– మాజీమంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో గురుకులాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గడిచిన 48 గంటల్లో మంచిర్యాల గిరిజన ఆశ్రమ పాఠశాల, సంగారెడ్డి జిల్లా, నారాయణ్ ఖేడ్, నాగల్‌గిద్ద మోడల్ పాఠశాల, నాగర్‌కర్నూల్ జిల్లా, పెద్ద కొత్తపల్లి గురుకుల పాఠశాల, జగిత్యాల రూరల్ మండలం, లక్ష్మిపూర్ గ్రామం గురుకుల పాఠశాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం గురుకుల కళాశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగాయని తెలిపారు. ఈ ఘటనలు కాంగ్రెస్ అసమర్థ పాలనకు నిదర్శనమని విమర్శించారు. ప్రతిపక్షాలపై నోరు పారేసుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రోజు రోజుకీ దిగజారుతున్న గురుకులాల దీనస్థితి కనిపించడం లేదా? వరుసగా ఫుడ్ పాయిజన్లు జరిగి పదుల సంఖ్యలో విద్యార్థులు ఆసృపత్రి పాలవుతుంటే మనస్సు కరగడం లేదా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. కేసీఆర్ గురుతులు చెరిపేయాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి గురుకులాల వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుండటం చారిత్రక నేరమని పేర్కొన్నారు. సంకుచిత మనస్తత్వంతో దళిత, గిరిజన, బడుగు, మైనార్టీ వర్గాల పిల్లలు చదువుకునే గురుకులాల ఖ్యాతికి గ్రహణం పట్టిస్తుండటం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా తానే మానిటరింగ్ చేస్తానని బీరాలు పలికిన రేవంత్ రెడ్డి, మీ మానిటరింగ్ ఏమైంది? విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉండి మీరు చేస్తున్నదేమిటి? ఢిల్లీకి చక్కర్లు కొట్టడం తప్ప, రాష్ట్రంలో పరిపాలనను చక్కదిద్దడం చేతగాదా? 20 నెలల కాంగ్రెస్ పాలనలో పాము కాట్లు, ఆత్మహత్యలు, ఫుడ్ పాయిజనింగ్‌లతో 100కు పైగా గురుకుల విద్యార్థులు ప్రాణాలు కోల్పోతే ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదు? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ గురుకులాల ఖ్యాతిని ఎవరెస్ట్ శిఖరం ఎత్తున నిలబెడితే.. రేవంత్ రెడ్డి అధ్ణపాతాళానికి దిగజార్చారని హరీశ్‌రావు విమర్శించారు.
గురుకులాల సమస్యలు పరిష్కరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES