– హామీలు అమలు చేయకుండా కాలయాపన
– ప్రజాభవన్‌వద్ద కార్మికుల నిరసన : సీఐటీయూ, హాస్టల్ డైలీవేజ్, ఔట్ సోర్కింగ్ వర్కర్స్ యూనియన్స్ జేఏసీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని సీఐటీయూ, హాస్టల్ డైలీవేజ్, ఔట్‌సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్, ఆ తర్వాత సంక్షేమ భవన్ వద్ద వర్కర్లు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ప్రజావాణి రాష్ట్ర నోడల్ ఆఫీసర్ దివ్య, గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, పోస్టుమెట్రిక్ హాస్టళ్లలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ వర్కర్ల సమస్యల పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి, జేఏసీ రాష్ట్ర కన్వీనర్ బి మధు అధికారులను కోరారు. డైలీ వేస్ వర్కర్లకు ఒక్కో జిల్లాలో ఒక్కో రీతిన మూడు నెల్ల నుంచి 12 నెల్ల వరకు వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. వాటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వారం రోజుల్లో పెండింగ్ వేతనాలన్నింటిని చెల్లిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఔట్ సోర్సింగ్ వర్కర్లకు క్యాటరింగ్ జీవో 527 రద్దు చేయాలని రూ.15,600 జీతం ఇవ్వాలనీ, వారాంతపు సెలవులు అమలు చేయాలనీ, సంవత్సరానికి 15 రోజులు సాధారణ సెలవులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రూ. 15,600 వేతనంచెల్లించే విషయంపై ఇప్పటికే ఫైల్ ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉందనీ, పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తామనీ, సెలవులు అమలు చేయడానికి అవసరమైన సర్కులర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. డైలీ వర్కర్లకు టైం స్కేల్ అమలు చేయాలని గత సమ్మె సందర్భంగా హామీ ఇచ్చారని గుర్తు చేయగా..ఈ విషయం ఇప్పటికే ప్రభుత్వం దృష్టిలో ఉందనీ, ఆర్థిక శాఖ మంత్రతో పాటు ఆ శాఖ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని అధికారులు తెలిపారు.
కార్మికులపై తీవ్రమైన పని భారం పడుతున్నదనీ, పెరిగిన పని భారానికనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలనీ, మరణించిన కార్మికుల స్థానంలో వారి వారసులను తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయం అధికారుల పరీశీలనలో ఉందని సాధ్యమైనంత మేరకు సమస్యను పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సెప్టెంబర్ నెలలో జరిగిన చర్చల ఆధారంగా తగ్గించి వేసిన నాలుగు నెల్ల జీతాలకు మిగిలిన పెండింగ్ జీతాన్ని ఏరియస్ రూపంలో చెల్లిస్తామని హామీ ఇచ్చారనీ, ఆ హామీని అమలు చేయాలని కోరారు. దీనిపై ఏడీ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ, జేఏసీ కె బ్రహ్మాచారి, మంగీలాల్ జలంధర్, అనంతరాములు హీరోలాల్, ముత్తయ్య, జయ, తిరుపతమ్మ, మణి, శ్రీను ,సేవ్య, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
గిరిజన హాస్టల్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



