దేవాదాయ శాఖ భూములను పరిరక్షించాలి
ఈవో పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదించాలి
అర్చక, ఉద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డివిఆర్ శర్మ
నవతెలంగాణ – పాలకుర్తి
రాష్ట్రవ్యాప్తంగా దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న ఈవో పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టాలని అర్చక ఉద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డివిఆర్ శర్మ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖను అర్చక, ఉద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు భేతి రంగారెడ్డి రంగారెడ్డి తో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డివిఆర్ శర్మ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుండి రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖలో అడిషనల్ క్యాడర్ పోస్టులు మంజూరు లేకపోవడంతో పరిపాలన ఇబ్బందికరంగా మారిందని తెలిపారు. ఉన్న కొద్ది మంది సిబ్బందికి అదనపు బాధ్యతలు అప్పగించడంతో పని భారం ఎక్కువైందని అన్నారు. రాష్ట్రంలో 190 ఈవో పోస్టులు ఖాళీగా ఉన్నాయని, చాలామంది ఈవోలు 10 నుండి 25 దేవాలయాలకు ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకు వెళ్ళామని తెలిపారు.
దేవాదాయ శాఖలో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 కార్య నిర్వహణ అధికారుల నియామకాన్ని ప్రభుత్వం వెంటనే భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. కార్యనిర్వణ అధికారుల పోస్టులు భర్తీ చేయడంతో ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక భారం పడబోదని తెలిపారు. ఈవో పోస్టుల భర్తీకి మంత్రివర్గం చర్యలు చేపట్టి ఆమోదించాలని కోరారు. రాష్ట్రంలోని ఆలయాలకు వేలకోట్ల విలువచేసే భూములు ఉన్నాయని, రాష్ట్రంలో దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న భూములన్ని అన్యాక్రాంతమవుతున్నాయని వివరించారు. దేవాదాయ శాఖ భూములను పరిరక్షించేందుకు ప్రభుత్వం దృష్టి పెట్టాలని మంత్రిని కోరారు. స్పందించిన మంత్రి సురేఖ మాట్లాడుతూ ఈవో పోస్టుల భర్తీతోపాటు భూములను పరిరక్షించేందుకు త్వరలో జరగబోయే మంత్రివర్గంలో చర్చిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. మంత్రి హామీ ఇవ్వడంతో అర్చక ఉద్యోగ జేఏసీ నాయకులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్చక, ఉద్యోగ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తక్కర్సు సత్యం ,శ్యాం కుమార్, జైపాల్ రెడ్డి,వెంకయ్య, ఓమ్ ప్రకాష్ లు పాల్గొన్నారు.
దేవాదాయ శాఖలోని పోస్టులను భర్తీ చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES