– మెదక్ జిల్లా కౌడిపల్లిలోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల విద్యార్థుల డిమాండ్
– జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో
నవతెలంగాణ-కౌడిపల్లి
లంబాడీ కులం పేరుతో విద్యార్థులను దూషిస్తూ చీటికిమాటికీ కొడుతూ చిత్రహింసలు పెడుతున్నారని మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల విద్యార్థులు మంగళవారం రోడ్డెక్కి ధర్నా చేపట్టారు. కులం పేరుతో దూషిస్తున్న ప్రిన్సిపల్ ఫణికుమార్, సోషల్ టీచర్ ఉదరు కుమార్‌ను సస్పెండ్ చేసేంతవరకు ధర్నా విరమించమని రోడ్డుపై విద్యార్థులు భీష్మించుకు కూర్చున్నారు. 8,9,10 తరగతులకు చెందిన 130 మంది విద్యార్థులు జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. సోషల్ టీచర్ ఉదరు క్లాస్‌రూమ్‌లోకి వచ్చి తరచూ లంబాడీ కులం పేరుతో దూషిస్తూ.. విద్యార్థులను చిత్రహింసలు పెడుతున్నారని తెలిపారు. అంతేకాకుండా, ‘కాలు బూటంతా లేరు.. నా చేతికున్న వాచ్ అంత కాదు మీరు’ అంటూ సూటిపోటి మాటలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయం ప్రిన్సిపల్ ఫణికుమార్‌కు చెబితే తాను కూడా కులం పేరుతో దూషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గట్టిగా నిలదీస్తే హాస్టల్‌లో పెట్టే భోజనం తింటూ దున్నపోతుల్లా తిరుగుతున్నారే తప్ప చదవడం లేదని, అలాంటి వారికి అన్నం తినే అర్హత లేదంటూ దూషిస్తున్నారని అన్నారు. ఈ బాధలను తట్టుకోలేక మేమంతా జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకోకు దిగామని తెలిపారు. అకారణంగా కొడుతున్నారని, ఎవరికి చెప్పుకొంటారో దిక్కున్న చోట చెప్పుకోమని హేళన చేయడం ఏమిటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులెవరూ తమపై జాలి చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ తప్పులుంటే అధికారులు వచ్చి మమ్మల్ని నిలదీయాలని, లేదంటే ప్రిన్సిపల్, టీచర్ తప్పు ఉన్నట్టయితే వారిని వెంటనే సస్పెండ్ చేసేలా చర్యలు తీసుకోవాలని, అప్పటి వరకు పాఠశాలకు రామంటూ స్పష్టంచేశారు.
కాగా, పదవ తరగతి విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా ధర్నాలో కూర్చొని ఇద్దరి టీచర్లను సస్పెండ్ చేసేంతవరకు పరీక్షలు రాయబోమని తేల్చిచెప్పారు. తమ సమస్యలపై నిలదీయడానికి వచ్చిన అధికారులను సైతం పోలీసులను రప్పించి బెదిరిస్తున్న ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, విషయం తెలుసుకున్న పోలీసులు విద్యార్థులు చేస్తున్న ధర్నా వద్దకు చేరుకొని వారికి నచ్చ చెప్పారు. అనంతరం విద్యార్థులు ధర్నా విరమించారు. ఇదే క్రమంలో 8, 9 తరగతుల విద్యార్థులు ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేసేంతవరకు పాఠశాలకు రామని బహిష్కరించి బయటకు వెళ్లిపోయారు.
కులం పేరుతో దూషిస్తున్న ప్రిన్సిపల్, టీచర్‌ను సస్పెండ్ చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



