Monday, December 29, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలువిద్యా ప్రతిష్టను పెంచాలి

విద్యా ప్రతిష్టను పెంచాలి

- Advertisement -

ప్రభుత్వ విద్యను కాపాడాలి
మెరుగైన విద్యను అందించేందుకు కృషి
మారుతున్న సమాజంలో పెరిగిన ఉపాధ్యాయుల పాత్ర : జనగామలో టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర విద్యా సదస్సులో మంత్రి సీతక్క
ఉపాధ్యాయుల మహా ప్రదర్శన

నవతెలంగాణ-జనగామ
విద్యా ప్రతిష్టతను పెంచుకొని ప్రభుత్వ విద్యను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మంత్రి సీతక్క (ధనసరి అనసూర్య) అన్నారు. ఆదివారం జనగామ జిల్లా కేంద్రంలోని మాంగల్య ఫంక్షన్‌ హాల్‌ సయ్యద్‌ జియావుద్దీన్‌ ప్రాంగణం, రావెళ్ల రాఘవయ్య వేదికలో టీఎస్‌ యూటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి అధ్యక్షతన ఆ సంఘం రాష్ట్ర విద్యా సదస్సు, రాష్ట్ర కమిటీ విస్తృత సమావేశాలు జరిగాయి. అంతకుముందు ఉపాధ్యాయులు జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్కు నుండి అంబేద్కర్‌ చౌరస్తా మీదుగా హైదరాబాదు రోడ్డు సభాస్థలి వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ విద్యా సదస్సులో మంత్రి సీతక్క మాట్లాడుతూ శాస్త్రీయ విద్యా విధానం కోసం భాగస్వాములు అవుతున్న టీఎస్‌యూటీఎఫ్‌ ఉపాధ్యాయులు విద్యావిలువలు పెంపొందించేందుకు కషి చేయాల న్నారు. అత్యంత విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు నేర్పించాలన్నారు. విద్యావ్యవస్థ, విజ్ఞాన అభివృద్ధి ఉపాధ్యాయుల చేతిలో ఉంటుందన్నారు.

విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చేదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు. ఈ విషయంలో టీఎస్‌ యూటీఎఫ్‌ ఉపాధ్యా యుల బాధ్యత అధికంగా ఉండాలన్నారు. ఉపాధ్యాయులు సామాజిక నిర్దేశకులని, మారుతున్న సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర మరింత పెరిగిందని అన్నారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్స్‌ పరిష్కా రానికి కృషి చేస్తామన్నారు. విద్యావ్యవస్థలో ఉన్న సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం పరిష్కరించేందుకు కృషి చేస్తోందన్నారు. రోజు రోజుకు అబద్ధాల ప్రచారాలు పెరిగిపోతున్నాయని, ఈ సందర్భంగా నిజాలు మాట్లాడు కోవడానికి ఇలాంటి విద్యా సదస్సులు అవసరమని అన్నారు. తాను పెరిగిన వాతావరణం, పడ్డ బాధలు తనకు తెలుసునని అందుకే ప్రజల మధ్యనే ఉంటానని అన్నారు. ప్రభుత్వ విద్య పరిరక్షణతో పాటు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్స్‌ను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని, పరిష్కారం చేస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉపాధ్యాయుల సహకారం, భాగస్వామ్యం ఉండాలన్నారు.

ప్రభుత్వ విద్యను కాపాడుకోవాలి : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతుందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి అన్నారు. ఈ సదస్సులో రాజేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ… ప్రభుత్వ విద్య నాణ్యత ఉన్నప్పటికీ తల్లిదండ్రులు ఎందుకు దూరం అవుతున్నారని ఇది ఆలోచించాల్సిన విషయమని అన్నారు., విద్య ద్వారా మాత్రమే సమాజం అభివృద్ధి సాధ్యమని అన్నారు.

దినసరి కూలీలుగా మారే ప్రమాదం : మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
రానున్న రోజుల్లో ఉపాధ్యాయ, ఉద్యోగులు దినసరి కూలీగా మారే ప్రమాదం ఉందని మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. దేశంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం, అస్తవ్యస్తంగా మారిందన్నారు. అసమానతల్లో ప్రపంచంలోనే భారతదేశం మొదటి స్థానంలో ఉందన్నారు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగ కల్పన లేకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదన్నారు. ప్రజా వ్యతిరేక విధానాల ఎన్ని చేసినా తమల్ని గెలిపిస్తున్నారనే దానితో అనేక ప్రజావ్యతిరేక విధానాలను కేంద్రం అవలంబిస్తుందని విమర్శించారు. ఐక్య ఉద్యమాలతో ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఉద్యోగ సమస్యల పరిష్కారంలో విజయం సాధిస్తాం : టీజీఈ జేఏసీ చైర్మెన్‌ మారం జగదీశ్వర్‌
ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలు ప్రభుత్వంతో సానుకూల వాతావారణంలో పరిష్కరించుకుంటామని టీజీఈ జేఏసీ ఛైర్మెన్‌ మారం జగదీశ్వర్‌ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం నెలకు రూ.700 కోట్లు ఇవ్వడం వల్ల పెండింగ్‌ బిల్లుల సత్వరం పరిష్కారం కావడం లేదని అన్నారు. దాని స్థానంలో నెలకు రూ.1500కోట్లు ఇవ్వాలని అలా అయితే సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. పీజీఓ రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాస రావు మాట్లాడుతూ టీఎస్‌ యూటీఎఫ్‌ క్రమశిక్షణ కలిగిన సంఘం అని అన్నారు.

ఈ సదస్సులో టీఎస్‌ యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చావ రవి, ఏ.వెంకట్‌, ఉపాధ్యక్షులు దుర్గ భవాని, జంగయ్య, కోశాధికారి లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు రాజశేఖర్‌ రెడ్డి, సత్యానంద్‌, వి. శాంతి కుమార్‌, శారదా, రంజిత్‌ కుమార్‌, బి. రాజు, రవి ప్రసాద్‌ గౌడ్‌, రవి కుమార్‌, శ్రీధర్‌, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్‌రావు, వెంకటేష్‌, రాష్ట్ర, జిల్లా నాయకులు జయప్రకాష్‌, హేమలత, శ్రీనివాస రావు, కృష్ణ కందుల శ్రీనివాస్‌, కృష్ణమూర్తి, వసంత్‌ నాయక్‌, తోట వెంకటేశ్వర్లు, యాదవ రెడ్డి, శ్రీహరి, కనకయ్య, ఉప్పలయ్య, రాము, రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి ఉపాధ్యాయులు హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -