తెలంగాణ యునైటెడ్ ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులు
ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద ‘ఆటో ఆకలి కేకలు’ మహాసభ
నవతెలంగాణ – ముషీరాబాద్
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆటో డ్రైవర్లకిచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ యునైటెడ్ ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద ‘ఆటో ఆకలి కేకలు’ పేరుతో మహాసభ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆటో కార్మికులు తరలివచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆటో జేఏసీ చైర్మెన్ గాజుల ముఖేష్‌గౌడ్‌్ మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని, సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని కోరారు. మహాలక్ష్మి పథకం వల్ల నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న ప్రతి ఆటోడ్రైవర్ కుటుంబానికీ రూ.25 లక్షల నష్టపరిహారం చెల్లించి కుటుంబంలో ఒక్కరికి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఇల్లు లేని ఆటో డ్రైవర్లకు ఇండ్ల స్థలాలు కేటాయించి ఇండ్లు నిర్మించాలన్నారు.
రాష్ట్ర అధ్యక్షులు మంద రవికుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 7.5 లక్షలకు పైచిలుకు ఆటో డ్రైవర్లు ఉన్నారని, కుటుంబ సభ్యులతో కలిపి 30 లక్షలకు పైగా ఓటు బ్యాంకు కలిగి ఉన్నామన్నారు. తమను వాడుకుంటున్నారుగానీ ఏ ప్రభుత్వమూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో రంగాన్ని కాపాడుకోవాలంటే ఏకైక మార్గం పోరాటం చేయడమేనన్నారు. 32 రోజులుగా ఆటో రథయాత్ర రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించి సభలు, సమావేశాలు పెట్టి విజయవంతం చేశామని తెలిపారు. మహాలక్ష్మి పథకంతో ఆటోరంగం పూర్తిస్థాయిలో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని తెలిపారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారం ప్రతి ఆటో కార్మికునికీ రూ.12 వేలు నెల నెలా అందజేయాలని కోరారు. ప్రయివేటు ఫైనాన్స్ ఆగడాలను అరికట్టి వడ్డీ స్లాబ్ సిస్టం తొలగించాలని, బ్యాంకుల సిస్టం అమలు చేసి ఫైనాన్స్ పేపర్లు తెలుగు భాషలో ఉంచాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఆటోలకు స్టేట్ పర్మిట్ ఇవ్వాలన్నారు. ఆటో కార్మికుల డిమాండ్‌లు పరిష్కరించకపోతే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఎండీ హబీబ్, వేముల మారయ్య, బగుడాల సాయిలు, ఎంఏ సలీం, ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు.