్ల శ్రమతోనే పోర్టర్‌ సంస్థ అభివృద్ధి చెందిందనే విషయాన్ని యాజమాన్యం గుర్తించాలన్నారు. పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు అనుగు ణంగా కిరాయి రేట్లను పెంచాలన్నారు. సంస్థ కమీషన్‌ను 5-8శాతం తగ్గించుకుని, డ్రైవర్ల సంక్షేమానికి కృషి చేయాలని డిమాండ్‌ చేశారు.

అలాగే డ్రైవర్‌ పార్టనర్ల రూ.5 లక్షల ప్రమాద బీమా, రూ.5లక్షల జీవిత బీమా కల్పించాలని, అక్రమ సస్పెన్షన్లు, వేధింపులు వెంటనే ఆపాలని కోరారు. ప్రభుత్వం గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫాం వర్కర్స్‌ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని, యాజమాన్యంతో చర్చలు జరిపించేలా లేబర్‌ కమిషనర్‌ చొరవ చూపాలని కోరారు. సీఐటీయూ నగర కార్యదర్శి కుమార్‌ మాట్లాడుతూ.. న్యాయమైన సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగించాలని, పోరాటమే యాజమాన్యం మెడలు వంచే ఏకైక మార్గమని అన్నారు. ధర్నా అనంతరం లేబర్‌ డిపార్టుమెంట్‌ స్టేట్‌ హెడ్‌ నీలమ్మకు వినతిపత్రం అందజేశారు. సమస్యల పరిష్కారం కోసం యాజమాన్యంతో చర్చలు జరిపించేందుకు కృషి చేస్తామని డీసీఎల్‌ అధికారులు శ్రీనివాస్‌గౌడ్‌, జాసన్‌ హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌ స్టేట్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.అజయ్ బాబు, సీఐటీయూ నగర అధ్యక్షులు ఎం.దశరథ్‌, రంగారెడ్డి జిల్లా సీఐటీయూ అధ్యక్షులు జె.రుద్రకుమార్‌, ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌ నగర కార్యదర్శి బి.ఉమేష్‌ రెడ్డి, నగర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎండీ కలీం, ఉపాధ్యక్షులు ముఖేష్‌ శర్మ, పోర్టర్‌ కమిటీ వైస్‌ ప్రెసిడెంట్‌ బి.మహేష్‌, ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌ కమిటీ నాయకులు విష్ణు, రవి, అర్బాజ్‌ ఖాన్‌, ఇందియాజ్‌, పోర్టర్‌ కమిటీ సభ్యులు తుకారాం, దేవా, సతీష్‌, నరేష్‌, హరిదాసు, నాగరాజు, రామాంజనేయులు, రాజు, గౌడ్‌, యు.రవికుమార్‌, మంజునాథ్‌, ప్రవీణ్‌, శివ, పోర్టర్‌ కమిటీ సభ్యులు, డ్రైవర్‌ పార్టనర్స్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -