నేడు రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మంది డ్రైవర్ పార్టనర్ల సమ్మె
సంస్థ దోపిడీపై భగ్గుమంటున్న వైనం
16 డిమాండ్ల పరిష్కారం కోసం పోరాటం
నవతెలంగాణ-సిటీబ్యూరో
‘డ్రైవర్ పార్టనర్’ అనే ముసుగులో పోర్టర్ యాజమాన్యం తమను కార్పొరేట్ బానిసలుగా మార్చేసిందని, కష్టానికి తగ్గ ప్రతిఫలం లేక, కనీస భద్రత కరువై రోడ్డున పడ్డామని డ్రైవర్ పార్టనర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా రాష్ట్రవ్యా ప్తంగా పోర్టర్ యాప్ ద్వారా సేవలందిస్తున్న దాదాపు 30 వేల మంది డ్రైవర్లు(సర్వీస్ పార్ట్‌నర్) తీవ్ర ఇబ్బం దులను ఎదుర్కొంటున్నారు. యాజమాన్యం అనుసరి స్తున్న ఏకపక్ష విధానాలు, అన్యాయమైన నిబంధ నలకు వ్యతిరేకంగా ‘ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్’ (ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్- సీఐటీయూ) ఆధ్వర్యంలో డ్రైవర్ పార్టనర్స్ ఆందోళనకు సిద్ధమయ్యారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నేడు రాష్ట్రవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు.
డ్రైవర్ పార్టనర్ల పొట్ట కొడుతున్నారు..
కస్టమర్లను ఆకర్షించే పేరుతో గతంలో ఉన్న రేట్ల కంటే ఇప్పుడు దారుణంగా రేట్లు తగ్గించేశారు. ఉదాహరణకు, గతంలో రూ. 1350 ఉన్న టారిఫ్‌ను ఇప్పుడు రూ. 650కి తగ్గించేశారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనం నడపడమే కష్టంగా మారితే, యాజమాన్యం మాత్రం 12 నుంచి 19 శాతం వరకు కమీషన్లు గుంజుకుంటూ డ్రైవర్ పార్టనర్ల శ్రమను దోచుకుంటూ.. తమ పొట్టకొడుతున్నారని వాపోతున్నారు.
యాజమాన్యం బాధ్యతారాహిత్యం
ప్రమాదాలు జరిగినప్పుడు లేదా కస్టమర్లతో సమస్యలు తలెత్తినప్పుడు యాజమాన్యం పట్టించుకోవడం లేదు. ‘మోటార్ వెహికల్స్ అగ్రిగేటర్స్ గైడ్‌లైన్స్ యాక్ట్-2025’ ప్రకారం కల్పించాల్సిన రూ.5 లక్షల ప్రమాద బీమాను కూడా అమలు చేయడం లేదు. దానికితోడు చిన్న చిన్న కారణాలకే డ్రైవర్ పార్టనర్‌లను యాప్ నుంచి తొలగించడం, జరిమానాలు విధించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. కస్టమర్ల ఫిర్యాదులకు ఇస్తున్న ప్రాధాన్యత, డ్రైవర్ పార్టనర్ సమస్యలకు ఇవ్వడం లేదని యూనియన్ ఆరోపిస్తోంది.
ప్రభుత్వానికి, యాజమాన్యానికి హెచ్చరిక
తమ 16 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఇప్పటికే పోర్టర్ యాజమాన్యానికి అందించినా, ఇప్పటివరకు ఎటువంటి స్పందన రాలేదని యూని యన్ నాయకులు తెలిపారు. ఈ నేపథ్యంలో మార్చి 24, 25 తేదీల్లో నిరసన దీక్షలు, మార్చి 30న రవాణా కమిషనర్ కార్యాలయం వద్ద నిరసన కార్య క్రమాలు చేపట్టారు. ప్రభుత్వం, యాజమాన్యం వెంటనే స్పందించి చర్చలు జరపాలనీ, లేనిపక్షంలో నేటి నుంచి సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరించారు. డ్రైవర్ పార్టనర్ల సమస్యలను పరిష్కరించకపోతే, రాబోయే రోజుల్లో రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని యూనియన్ స్పష్టం చేసింది.
ముఖ్యమైన డిమాండ్లు ఇలా..
పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా టారిఫ్ (చార్జిల)ను పెంచాలని, కమిషన్‌ను 5-8 శాతానికి మాత్రమే పరిమితం చేయాలని డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. అన్యాయమైన సస్పెన్షన్లను రద్దు చేయాలని, ‘డ్రైవర్ రీజన్’ ఆప్షన్ తొలగించాలని కోరారు. డ్రైవర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా, రూ.5లక్షల జీవిత బీమా కల్పించాలన్నారు. ఆర్డర్లను రద్దు చేసే హక్కు డ్రైవర్లకు ఉండాలని, పిక్ అప్ లొకేషన్‌ను 3 కిలోమీటర్లకు పరిమితం చేయాలని, పార్ట్ లోడ్ ఆప్షన్‌ను రద్దు చేయాలని, ప్రతి ట్రిప్పుకు డ్రైవర్ భద్రతను నిర్ధారించాలని డిమాండ్ చేశారు.
చిన్న కారణాలకే ఐడీలు బ్లాక్ : బి. మహేష్, డ్రైవర్ పార్టనర్
ఏ చిన్న సమస్య వచ్చినా.. మాట వినే నాథుడు లేడు. కస్టమర్ చిన్న కంప్లైంట్ ఇస్తే చాలు, విచారణ లేకుండానే సస్పెండ్ చేస్తున్నారు. యాక్సిడెంట్ అయితే యాజమాన్యం నుంచి కనీస స్పందన ఉండదు. మోటార్ వెహికల్ చట్టం ప్రకారం ఇవ్వాల్సిన రూ.5 లక్షల ప్రమాద బీమా, రూ.5 లక్షల జీవిత బీమా హామీలను గాలికొదిలేశారు. మా కష్టాన్ని కమీషన్ల రూపంలో దోచుకుంటూ మమ్మల్ని రోడ్డున పడేశారు.
జీవన వ్యయానికి అనుగుణంగా రేట్లు పెంచాలి : మహమ్మద్ సాజిద్, డ్రైవర్ పార్టనర్
పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతుంటే, మాకు ఇచ్చే రేట్లు మాత్రం పాతాళానికి పడిపోయాయి. గతంలో వచ్చిన ఆదాయం ఇప్పుడు సగానికి పైగా పడిపోయింది. 16 డిమాండ్లతో యాజమాన్యానికి నోటీసు ఇచ్చినా ఏమాత్రం స్పందించలేదు. అందుకే అనివార్యంగా సమ్మె బాట పట్టాల్సి వచ్చింది. మా హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తాం.
సమ్మెకు సహకరించండి
యాజమాన్యానికి ఎన్నిసార్లు విన్నవించినా, నోటీసులు ఇచ్చినా స్పందించడం లేదని, కార్మికుల పట్ల వారికున్న నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం. కస్టమర్లు ఈ విషయాన్ని అర్థం చేసుకుని, కార్మికుల శ్రేయస్సు కోసం ఈ ఒక్కరోజు సమ్మెకు సహకరించాలి. పోర్టర్ యాప్‌లో బుకింగ్‌లు చేయకుండా.. కార్మికుల పోరాటానికి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
– కె. అజయ్ బాబు, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్-సీఐటీయూ
‘పోర్టర్’ దగా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



