Friday, January 2, 2026
E-PAPER
Homeబీజినెస్కమర్షియల్‌ సిలిండర్‌పై రూ.111 పెంపు

కమర్షియల్‌ సిలిండర్‌పై రూ.111 పెంపు

- Advertisement -

ఎల్‌టీఎఫ్‌ సిలిండర్ల ధరలు కూడా…

న్యూఢిల్లీ : నూతన సంవత్సరం ప్రారంభమైన రోజే వాణిజ్య ఎల్పీజీ వినియోగదారులకు చమురు కంపెనీలు షాక్‌ ఇచ్చాయి. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలు గురువారం నుంచి పెరగడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య వినియోగదారులపై ఆర్థిక భారం పడుతోంది.19 కిలోల వాణిజ్య ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.111 పెంచుతూ చమురు మార్కెటింగ్‌ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వచ్చింది. ఈ సవరణతో 19 కిలోల వాణిజ్య సిలిండర్‌ ధర ఢిల్లీలో రూ.1,681.50కి చేరింది. వాణిజ్య సిలిండర్‌ రేట్లతో పాటు ఐదు కిలోల ఫ్రీ ట్రేడ్‌ ఎల్పీజీ (ఎఫ్‌టీఎల్‌) సిలిండర్ల ధరలు కూడా పెరిగాయి.

ఒక్కో సిలిండర్‌ ధర రూ.27 పెరిగింది. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్లు, ఎఫ్‌టీఎల్‌ సిలిండర్ల రేట్లు పెంచిన చమురు మార్కెటింగ్‌ కంపెనీలు గృహ వినియోగదారుల జోలికి మాత్రం పోలేదు. డొమెస్టిక్‌ ఎల్పీజీ సిలిండర్ల ధరలలో ఎలాంటి మార్పు లేదు. వాణిజ్య ఎల్పీజీ ధరల్లో చేసిన సవరణ కారణంగా వాటిపై ఆధారపడుతూ వ్యాపారాలు చేసుకునే వారిపై ఆర్థిక భారం పడుతోంది. ముఖ్యంగా తినుబండారాలు తయారు చేసే వారు, క్యాటరింగ్‌ సర్వీసులు అందించే వారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసే వారు ఆర్థికంగా ఇబ్బంది పడక తప్పదు. చమురు మార్కెటింగ్‌ కంపెనీలు తదుపరి సవరణ చేసే వరకూ తాజాగా ప్రకటించిన నూతన రేట్లు అమలులో ఉంటాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -