హైదరాబాద్‌లో రూ.1960కి పైనే!
బడ్జెట్ రోజునే వంట గ్యాస్ ధరలకు రెక్కలు
చిన్న హోటళ్లు, వినియోగదారులపై ప్రభావం
న్యూఢిల్లీ : బడ్జెట్ రోజునే కేంద్రం ప్రజలకు షాకిచ్చింది. దేశవ్యాప్తంగా వాణిజ్య వంట గ్యాస్ (ఎల్పీజీ) సిలిండర్ ధరలను చమురు సంస్థలు పెంచాయి. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్‌పై రూ.49 మేర ధర పెంపు అమల్లోకి వచ్చింది. తాజా ధరల పెంపుతో చిన్న చిన్న హౌటళ్లు, దుకాణాలు, వినియోగదారులపై ప్రభావం పడనున్నది. చెన్నైలో సిలిండర్ ధర రూ.50 పెరగగా.. కోల్‌కతా, ముంబయి నగరాల్లో రూ.49.50 చొప్పున పెరిగింది. ముంబయిలో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1692గా ఉంది. ఢిల్లీలో సిలిండర్ ధర రూ.49 పెరిగి రూ.1740.50కు చేరుకున్నది. కోల్‌కతాలో ఈ సిలిండర్ ధర రూ.1844.50కు, చెన్నైలో రూ.1899కి ఎగబాకాయి.
కేరళలోని ఎర్నాకులంలో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1747గా నమోదైంది. ఇక హైదరాబాద్‌లో 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.49 పెరిగింది. దీంతో ప్రస్తుతం రూ.1912.50గా ఉన్న ధరర రూ.1960కి పైగా ఎగబాకింది. ఈ ధరల బాదుడుతో హౌటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, మెస్‌లు, క్యాటరింగ్ సర్వీసులు, టీస్టాళ్లు, బేకరీలు, కేఫ్‌లు, హాస్టళ్లు, లాడ్జ్‌లు, చిన్న ఆహార-ఆధారిత వ్యాపారాలపై ప్రత్యక్ష ప్రభావం పడనున్నది. చిన్న హోటళ్లు, దుకాణాల యజమానులకు తాజా నిర్ణయం భారం కానున్నది. ఇక వినియోగదారుల పైనా పరోక్ష ప్రభావం చూపే ఈ ధరల పెంపు.. వారి జేబులకు చిల్లులు పెట్టనున్నది.



